Moka Bhaskar Rao's Murder Case, Machilipatnam DSP Mahaboob Basha, Kollu Ravindra, Perni nani (Photo-Twitter)

Amaravati, July 4: ఏపీలో వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకుడు, మచిలీపట్నం మార్కెట్‌ యార్డు కమిటీ మాజీ చైర్మన్‌ మోకా భాస్కరరావు హత్యకేసును జగన్ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ కేసులో రవీంద్ర హస్తం కూడా ఉందని భాస్కర్ రావు కుటుంబ సభ్యులు పోలీసులు ఫిర్యాదు చేయడంతో టీడీపీ మాజీ మంత్రిని (TDP Leader Kollu Ravindra Arrest) పోలీసులు అరెస్ట్ చేశారు. తనను అరెస్టు చేస్తారన్న ఉద్దేశంతో ఆయన తన స్వస్థలమైన మచిలీపట్నం నుంచి విశాఖ వైపు వెళ్తూ పోలీసులకు చిక్కారు. వైసీపీ నేత హత్య కేసులో రవీంద్రకు భాగం ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యులు

గత నెల 29వ తేదీన మచిలీపట్నం చేపల మార్కెట్‌లో జరిగిన మోకా భాస్కరరావు హత్యకేసులో (Moka Bhaskar Rao Murder Case) టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రపై నాలుగో నిందితుడిగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే ఐదుగురిని అరెస్ట్‌ చేయగా, కొల్లు రవీంద్ర తూర్పుగోదావరి జిల్లా తుని మండలంలోని సీతారామపురం వద్ద పోలీసులకు చిక్కారు. కొల్లును అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ నిమిత్తం మచిలీపట్నంకు తరలిస్తున్నట్లు సమాచారం. వైఎస్సార్‌సీపీ నేత దారుణ హత్య, సైనేడ్‌ పూసిన కత్తితో మోకా భాస్కర్‌ రావును హత్యచేసిన దుండుగులు, మచిలీపట్నంలో 144 సెక్షన్

టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రోద్బలంతోనే భాస్కరరావు హత్య (YSRCP leader’s murder case) జరిగిందని మోకా బంధువులు ఆర్‌పేట పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు హత్యకు పాల్పడిన ముగ్గురితో పాటు కొల్లు రవీంద్రపైన 302, 109 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మోకా హత్యకేసులో ఇప్పటికే ప్రధాన నిందితులైన చిన్నీ, నాంచారయ్య, కిషోర్‌లతో పాటు వారికి సహకరించిన నాగమల్లేశ్వరరావు, వంశీలను అరెస్ట్‌ చేశారు. నాలుగో నిందితుడైన కొల్లు రవీంద్ర పోలీసు కళ్లుగప్పి పరారయ్యారు.

శుక్రవారం మధ్యాహ్నం బందరు డీఎస్పీ మహబూబ్‌బాషా నేతృత్వంలో పోలీసులు కొల్లు రవీంద్రను అరెస్టు చేసేందుకు ఆయన ఇంటికెళ్లారు. అయితే, ఆయన ఇంట్లో లేరు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆయన కోసం గాలించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఆయన విశాఖ వైపు కారులో వెళ్లిపోతున్నట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందడంతో విజయవాడ – విశాఖపట్నం రహదారులపై పోలీసులు నిఘా వేశారు.

రవీంద్ర మొబైల్‌ సిగ్నళ్ల ఆధారంగా ఆయన తూర్పు గోదావరి జిల్లా తుని వద్దకు రాగానే వాహనాన్ని నిలిపివేసి, ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ని కృష్ణా జిల్లా పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఆయన్ని విజయవాడకు తరలించారు. ఇదిలా ఉండగా మోకా హత్యకేసులో కొల్లు రవీంద్ర అరెస్ట్‌ చేయాలంటూ ఉల్లింఘిపాలెం వాసులు శుక్రవారం పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, బీసీ సంఘాల నేతలు జిల్లా ఎస్పీని కలిసి కొల్లుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

మోకా భాస్కరరావు హత్యలో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రోద్బలం ఉన్నట్లు నిందితుల వాంగ్మూలంతోపాటు కాల్‌డేటా, సాంకేతిక అంశాల ద్వారా రూఢీ అయిందని కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు వెల్లడించారు. అన్ని కోణాల్లో పరిశీలించిన తర్వాతే రవీంద్రపై కేసు నమోదు చేశామని చెప్పారు.