YS Sharmila New Party Row: తెలంగాణలో వైసీపీ ఏర్పాటు సీఎం జగన్‌కు ఇష్టం లేదు, పార్టీ ఏర్పాటు నిర్ణయం అనేది షర్మిల వ్యక్తిగతం, అన్నా చెల్లెళ్ల మధ్య ఎలాంటి విభేదాలు లేవు, మీడియాతో ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి
YS sharmila key meeting (Photo-Twitter)

Hyderabad,Feb 9: ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల మంగళవారం హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో తెలంగాణకు చెందిన కొందరు వైసీపీ నేతలతో ఆత్మీయ సమ్మేళనం (YS Sharmila New Party Row) నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణలో షర్మిల మరో పార్టీ పెట్టనుందనే వార్తలు వెలువడుతున్నాయి. దీనిపై వైసీపీ పార్టీ స్పందించింది. ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి (AP government advisor Sajjala Ramakrishna Reddy) మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోట్లాది మంది ప్రజల అభిమానంతో పుట్టుకొచ్చిన పార్టీ వైఎస్సార్‌సీపీ. పదేళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చారు. తెలంగాణ రాజకీయాలపై వైఎస్‌ జగన్‌ స్పష్టమైన వైఖరితో ఉన్నారు. రెండు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకోవాలన్నదే ఆయన ఆలోచన. తెలంగాణలో పార్టీపై చాలాసార్లు చర్చ జరిగింది. ఏపీ ప్రయోజనాలు దెబ్బతింటాయని వైఎస్‌ జగన్‌ వద్దన్నారు.

షర్మిల నిర్ణయం ఆమె వ్యక్తిగతం అన్నారు. దీనికి పార్టీకి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భవానికి ఒక ప్రత్యేక సందర్భం ఉంది. కోట్లాది మంది మీద అభిమానంతో వైఎస్‌ జగన్‌ నాడు ఓదార్పుయాత్ర చేశారు. దీన్ని ఓర్చుకోని కాంగ్రెస్‌ పార్టీ బయటకు పంపించే ప్రయత్నం చేసింది. మొదట వైఎస్‌ జగన్‌, విజయమ్మ కాంగ్రెస్‌ను వీడి వచ్చారు. ఆ తర్వాత వైఎస్‌ను అభిమానించే నాయకులు పార్టీలో చేరారు.

రావాలి షర్మిల కావాలి షర్మిల, లోటస్ పాండ్‌లో ఫ్లెక్సీల జోరు, తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకురావడమే లక్ష్యం, అన్ని విషయాలు చెబుతానంటున్న వైయస్ షర్మిలా రెడ్డి

గత మూడు నెలలుగా పార్టీ తెలంగాణలో ఏర్పాటు విషయంపై చర్చ జరుగుతోంది. వైఎస్సార్‌సీపీ తెలంగాణలో ఎందుకు ఉండకూడదు అన్న చర్చ వచ్చింది.. అయితే ఆంధ్రప్రదేశే ముఖ్యమని సీఎం జగన్‌ సూచించారు. తెలంగాణలో పార్టీ వద్దని సీఎం తెలిపారు. తెలంగాణలోకి వెళ్లాలన్న ఆలోచన పార్టీకి ఏ మాత్రం లేదు. తెలంగాణలో మరో పార్టీ ప్రారంభించాలన్నది షర్మిల ఆలోచనగా కనిపిస్తోంది..ఇవి భిన్నాభిప్రాయాలే కానీ విభేదాలు కావని సజ్జల తెలిపారు.

రాజకీయ సిద్ధాంతంపై భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. అన్నా చెల్లెళ్ల మధ్య ఎలాంటి విభేదాలు లేవు. తెలంగాణలో పార్టీ వద్దని ఒక స్థిరమైన అభిప్రాయంతో సీఎం జగన్‌ ఉన్నారు. షర్మిల మాత్రం పాదయాత్ర చేసి, పార్టీ పెట్టాలన్నట్టు కనిపిస్తున్నారు. అయితే అది ఆమె వ్యక్తిగత నిర్ణయమే తప్ప పార్టీ నిర్ణయం కాదని తెలిపారు. తెలంగాణలో సుదీర్ఘకాలం షర్మిల పాదయాత్ర చేశారని, పార్టీ నిర్ణయం, ఫలితాలను షర్మిలే చూసుకుంటారన్నారు. పార్టీని కుటుంబపరం చేశారనే విమర్శలు వస్తాయని జగన్‌ భావించారన్నారు.

ఇదిలా ఉంటే నల్గొండ జిల్లా నుంచి ఆత్మీయ సమావేశానికి వచ్చిన వైఎస్ అభిమానులు, కార్యకర్తలు, అనుచరులు లోటస్‌పాండ్‌లో మీడియాతో మాట్లాడారు. వైఎస్‌తో తమకు ఉన్న అనుబంధం గొప్పదని నల్గొండ కార్యకర్తలు వెల్లడించారు. ‘మాకు షర్మిళ - జగన్ రెండు కళ్ల లాంటి వాళ్ళు’ అని వారు వ్యాఖ్యానించారు. తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టాల్సి అవసరం ఉందని.. షర్మిల తీసుకున్న నిర్ణయాన్ని 100 శాతం సహకరిస్తామని స్పష్టం చేశారు.

అన్నని కాదని కొత్త పార్టీ పెడుతోందా? లోటస్ పాండ్‌లో వైయస్ షర్మిలారెడ్డి ఆత్మీయ సమావేశం, దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి పెళ్లి రోజు నేడు, జగనన్న వదిలిన బాణం ఏం చేయబోతోంది?

కాంగ్రెస్ పార్టీ ఏమంటోంది ?

ప్రజాస్వామ్యంలో ఎవరైనా సొంతంగా పార్టీ పెట్టుకోవచ్చని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ అన్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు షర్మిల తెలంగాణలో కొత్తగా పార్టీ ఏర్పాటుపై హైదరాబాద్‌లో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో షర్మిల పార్టీపై షబ్బీర్‌ అలీ ఈ వ్యాఖ్యలు చేశారు. తమకు ఏ పార్టీ కావాలో ప్రజలే నిర్ణయించుకుంటారని ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీలు వస్తుంటాయి, పోతుంటాయని షబ్బీర్‌ అన్నారు. వైఎస్ మరణంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందని షబ్బీర్‌ పేర్కొన్నారు. వైఎస్‌కు కుటుంబసభ్యులు వారసులు కారని, కేవలం కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రమే వైఎస్‌కు నిజమైన వారసులని ఆయన తెలిపారు. వైఎస్‌ను సీఎం చేసింది కాంగ్రెస్ పార్టీనేని షబ్బీర్‌ అలీ పేర్కొన్నారు.

వైఎస్ షర్మిల ఒక్కోసారి ఒక్కొక్కరికి బాణంగా ఉపయోగపడుతుందని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క అన్నారు. షర్మిల కొత్త పార్టీపై స్పందించిన ఆమె మట్లాడుతూ ఇతర పార్టీల మేలు కోసం షర్మిల రాజన్న పేరును వినియోగించొద్దని సూచించారు. రాజీవ్ రాజ్యం అయినా, రాజన్న రాజ్యం అయినా కాంగ్రెస్‌తోనే సాధ్యమని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వేర్వేరు కాదన్నారు. షర్మిల పార్టీ వెనుక ఎవరున్నారో త్వరలో బయట పడుతుందని సీతక్క అన్నారు.

పార్టీపై ఇంకా స్పష్టత రాకముందే.. షర్మిల పార్టీ పేరుపై సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ‘తెలంగాణ వైఎస్సార్‌సీపీ’, వైఎస్ రాజన్న రాజ్యం ఏదో ఒక పేరుతో షర్మిల పార్టీ పేరు ప్రకటిస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం. మరోవైపు.. వైఎస్ఆర్, తెలంగాణ ఈ రెండు పేర్లు వచ్చే విధంగానే పార్టీ పేరు నామకరణం చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.మార్చిలో పార్టీ ప్రకటన ఉంటుందని సమాచారం. పార్టీ పేరుపై ఇప్పటికే ఈసీని సంప్రదించినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. మరోవైపు ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీమ్ కూడా షర్మిల పార్టీకి వ్యూహకర్తగా ఉంటారనే వార్తలు కూడా గుప్పుమంటున్నాయి.

ఇదిలా ఉంటే అన్న జగన్ గురించి షర్మిల మీడియాతో మాట్లాడారు. జగన్ మోహన్‌రెడ్డి ఏపీలో ఆయన పని ఆయన చేసుకుంటున్నారు. తెలంగాణలో నా పని నేను చూసుకుంటాను. తెలంగాణ వైసీపీ విభాగంతో కలిసి పనిచేస్తాం. తెలంగాణలో రాజన్న రాజ్యం రాబోతోంది. త్వరలో పాదయాత్ర ఉండొచ్చు. పార్టీ విషయంలో జగన్‌ అన్నతో నేను సంప్రదించలేదు. పార్టీ ఏర్పాటు అనేది సాహసోపేత నిర్ణయం. మా మధ్య అన్నాచెల్లెళ్ల బంధం కొనసాగుతుంది. రాజకీయంగా నా దారి నాదే. తెలంగాణలో కొత్త పార్టీ పెట్టే ప్రజల్లోకి వెళ్తాను. తెలంగాణ అంశాలకు మాత్రమే పరిమితం అవుతాను’ అని షర్మిల చెప్పుకొచ్చారు.