Hyderabad, Nov 29: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు (GHMC polls 2020) సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది. అధికార టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు హోరా హోరీ ప్రచారం నిర్వహిస్తున్నాయి. ప్రచారానికి మరికొద్ది గంటలు మాత్రమే సమయం మిగిలి ఉండటంతో నేతలు మరింత జోరు పెంచారు. నగరంలోని గల్లీలన్నీ తిరుగుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు.
ఆదివారం సాయంత్రం 6 గంటల లోపు ప్రచారాన్ని ముగించాలని ఎన్నికల సంఘం ఆదేశాలు ఇవ్వడంతో.. చివరి అస్త్రాలను సందిస్తున్నారు. విజయమే లక్ష్యంగా వ్యూహాలకు పదునుపెడుతూ తుది దశ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.ఓ వైపు టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన జిల్లాల నేతలంతా భాగ్యనగరంలో వాలిపోతే బీజేపీ ఏకంగా ఢిల్లీ ఇతర రాష్ట్రాల నుంచి నేతలను బరిలోకి దించింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌తో పాటు పలువురు కేంద్రమంత్రులు ఇదివరకే హైదరాబాద్‌లో పర్యటించారు.
టీఆర్‌ఎస్ శనివారం సాయంత్రం ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన జీహెచ్‌ఎంసీ (Hyderabad Municipal Corporation) ఎన్నికల బహిరంగసభలో ఆయన మాట్లాడారు. ‘నేను చావు నోట్లో తలపెట్టి తెలంగాణ సాధించిన విషయం మీకు తెలుసు. అందుకే నాకు తపన ఉంటది. హైదరాబాద్‌తో పాటు ఈ రాష్ట్రంలోని ప్రతి ఇంచు అన్ని విధాలుగా బాగుపడాలనే కల నాకు ఉంటది. ఎంతో తపన, ఎంతో ఆలోచన, నిధుల కూర్పు, ఆ సంయమనం, ఆ అమలు ఉంటే తప్ప సాధ్యమయ్యేవి కావు. మీరు ఆశీర్వదించి పంపిస్తే, గెలిపిస్తే ఇంకా బ్రహ్మాండంగా మా ప్రయత్నాలు చేస్తాం’అని నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
విచ్చిన్నకర శక్తులు ప్రజల మధ్య చిచ్చుపెట్టి విడదీయాలని చూస్తున్నాయని, వాటి వలలో పడొద్దని, ఆగం కావొద్దని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హైదరాబాద్ ప్రజలను కోరారు. విద్వేషపూరిత ప్రసంగాలతో ఆవేశానికి లోను కావొద్దని, విజ్ఞతతో ఆలోచించి ఓటేయాలని కోరారు. హైదరాబాద్ ప్రగతి కోసం టీఆర్‌ఎస్‌ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
‘హైదరాబాద్‌ల ఇప్పుడు చానా తమాషా జరుగుతా ఉంది. వరద వచ్చింది ఆదుకోండి, పది రూపాయలు ఇవ్వండి అంటే ఇయ్యలె. కాని ఇప్పుడు వరదలా వస్తున్నరు హైదరాబాద్‌కు. ఇది మున్సిపల్ ఎలక్షనా? నేషనల్ ఎలక్షనా? ఈ బక్క కేసీఆర్‌ను కొట్టడానికి గింత మందా? అబ్బాబ్బాబ్బా... ఎంత మందయ్యా. జోగడు, బాగడు, జోకెటోడు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక... భారతదేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి వస్తరా? ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఏం జరుగుతా ఉంది? ఏందీ కథ?’అని టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు విపక్షాలపై ధ్వజమెత్తారు.
ఇప్పుడు పొరపాటు చేస్తే హైదరాబాద్ పురోగతి పూర్తిగా నిలిచిపోతుంది, భూముల ధరలు పడిపోతాయి, వ్యాపారాలు బంద్ అవుతాయి. ఇది హైదరాబాద్‌కు ఏమాత్రం క్షేమం కాదు. అందుకే ఇంతకాలం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన పార్టీ టీఆర్‌ఎస్‌కు అండగా నిలవండి, నగరంలో టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించండి. మంచిపేరు ఉన్న వారు, సేవాగుణం ఉన్నవారినే అభ్యర్థులుగా నిలబెట్టాం. వారికి మద్దతు ఇవ్వండి. గతం కంటే ఓ ఐదారు సీట్లు ఎక్కువే ఇచ్చేలా ఓటు వేసేందుకు ముందుకు రండి. ముఖ్యంగా యువకులు పిచ్చి ఆవేశానికి వెళ్లొద్దు. భవిష్యత్తు మీది, భావి హైదరాబాద్ గొప్పగా ఉండాలంటే టీఆర్‌ఎస్ అభ్యర్థులకు మద్దతు ఇవ్వండి. కేంద్రం మెడలు వంచి, నిధులు రప్పించి అభివృద్ధి చేస్తామని తెలిపారు.
వరదల్లో సర్వం కోల్పోయిన నగర ప్రజలకు రూ.10 వేలు సహాయం చేయాలని అప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్నం. చరిత్రలో ఎవ్వడూ ఇవ్వలేదు. ఢిల్లీ, ముంబైలో ఇవ్వలే. బీజేపీ, కాంగ్రెస్ పరిపాలించిన కాడ ఇవ్వలె. కానీ ఈడ మాత్రం కిరికిరి పెడ్తరు నా కొడుకులు.... బాధపడి అంటున్న ఈ మాట. ఎక్కడా ఇచ్చింది లేదు. కాని ఇచ్చేకాడ కిరికిరి పెడ్తరా? ఇదేనా మీ విజ్ఞత? మీ తెలివి? ఈ దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా 6.5 లక్షల వరద బాధిత కుటుంబాలకు రూ.650 కోట్లను అందించింది ఈ కేసీఆర్ ప్రభుత్వం కాదా? నగర ప్రజానీకం ఆలోచన చేయాలి. ఒకడు పత్రం రాస్తడు... ఒక ఉత్తరం రాస్తడు.. నేను రాయలేదు అంటడు. ఎలక్షన్లలో ఈసీని ఇబ్బంది పెట్టి బంద్ చేయించితిరి. ఎంతమంది పేదలు, అర్హులు మిగిలి ఉన్నారో... వారిలో ప్రతి ఒక్క కుటుంబానికి డిసెంబర్ 7 నుంచే రూ.10 వేలు పంపిణీ చేసే బాధ్యత నాదే. ఆరున్నర లక్షల కుటుంబాలకు ఇచ్చినం. ఇంకో మూడు నాలుగు లక్షల కుటుంబాలు ఉండవచ్చు. ఇంకో రూ.నాలుగు వందల కోట్లు ఇవ్వడానికి మా ప్రభుత్వం వెనక్కి పోదని కేసీఆర్ అన్నారు.
అన్నివర్గాలు కలిసి ఉండే పూలబొకేలాంటి హైదరాబాద్ కావాలి. ఇందులోకి ఉడుములు చొచ్చినట్టు చొచ్చి... పిచ్చి కార్యక్రమాలు చేస్తున్నారు కొందరు. వారి పంథా మనకు మంచిది కాదు. పక్కరాష్ట్రమోడు వచ్చి నాలుగు తియ్యటి మాటలు చెప్పిపోతడు. వాడిది నెత్తా? కత్తా? వాడికేం బాధ్యతుంటది. మందిమాటలు నమ్మి మార్మానం బోతే మళ్లొచ్చేటప్పటికి ఇల్లు గాలిపోయిందన్న తీరు అవుతుంది. వారి మాటలకు మోసపోవద్దు. హైదరాబాద్‌లో ఉండే ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా ఆలోచించాలి’అని కేసీఆర్ నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
కేసీఆర్ సభలో పస లేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కొట్టిపారేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వరదలు వచ్చినప్పుడు కేసీఆర్ తప్పతాగి ఫాంహౌస్‌లో పడుకున్నారని.. అందుకే ఢిల్లీ నుంచి తమ నాయకులు వస్తున్నారని పేర్కొన్నారు. డబ్బులు పంచి కేసీఆర్ ఓట్లు వేయించుకోవాలని చూస్తున్నారని ఆయన విమర్శలు గుప్పించారు. కేసీఆర్‌కు భయం పట్టుకుందన్నారు.
బీజేపీ గెలిస్తే హైదరాబాద్ పేరు భాగ్యనగరం : యోగీ ఆదిత్యా నాథ్
నిజాం నిరంకుశ పాలనకు చరమగీతం పాడినట్లుగానే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ప్రజలు మజ్లిస్, టీఆర్‌ఎస్ పార్టీలను ఓడించాలని ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పిలుపునిచ్చారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారం కోసం ఆయన శనివారం నగరంలోని శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, చార్మినార్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఆల్విన్ కాలనీ, పాతబస్తీ లాల్‌దర్వాజా ప్రాంతాల్లో నిర్వహించిన సభల్లో యోగి ప్రసంగించారు.
యూపీలో 10 కోట్ల మంది ప్రజలకు ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అందిస్తున్నామనీ, తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ఎందుకు అమలు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. మజ్లిస్, టీఆర్‌ఎస్ పార్టీలు, వారి కుటుంబాల అభివృద్ధికే తప్ప ప్రజలకు చేసిన మేలేం లేదన్నారు. హైదరాబాద్‌లోని నిజాం నిరంకుశ పాలనకు సర్ధార్ వల్లభ్‌భాయ్ పటేల్ చరమగీతం పాడారని గుర్తు చేశారు. ప్రజలు సహకరిస్తే హైదరాబాద్‌కు భాగ్యనగరంగా పేరు మార్చనున్నట్లు చెప్పారు. నియంతలా వ్యవహరిస్తున్న కేసీఆర్ అవినీతి పాలన అంతం కావాలంటే ప్రజలు బీజేపీని గెలిపించాలన్నారు.