Cheating Cases Filed on Nutan Naidu: తవ్వే కొద్దీ బయటకు వస్తున్న నూతన్ నాయుడు మోసాలు, తాజాగా మరో రెండు కేసులు నమోదు, కస్టడీలోకి తీసుకున్న విశాఖ పోలీసులు
Bigg Boss fame Nutan Naidu (Photo-Twitter)

Visakhapatnam, Sep 13: బిగ్ బాస్ ఫేమ్ నూతన్ నాయుడు ఆగడాలు ఒకొక్కటిగా బయటపడుతున్నాయి. యువకునికి శిరోముండనం కేసులో అరెస్టైన నూతన్ నాయుడుపై కొత్త కొత్త కేసులు (Cheating Cases on Nutan Naidu) నమోదవుతున్నాయి. మాజీ ఐఏఎస్ అధికారి పేరుతో ఫోన్ కాల్ చేసి పనులు చేయించుకున్న సంగతి వెలుగులోకి రావడంతో పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. పోలీసులు అనుమానించినట్టుగానే ఒక్కొక్కటిగా నూతన్ నాయుడు (Nutan Naidu) మోసాల చిట్టా బయటపడుతోంది.

శిరోముండనం కేసులో అరెప్ట్ అయి విశాఖ సెంట్రల్‌ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న సినీ నిర్మాత, బిగ్ బాస్ ఫేమ్ నూతన్‌ నాయుడిని గతంలో పెందుర్తి పోలీసులు కస్టడీకి తీసుకున్న విషయం తెలిసిందే. శనివారం నాడు ఏసీపీ ప్రవీణ్‌కుమార్‌, సీఐ అశోక్‌కుమార్‌ నూతన్‌ని స్టేషన్‌లోనే విచారించారు. ఆ తర్వాత సుజాతనగర్‌లోని నూతన్ ఇంటిలో, ఆయన తండ్రి సన్యాసిరావు నివాసంలోనూ సోదాలు చేశారు. పోలీసుల విచారణలో నూతన్‌నాయుడు మోసాలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. ఉద్యోగాలు, కాంట్రాక్టులు ఇప్పిస్తామని నూతన్‌నాయుడు చేసిన మోసాలపై పోలీసులు ఆరా తీశారు.

దళిత యువకుడికి శిరోముండనం, నూతన నాయుడు భార్యతో సహా ఏడుగురిపై పెందుర్తి పోలీసులు కేసు నమోదు

ప్రభుత్వ రంగ బ్యాంక్ డైరెక్టర్‌ పదవి ఇప్పిస్తామని రియల్టర్ దగ్గర రూ.12 కోట్లు స్వాహా చేసినట్టు పోలీసులు విచారణలో తెలిసింది. దాంతోపాటు అటెండర్ ఉద్యోగం ఇప్పిస్తామని ఓ వ్యక్తి వద్ద రూ.5 లక్షలు వసూలు చేసినట్టు వెల్లడైంది. ఇక పోలీసులు కస్టడీలోకి తీసుకునే ముందు.. నూతన్‌ నాయుడును అతని నివాసంలోనే పోలీసులు విచారించారు. ఈక్రమంలో అతను డ్రామాకు తెరతీశాడు. తనకు కడుపులో నొప్పిగా ఉందంటూ నాటకమాడాడు. అయితే, వైద్య పరీక్షలు నిర్వహిస్తామని చెప్పిన విశాఖ పోలీసులు అతన్ని కస్టడీలోకి తీసుకున్నారు.

ఇవేకాకుండా విశాఖ గాజువాకలో చీటింగ్ కేసు నమోదైంది. ఈ కేసుల్లో బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించాడు. తాజాగా మరో రెండు కేసులు నమోదవడంతో ఇప్పట్లో బెయిల్ వచ్చే అవకాశం లేదని పోలీసులు భావిస్తున్నారు. సామాన్యవ్యక్తిగా బిగ్‌బాస్‌ షోలో అభిమానులను సంపాదించుకుని .. సెలబ్రిటీగా తనను తాను మార్చుకున్న నూతన్‌ నాయుడు దాన్ని మోసాలకు వినియోగించినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఇంకెవరైనా ఫిర్యాదు చేసినా.. సీరియస్‌గా తీసుకోవాలని నిర్ణయించారు. నూతన్ నాయుడు.. ఆయన కుటుంబసభ్యులు .. పని వాళ్లకూ ఇంకా బెయిల్ లభించలేదు. జైల్లోనే ఉన్నారు.

గుండు కొడుతున్న సీసీటీవీ పుటేజి విడుదల, విశాఖపట్నంలో దళిత యువకుడికి గుండు కొట్టించిన నూతన్‌ నాయుడు భార్య మధుప్రియ, వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు

మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా 50 మందికి ఫోన్లు చేసి పనులు చక్కబెట్టారని ఆరోపణలపై నూతన్ నాయుడిని విచారణ చేయనున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగాలు, సినిమాల్లో పాత్రలు ఇప్పిస్తానని పలువురు నుంచి నగదు వసూళ్లపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. కాగా ఆగస్ట్ 28న శ్రీకాంత్ కు శిరోముండనం చేసిన కేసులో నూతన్ నాయుడు బంధువులు, సిబ్బంది మొత్తం ఏడుగురిని అరెస్ట్ చేసిన సంగతి విదితమే.