New Delhi, Feb 26: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో (Skill Development Scam Case) టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది. మూడు వారాల తర్వాత పిటిషన్‌పై తదుపరి విచారణ ఉంటుందని జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ తో కూడిన ధర్మాసనం తెలిపింది. ఈ కేసులో చంద్రబాబు తరఫు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేసేందుకు సుప్రీంకోర్టు (Supreme Court) రెండు వారాలు సమయం ఇచ్చింది.
కాగా, స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని (Chandrababu's bail cancellation petition ) ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇక, ప్రభుత్వ పిటిషన్‌పై నేడు జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా.. చంద్రబాబు బెయిల్ రద్దుపై జవాబు చెప్పాలని ధర్మాసనం పేర్కొంది.
ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం తరఫున ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తూ.. స్కిల్ డివలప్‌మెంట్ కుంభకోణంలో దర్యాప్తు అధికారులను చంద్రబాబు కుటుంబ సభ్యులు బెదిరిస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే అధికారుల పనిపడతామని హెచ్చరిస్తున్నారు. ఇలా మాట్లాడుతూ బెయిల్ షరతులను ఉల్లంఘిస్తున్నారు. కనుక, వెంటనే చంద్రబాబు బెయిల్‌ను రద్దు చేయాలని కోరారు.
దీంతో, ఏపీ ప్రభుత్వం లేవనెత్తిన అంశాలపై సమాధానం చెప్పాలని సుప్రీంకోర్టు.. చంద్రబాబు తరఫు లాయర్లను ఆదేశించింది. ప్రభుత్వం లేవనెత్తిన ప్రతి అంశానికి తాము సమాధానం ఇస్తామని చంద్రబాబు తరఫు న్యాయవాదులు హరీష్ సాల్వే, సిద్ధార్థ లూథ్రా అన్నారు. ఈ సందర్భంగా తమకు కొంత సమయం కావాలని కోరారు. దీనిపై స్పందించిన ధర్మాసనం రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. మూడు వారాల తరువాత తదుపరి విచారణ చేపట్టనున్నట్లు ప్రకటించింది.