Amaravti, April 4: ఏపీలో కోవిడ్ 19 (COVID-19) మహమ్మారి తీవ్ర ఆందోళనను కలిగిస్తోంది. తాజాగా కరోనా (coronavirus) మహమ్మారికి ఆంధ్రప్రదేశ్‌లో మరొకరు బలి (Second COVID-19 Death in AP) అయ్యారు. అనంతపురం జిల్లా హిందుపురానికి (Hindupur) చెందిన ముస్తాక్ ఖాన్ (56) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందారు. ఈ మేరకు వైద్యులు అతని మరణాన్ని ధృవీకరించారు.
ఆంధ్రప్రదేశ్‌లో తొలి కోవిడ్-19 మరణం నమోదు
దీంతో రాష్ట్రంలో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య రెండుకు చేరింది. శనివారం కొత్తగా మరో 16 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 180కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ జవహర్ రెడ్డి హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.
జిల్లాల వారిగా నెల్లూరులో అత్యధికంగా 32, కృష్ణా 27, గుంటూరు 23, వైఎస్సార్ కడప 23, ప్రకాశం 18, పశ్చిమ గోదావరి 15, విశాఖపట్నం 15, చిత్తూరు 10, తూర్పు గోదావరి 11, అనంతపురంలో 2 పాటిజివ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే పాజిటివ్ కేసులుగా నమోదైన వారిలో ఇప్పటి వరకు నలుగురు డిశ్చార్జ్ అయ్యారు.
ఢిల్లీలోని జమాత్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన 16మంది హిందూపూర్ వాసులకు కరోనా వైద్య పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ అని వచ్చినట్లు వైద్య అధికారులు తెలిపారు. వారందర్నీ ఇదివరకే క్వారంటైన్‌కు తరలించిన విషయం తెలిసిందే. వీరందరికి నెగిటివ్ రావడంతో పట్టణ ప్రజలు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
కాగా హిందూపురంలో ఓ మహిళకు పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. ఆమె బంధువులు, ఆమెను కలిసిన 19మందికి కూడా వైద్య పరీక్షల కోసం నమూనాలను సేకరించి అనంతపురం పంపారు. వీరి ఫలితాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో షేక్ సుభాని (55) అనే వ్యక్తి చికిత్స పొందుతూ శుక్రవారం మరణించినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఇది తొలి కరోనా మరణంగా నమోదైంది. ప్రభుత్వం విడుదల చేసిన మీడియా బులిటెన్ ప్రకారం.. షేక్ సుభాని డయాబెటిస్ కార్డియాక్ ఆరోగ్య సమస్యలతో మార్చి 30న విజయవాడలోని జనరల్ ఆస్పత్రిలో చేరారు.
కరోనా కట్టడికి రాష్ట్రాలకు అత్యవసర నిధులు
అయితే అతని కుమారుడు ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లి వచ్చినట్లు గుర్తించిన వైద్యులు.. కుమారుడితో పాటు సుభానికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరికీ కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ మేరకు సుభానికి చికిత్స అందిస్తుండగానే శుక్రవారం మధ్యాహ్నం 12. 30 నిమిషాలకు మృతి చెందారని తెలిపారు.