CM KCR Review on River Water Allocation | Photo: CMO

Hyderabad, July 31: ఉమ్మడి రాష్ట్రంలో సాగునీటి రంగంలో తెలంగాణ అనేక కష్టనష్టాలకు గురైంది, ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ హక్కును, నీటి వాటాను కాపాడుకొని తీరాలని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశం తీర్మానించింది. ఒక్క చుక్క నీటిని కూడా వదులుకునే ప్రసక్తే లేదని, ఎంతటి పోరాటానికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని సమావేశంలో ఏకాభిప్రాయం వ్యక్తం అయింది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నడుమ నెలకొని ఉన్న జలవివాదాల పరిష్కారం కోసం కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ అపెక్స్ కౌన్సిల్ ఈ ఆగస్టు 5న ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. ఇందుకు సంబంధించి అభిప్రాయం తెలపాల్సిందిగా కేంద్ర మంత్రిత్వ శాఖ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం ప్రగతిభవన్ లో నీటిపారుదలశాఖ నిపుణులు, న్యాయ నిపుణులు, పలు శాఖల ముఖ్య కార్యదర్శులు, ఇతర అధికారులతో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. నీటి వివాదాల పరిష్కారానికి అనుసరించాల్సిన వ్యూహంపై సుదీర్ఘమైన చర్చ జరిపారు. అయితే సమావేశం ఆగష్టు 5న కాకుండా పంద్రాగష్టు వేడుకలు ముగిసిన తర్వాత ఆగష్టు 20న ఉండేలా తేదీని మార్చాలనే నిర్ణయాన్ని అధికారులు వ్యక్తం చేశారు.

కాగా, ఇరు రాష్ట్రాల జల వివాదాల పరిష్కారం విషయంలో కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ పనితీరుపై అధికారులు అసంతృప్తిని వ్యక్తం చేశారు, నీటి వాటాల పంపిణీ సవ్యంగా జరిగేలా పూర్తి బాధ్యత కేంద్రమే చూసుకోవాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం పనులు ఆపాలని ఏపీకి కృష్ణా బోర్డు ఆదేశాలు

ఇరు రాష్ట్రాల మధ్య నదీజలాల వివాదాలు లేని పరిస్థితుల్లో కేంద్రమంత్రి ఆధ్వర్యంలో నీటి పంపిణీ జరగాలి. వివాదాలున్నపుడు పరిష్కార బాధ్యతను ట్రిబ్యునల్ కు అప్పగించాలి. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల మధ్య వివాదాలు ముందునుంచీ నెలకొని ఉన్న నేపథ్యంలో, పునర్విభజన చట్టం సెక్షన్ -13ను అనుసరించి వీటిని పరిష్కరించే బాధ్యతను ట్రిబ్యునల్ కు అప్పగించాలని తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచీ కోరుతూ వచ్చినా కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించిందని అసహనం వ్యక్తం చేశారు. కేంద్రం బాధ్యతారాహిత్యం వల్ల ఇరు రాష్ట్రాలు అనవసరంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు.

ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న కేసులు, ట్రిబ్యునల్ వివాదాలు న్యాయబద్దంగా పరిష్కారం కావాలని, నిరంతర ఘర్షణ ఎవరికీ మంచిది కాదని సమావేశంలో ఏకాభిప్రాయం వ్యక్తమైంది.

ఉమ్మడి రాష్ట్రంలో తీవ్రంగా నష్టపోయిన మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు సాగునీరందించేందుకు నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చి పూర్తి చేసి తీరాలని, అవాంతరాల్ని లెక్క చేయకుండా ముందుకు సాగాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించించింది.

గోదావరీ, కృష్ణా జలాల్లో తెలంగాణ రాష్ట్రం వాటాను ఎట్టి పరిస్థితుల్లో సమగ్రంగా, సమర్థవంతంగా వినియోగించుకోవాలని, ఇందుకోసం రాజీలేని వైఖరిని అనుసరించాలని ప్రాజెక్టుల నిర్మాణ పనులు శరవేగంగా ముందుకు సాగాలని, సమావేశం బలంగా అభిప్రాయపడింది.