Hyderabad, Sep 9: రెవెన్యూ బిల్లును (Telangana New Revenue Act) సీఎం కేసీఆర్ నేడు తెలంగాణ శాసనసభలో ప్రవేశపెట్టారు. రైతులకు, పేదలకు సరళీకృతమైన కొత్త చట్టాన్ని ఈ సభలో ప్రతిపాదిస్తున్నందుకు సంతోషంగా ఉందని బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ (CM KCR) అన్నారు. ఇక రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థను (Revenue System) ప్రభుత్వం పూర్తిగా ప్రక్షాళన చేయబోతోంది. ఆర్‌వోఆర్-2020 చట్టంతో (ROR-2020) రెవెన్యూ సంస్కరణలకు తెరతీసిన ప్రభుత్వం.. ఇక రెవెన్యూ కోర్టులను (Revenue Coruts) కూడా పూర్తిగా రద్దు చేయనుంది.
రెవెన్యూ కోర్టుల్లో వ్యాజ్యాలు ఏండ్ల తరబడి ఎటూ తేలకుండా కొనసాగడం, క్షేత్రస్థాయిలో భూ వివాదాలు పెరుగుతుండటంపై ప్రభుత్వం దృష్టి సారించింది. అందులో భాగంగానే వేగంగా, పారదర్శకంగా తీర్పులు ఇచ్చేలా రెవెన్యూ కోర్టుల స్థానంలో ల్యాండ్ ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది.
జిల్లాకు ఒకటి చొప్పున రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాల్లోనూ ల్యాండ్ ట్రిబ్యునళ్లను నెలకొల్పుతారు. ఇప్పటి వరకు భూ యాజమాన్య హక్కుల కల్పన చట్టం కింద తహసీల్దార్‌లు, ఆర్డీవోలు, అదనపు కలెక్టర్లు రెవెన్యూ కోర్టులను నిర్వహిస్తున్నారు. ఇకపై ఇది ల్యాండ్ ట్రిబ్యునళ్లగా మారనున్నాయి. ఆపైన భూపరిపాలన కమిషనర్, రెవెన్యూ మంత్రి వరకు అప్పీళ్లకు అవకాశం ఉన్నది. భూ వివాదాల్లో ఇరువర్గాలకు నోటీసులు జారీ చేయడం, తీర్పులు ఇచ్చి వివాదాలకు పరిష్కారం చూపే అధికారాలు దిగువ స్థాయిలో ఉంటాయి.
రెవెన్యూ బిల్లులోని పలు ముఖ్యాంశాలు.
ధరణి పోర్టల్‌లో అన్ని వివరాలు ఉంటాయి. పూర్తి పారదర్శకంగా ఉంటుంది
పోర్టల్ రెండు భాగాలుగా ఉంటుంది. అగ్రికల్చర్, నాన్ అగ్రికల్చర్ లాండ్ వివరాలు ధరణి పోర్టల్‌లో ఉంటాయి
ప్రపంచంలో ఏ మూలనుంచైనా ధరణి వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసి చూసుకోవచ్చు
కొత్త చట్టం ప్రకారం ఏ అధికారికి విచక్షణాధికారాలు ఉండవు
కొత్త రెవెన్యూ చట్టంతో ఇకపై ఆస్తి తగాదాలు ఉండవు
రిజిస్ట్రేషన్ అయిన వెంటనే మ్యూటేషన్
మ్యూటేషన్ పవర్‌ను కూడా ఆర్డీవో నుంచి తొలగించి ఎమ్మార్వోకు అప్పగిస్తం
మ్యూటేషన్ అయిన వెంటనే ధరణిలో అప్‌లోడ్ కావాలి
రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్, పాస్‌బుక్, ధరణి కాపీ వెంటనే తీసుకోవచ్చు
తెలంగాణ రాష్ట్ర భూభాగం 2 కోట్ల 75 లక్షల ఎకరాలు ఉంటుంది.
ఉమ్మడి ఒప్పందం ఉంటేనే వారసత్వ భూ విభజన
పాస్ పుస్తకాలు లేని భూములకు వాటిని జారీ చేసే అధికారం తహసిల్దార్లదే
వ్యవసాయ భూముల క్రయవిక్రయాలు పూర్తైన వెంటనే బదిలీ చేయాలి
రికార్డు పూర్తిచేసి కొన్నవారికి బదిలీ చేయాలి
తప్పుచేసిన తహసీల్దార్‌పై బర్తరఫ్ క్రిమినల్ చర్యలు, తిరిగి భూములు స్వాధీనం
రికార్డుల్లో సవరణలు చేస్తే ప్రభుత్వం అధికారులపై దావా చేయకూడదు
డిజిటల్ రికార్డుల ఆధారంగానే వ్యవసాయ రుణాలు
రుణాల మంజూరుకు పాస్ పుస్తకాలను బ్యాంకుల్లో పెట్టుకోరాదు
వీఆర్‌వోలను ఏదైనా సమానస్థాయి ఉద్యోగానికి బదిలీ
వీఆర్‌ఎస్ లేదా స్వచ్ఛంద పదవీ విరమణకు అవకాశం కల్పించేలా చట్టం
రికార్డులను అక్రమంగా దిద్దడం, మోసపూరిత ఉత్తర్వులు చేయకూడదు
అక్రమాలకు పాల్పడితే ఉద్యోగులపై చర్యలు, సర్వీసు నుంచి తొలగింపు
జాగీరు భూముల్ని ప్రభుత్వ భూములుగా రెవెన్యూ రికార్డుల్లో రిజిస్టర్ చేయాలి
కొత్త పట్టాదారు పుస్తకం హక్కుల రికార్డుగా గుర్తింపు
ఇకపై సబ్ రిజిస్ట్రార్ అధికారాలు తహసిల్దార్లకు అప్పగింత
ఏ రకమైన రిజిస్ట్రేషన్ కోసమైనా ప్రభుత్వ వెబ్‌సైట్ ద్వారా స్లాట్ బుకింగ్ తప్పనిసరి
1971 యాక్ట్ రద్దుతో పెండింగ్‌లో ఉన్న ఫైల్స్, కేసులు ట్రిబ్యునల్‌కు
విచారణ తర్వాత ట్రిబ్యునల్ ఉత్తర్వులే ఫైనల్