TTD Sarva Darshan Tokens: టీటీడీ సర్వదర్శనానికి వ్యాక్సిన్ వేయించుకున్న సర్టిఫికెట్ తప్పనిసరి, ఈ నెల 25 నుంచి ఆన్‌లైన్‌లో సర్వదర్శనం టోకెన్లు, ప్రత్యేక ఆహ్వానితుల కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవోను కొట్టివేసిన హైకోర్టు
Tirumala Tirupati Devasthanams | Photo: Twitter

Tirumala, Sep 22: తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామివారి సర్వదర్శనం టోకెన్లను (TTD Sarva Darshan Tokens) సెప్టెంబర్ 25న ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. శనివారం ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో సర్వ దర్శనం టోకెన్లు విడుదల (TTD Sarvadarshan Tickets To Be Available) చేస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. సెప్టెంబర్‌ 26 నుంచి అక్టోబర్‌ 31 వరకు రోజుకు ఎనిమిది వేల సర్వ దర్శనం టోకెన్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయని చెప్పారు. సెప్టెంబర్‌ 26 నుంచి తిరుపతిలో ఆఫ్‌లైన్‌లో సర్వదర్శనం టోకెన్ల జారీని నిలిపి వేస్తామన్నారు.

సర్వదర్శనం టోకెన్ల కోసం పెద్ద సంఖ్యలో భక్తులు గుమికూడుతుండటం వల్ల కరోనా వేగంగా సంక్రమించే ప్రమాదం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్న సర్టిఫికెట్ కానీ, దర్శనం సమయానికి మూడు రోజుల ముందు కరోనా పరీక్ష చేయించుకుని.. నెగిటివ్ సర్టిఫికెట్ గానీ తప్పనిసరిగా తీసుకురావాలని స్పష్టం చేశారు.

విశాఖలో ఊహకందని మిరాకిల్, గోదావరి నదీ ప్రమాదంలో తమ ఇద్దరు పిల్లలు చనిపోయిన రోజే ట్విన్స్‌కు జన్మనిచ్చిన తల్లి, ఆశ్చర్యపోతున్న వైద్యులు

కొవిడ్ నియంత్రణకు టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయానికి భక్తులు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అక్టోబరు నెలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను భక్తులకు టీటీడీ అధికారులు అందుబాటులో ఉంచనున్నారు. ఇక రేపటి నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి ప్రత్యేక దర్శన టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.

ఇక సర్వదర్శనం టోకెన్ల సంఖ్యను పెంచుతూ టీటీడీ (Tirumala Tirupati Devasthanams) నిర్ణయం తీసుకుంది. ఫలితంగా ఇప్పటి వరకు చిత్తూరు జిల్లా వారికే పరిమితమైన సర్వదర్శన భాగ్యం ఇకపై అందరికీ కలగనుంది. ప్రస్తుతం చిత్తూరు జిల్లా వారికి రోజుకు 2 వేల టికెట్లను జారీ చేస్తుండగా, ఇకపై వాటి సంఖ్యను 8 వేలకు పెంచాలని టీటీడీ నిర్ణయించింది. అంతేకాక, అన్ని ప్రాంతాల వారికి దర్శనానికి అవకాశం కల్పించింది.

అదే జరిగితే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా, చంద్రబాబు రాజీనామా చేసి కుప్పం నుంచి గెలవమని సవాల్ విసిరిన మంత్రి కొడాలి నాని

పెరటాసి నెలకావడంతో శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తే అవకాశం ఉండడంతోనే టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, సర్వదర్శనం కోసం ఆధార్ కార్డు తప్పనిసరి. ఏ రోజు టికెట్లను ఆ రోజు తెల్లవారుజాము నుంచి శ్రీనివాసంలో జారీ చేస్తామని అధికారులు తెలిపారు.

ప్రత్యేక ఆహ్వానితుల కోసం జారీ చేసిన జీవో కొట్టివేత

తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిలో ప్రత్యేక ఆహ్వానితుల కోసం జారీ చేసిన జీవోను ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు సస్పెండ్‌ చేసింది. ప్రత్యేక ఆహ్వానిత సభ్యులను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేయగా.. తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ మధ్యంతర బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. ఇటీవల టీటీడీ పాలకవర్గ సభ్యులతో పాటు, పెద్ద సంఖ్యలో ప్రత్యేక ఆహ్వానితులను ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీటీడీ బోర్డు సభ్యుల నియామకాన్ని సవాల్‌ చేస్తూ పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ మేరకు కోర్టు విచారణ జరిపింది.

నిబంధనలకు విరుద్ధంగా భారీగా బోర్డు సభ్యులను, ప్రత్యేక ఆహ్వానితులను నియమించారని పిటిషనర్లు వాదనలు ఆరోపించారు. ఎక్కువ మంది సభ్యులను నియమించడం ద్వారా వారికి ఉండే అధికారాలతో దర్శనంతో పాటు సామాన్యులపై ప్రభావం పడే అవకాశం ఉంటుందని పిటిషనర్ల తరఫున న్యాయవాది వాదించారు. టీటీడీ స్వత్రంతను దెబ్బతీసే విధంగా, భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని.. ఈ మేరకు ప్రభుత్వ జీవోను రద్దు చేయాలని కోర్టును కోరారు. అయితే, నిబంధనలకు అనుగుణంగా సభ్యుల నియామకం జరిగిందని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు జీవోను సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలిచ్చింది. ఈ సందర్భంగా నాలుగు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.