Visakhapatnam,Sep 19: విశాఖలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ నుంచి గత ఎన్నికల్లో గెలిచిన విశాఖ దక్షిణ ఎమ్మెల్యే టీడీపీ నేత వాసుపల్లి గణేష్ (TDP MLA Vasupalli Ganesh) వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ రోజు ఏపీ ముఖ్యమత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని విశాఖ దక్షిణ ఎమ్మెల్యే, టీడీపీ నేత వాసుపల్లి గణేష్ కలిశారు. శనివారం సీఎం క్యాంప్ కార్యాలయంలో తన కుమారులతో కలిసి ఆయన ...ముఖ్యమంత్రితో భేటీ (MLA Vasupalli Ganesh Meets CM YS Jagan Mohan Reddy) అయ్యారు. ఎమ్మెల్యే కుటుంబంతో పాటు వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి, కృష్ణాజిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా సీఎంను కలిసినవారిలో ఉన్నారు.
విశాఖ కేంద్రంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌ను వ్యతిరేకించిన చంద్రబాబు మాటలను వాసుపల్లి గణేష్ ఇప్పటికే విభేదించారు. అదే సమయంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కోసం ప్రతిపాదన చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌వైపు మొగ్గు చూపారు. అందులో భాగంగా ఈరోజు ముఖ్యమంత్రిని వాసుపల్లి గణేష్ కుమార్ కుటుంబ సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుమారులు ఇద్దరూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
అయితే ఎమ్మెల్యే మాత్రం వైసీపీ పార్టీ కండువా మెడలో వేసుకోలేదు. వాసుపల్లి గణేష్ కుమారులు ఇద్దరికీ కండువాలు కప్పిన సీఎం జగన్ వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ మాట్లాడుతూ ‘ఈ రోజు వైసీపీలో జాయిన్ కావడం ఆనందంగా ఉంది. నా కుమారులు కూడా చేరారు. గట్స్ ఉన్న నాయకుడిగా జగన్ కనిపించారు. ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళుతుంది ఆయన ధైర్యమే. అనేక సంక్షేమ పథకాలు క్షేత్ర స్థాయిలో అందరికీ చేరుతున్నాయి.
టీడీపీ ఇక ముందుకువస్తోందని నాకు అనిపించడం లేదు. విశాఖ ఏక్సిక్యూటివ్ కాపిటల్ ఇచ్చిన ఘనత ఆయనిది. అనేక పనులు నా నియోజకవర్గంలో ఉన్నాయి. అవన్నీ జగన్ వల్లే సాధ్యం. మేయర్ ఎన్నికల్లో విజయం సాధించి జగన్‌కు గిఫ్ట్ ఇస్తాం.’ అని అన్నారు. వాసుపల్లి గణేష్ కుటుంబం విశాఖ ప్రజల కోసం చేస్తున్న సేవలు హర్షణీయమని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. గణేష్ కుమారులు, మొత్తం కుటుంబం చాలా విద్యావంతమైన కుటుంబమన్నారు. సమాజానికి సేవ చేయాలనే ఆయన ఉద్దేశ్యం మంచిదన్నారు. వాసుపల్లి గణేష్ పార్టీలోకి రావడం కొండతా బలాన్ని ఇస్తోందని విజయసాయిరెడ్డి అన్నారు. టీడీపీలో ఈ రోజు విశాఖలో తుడుచుపెట్టుకు పోతుందండంలో సందేహం లేదన్నారు.
సీఎం చేస్తున్న అభివృద్ధిని గమనించి టీడీపీలో విద్యావంతులు వైసీపీలోకి వస్తున్నారని చెప్పారు. భవిష్యత్తులో మరింతగా చూస్తారన్నారు. చంద్రబాబుకు ప్రతిపక్షంలో ఉన్నా లేకున్నా పెద్ద తేడా ఉండదన్నారు. అసలు ప్రతిపక్షం ఉంటే కదా ప్రతిపక్ష నాయకుడు ఉండేదని, అసలు ప్రతిపక్షమే ఉండదని విజయసాయిరెడ్డి జోస్యం చెప్పారు.