Hyd, Nov 26: జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ భాగ్యనగర వాసులపై వరాల జల్లు కురిపించింది. గ్రేటర్ ఓటర్లను ఆకర్శించేందుకు మేనిఫెస్టోను తయారుచేసింది.బిహార్ అసెంబ్లీ సందర్భంగా ఇచ్చిన ఉచిత కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రయోగాన్ని గ్రేటర్ లో కూడా ప్రయోగించింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో (GHMC Elections 2020) బీజేపీని గెలిపిస్తే హైదరాబాద్ ప్రజలందరికీ ఉచిక కరోనా టీకాను (Offer free corona vaccine) అందిస్తామని తన మేనిఫెస్టోలో హామీనిచ్చింది.
అంతేకాకుండా విద్యార్ధులకు ఉచితంగా ట్యాబ్స్, ఫ్రీ వైఫై సదుపాయాన్ని ఇస్తామంది. మహిళలకు బస్సులు, మెట్రోలో ఉచిత ప్రయాణం కల్పిస్తామని బీజేపీ హామీనిచ్చింది. అందరి ఆకాంక్షలు నెరవేర్చే విధంగా మేనిఫెస్టో (BJP Manifesto For GHMC Elections 2020) ఉంటుందని ఫడ్నవిస్ అన్నారు. పేద బడుగు బలహీన మధ్య తరగతి వర్గాలకు చెందిన విధంగా మేనిఫెస్టో రూపొందించ బడిందని పేర్కొన్నారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవంద్ర ఫడ్నవిస్ గురువారం పార్టీ మేనిఫెస్టోను ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఆ పార్టీ నేతలు లక్ష్మణ్, డీకే అరుణ, వివేక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫడ్నవిస్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మేనిఫెస్టో రూపొందించామన్నారు. తెలంగాణ ఏర్పాటులో బీజేపీ పాత్ర చాలా ఉందన్నారు. ప్రజలకు ఏం కావాలో తాము అర్థం చేసుకున్నామన్నారు.
ఇదిలా ఉంటే అధికార టీఆర్‌ఎస్ పార్టీకి గ్రేటర్ ఎన్నికల వేళ భారీ ఎదురు దెబ్బ తగిలింది. శాసనమండలి మాజీ ఛైర్మన్, టీఆర్ఎస్ సీనియర్ నేత స్వామి గౌడ్ బుధవారం భారతీయ జనతాపార్టీలో చేరారు. ఈ క్రమంలో ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్న స్వామి గౌడ్.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరారు. పార్టీ కండువా కప్పి స్వామి గౌడ్‌ను జేపీ నడ్డా పార్టీలోకి ఆహ్వానించారు. స్వామి గౌడ్ వెంట ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్సీ రామచంద్రరావు ఉన్నారు.
BJP Telangana Tweet
LIVE :
BJP Manifesto Launch programhttps://t.co/GG8FnsE1Uv
— BJP Telangana (@BJP4Telangana) November 26, 2020
బీజేపీ మేనిఫెస్టోలోని అంశాలు
మహిళలకు బస్సులు, మెట్రోలో ఉచిత ప్రయాణం
గ్రేటర్‌లో బీజేపీ గెలిస్తే.. హైదరాబాద్‌లో అందరికీ ఉచితంగా కరోనా టీకాలు
నివాస ప్రాంతాల్లో అందరికీ ఉచితంగా మంచినీరు
బస్తీల్లో వందశాతం ఆస్తి పన్ను మాఫీఎల్ఆర్ఎస్ రద్దుతో15 వేల కోట్ల భారం ప్రజలపై పడకుండా విముక్తి
వరదల్లో నష్టపోయిన వారికి 25 వేల రూపాయలు అకౌంట్‌లో పడుతాయి
ప్రధానమంత్రి అవాస్ యోజన కింద అందరికి గృహ నిర్మాణాలు
మెట్రో రైలు ,సిటీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం
ఆన్‌లైన్ క్లాస్‌లకు ఉచిత ట్యాబ్లు
ప్రయివేటు స్కూల్స్‌లో ఫీజుల నియంత్రణ
ఉచిత నల్లా కనెక్షన్ ఉచిత నీరు అందించడం
మూసి ప్రక్షాళన..10 వేల కోట్లతో సుమేధ కొత్త చట్టం
సుమేధ ద్వారా నాలల నిర్మాణం అక్రమ కట్టడాలు కూల్చివేత
పేదలకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
మహిళల కోసం కిలోమీటరుకో టాయిలెట్
గ్రేటర్ పరిధిలో టూవీలర్లు, ఆటోలపై ఇప్పటివరకు ఉన్న చలాన్లు రద్దు
గ్రేటర్‌లో ఇంటింటికి నల్లా కనెక్షన్.. 24 గంటలు ఉచితంగా మంచినీరు సరఫరా
కులవృత్తులకు ఉచిత విద్యుత్ ఎస్సీ కాలనీలు, బస్తీల్లో ఆస్తిపన్ను మాఫీ
ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ నేత బండి సంజయ్
దేశ మాజీ ప్రధాని తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు తెలుగు జాతి గౌరవానికి ప్రతీకలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు గర్వించదగ్గ గొప్పవారిని పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా వారిని అందరూ గౌరవిస్తారని గుర్తుచేశారు. నగరంలోని పీవీ, ఎన్టీఆర్ ఘాట్‌లను గురువారం బండి సంజయ్ సందర్శించారు.
ఈ సందర్భంగా ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. పీవీ, ఎన్టీఆర్ ఘాట్‌లకు బీజేపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. మహానేతలపై ఒవైసీ మాట్లాడిన తీరు దురదృష్టకరమని, ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే స్పందించి అతన్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ ఘాట్‌ను కూల్చివేస్తామంటూ ఎంఐఎం నేతలు చేసిన వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్, టీడీపీ నేతలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
కాగా అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ.. అక్రమ కట్టడాలు, పేదల ఇళ్లు కూల్చేస్తామని చెప్తున్నారు కదా. 4,700 ఎకరాల హుస్సేన్‌సాగర్ ఈరోజు 700 ఎకరాలు కూడా లేదు. హుస్సేన్‌సాగర్‌పై ఉన్న పీవీ నర్సింహారావు, ఎన్టీఆర్ సమాధులను కూడా కూల్చాలి. అసెంబ్లీలో మీ తోక ఎలా తొక్కాలో మాకు తెలుసు. మైనారిటీలకు రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత వైఎస్ రాజశేఖర్‌రెడ్డిదే. మైనారిటీల అభివృద్ధికి వైఎస్సార్ కృషి చేశారు’ అని ప్రశంసించారు.
టీఆర్ఎస్‌పై ఎంఐఎం నేత, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ట్విటర్‌లో మంత్రి కేటీఆర్ స్పందించారు. ‘‘మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీ పీవీ నరసింహారావు, ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ శ్రీ ఎన్టీఆర్ గార్లపై ఈ రోజు మజ్లిస్ అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన అనుచితమైన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నాను’’ అంటూ ట్వీట్ చేశారు.