Amaravati, Jan 25: ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికలను స్టేట్ ఎన్నికల కమిషన్ రీ షెడ్యూల్ (AP Panchayat Polls Schedule Revises) చేసింది. రెండో దశ ఎన్నికలను తొలి దశగా మారుస్తూ రీ షెడ్యూల్ ప్రకటించింది. మూడో దశ ఎన్నికలను రెండో విడతగా, నాలుగో దశ ఎన్నికలను మూడో విడతగా ఎస్‌ఈసీ మార్పు చేసింది. మొదటి దశ ఎన్నికలను నాలుగో విడతగా మార్చింది. ఎన్నికల ఏర్పాట్లు పూర్తికానందున రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది.
ఫిబ్రవరి 9, 13, 17, 21 తేదీల్లో పంచాయతీ ఎన్నికల పోలింగ్ (AP Panchayat Polls 2021) జరగనుంది. తొలి దశకు ఈ నెల 29 నుంచి, రెండో దశకు ఫిబ్రవరి 2 నుంచి, మూడో దశకు ఫిబ్రవరి 6 నుంచి, నాలుగో దశకు ఫిబ్రవరి 10 నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఫిబ్రవరి 9న తొలి విడత, ఫిబ్రవరి 13న రెండో దశ, ఫిబ్రవరి 17న మూడో దశ, ఫిబ్రవరి 21న నాలుగో విడత ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు.
సుప్రీంకోర్టు తీర్పు తరువాత కేంద్ర కేబినెట్ కార్యదర్శికి ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ (Nimmagadda Ramesh Kumar) లేఖ రాశారు. ‘ఎన్నికల కమిషన్‌కు ఆర్టికల్ 324 ప్రకారం జిల్లా కలెక్టర్లకు ఎన్నికల నిర్వహణ అప్పజెప్పాం. కలెక్టర్ల ఆధ్వర్యంలోనే ఎన్నికల విధులు నిర్వహించాలని భావిస్తున్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సేవలను వినియోగించుకోవాలని అనుకుంటున్నాం. కానీ కొంత మంది ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొనబోమని చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన ఉద్యోగుల సేవలకు అనుమతివ్వండి. చివరి ప్రయత్నంగా మాత్రమే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను వినియోగించుకుంటాం’ అని కేంద్రానికి రాసిన లేఖలో నిమ్మగడ్డ పేర్కొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టు తీర్పు పూర్తిగా చదివాక స్పందిస్తామని ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఎలాంటి అంశాలు పొందుపరిచిందో.. అధ్యయనం చేశాక కార్యాచరణ ఉంటుందని విజయసాయిరెడ్డి చెప్పారు.
ఇదిలా ఉంటే సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ముఖ్యనేతలు, అధికారులతో సీఎం జగన్ అత్యవసర భేటీ అయినట్లు సమాచారం. ఈ భేటీకి డీజీపీ గౌతమ్ సవాంగ్, ఏజీ శ్రీరామ్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరయినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే సుప్రీంకోర్టు తీర్పు పూర్తి కాపీ చదివిన తర్వాతే.. తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..వ్యాక్సిన్ ఇచ్చాకే ఎన్నికలు నిర్వహించాలన్నారు. ఉద్యోగుల ప్రాణాలను కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. అందుకే సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ వేశామని చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలపై దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పును వెలువరించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేసింది. ఎస్‌ఈసీ నిర్ణయాల్లో తాము తలదూర్చలేమని పేర్కొంది. ఎన్నికల వాయిదాకు నిరాకరించింది. కాగా ఏపీలో స్థానిక సంస్థలను నిర్వహించాలన్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్ణయాన్ని సమర్థిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై సోమవారం విచారణ చేపట్టిన జస్టిస్ సంజయ్ కిషన్‌కౌల్, జస్టిస్ హృషీకేష్‌రాయ్‌లతో కూడిన ధర్మాసనం తాజా తీర్పును వెలువరించింది.