Krishna Water Dispute: ఏపీ ప్రభుత్వానివి నిరాధారమైన ఆరోపణలు, నిబంధనలకు లోబడే విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నాం, కృష్ణా బోర్డుకు లేఖ రాసిన తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ, వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లో ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేసిన ఏపీ ప్రభుత్వం
Srisailam reservoir (Photo-Twitter)

Hyderabad, July 5: తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదం (Krishna River Water Dispute) మరింతగా ముదురుతోంది. తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం నుంచి నిబంధనలు దాటి విద్యుత్ ఉత్పత్తి చేస్తుందని ఏపీ ప్రభుత్వం కృష్ణా బోర్డుకు (Krishna Water Disputes Tribunal) ఫిర్యాదు చేసింది. ఏపీ ఫిర్యాదు మేరకు విద్యుత్‌ ఉత్పత్తి నిలిపివేయాలంటూ తెలంగాణకు కృష్ణా బోర్డు (Krishna River Board) లేఖ గత నెల 17వ తేదీన రాసింది.

ఈ నేపథ్యంలో కృష్ణాబోర్డుకు ఈఎన్‌సీ (Telangana Irrigation Department ENC) తాజాగా లేఖ రాశారు. కృష్ణా ట్రైబ్యునల్‌ నిబంధనలకు లోబడే శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్‌ కేంద్రం ద్వారా తెలంగాణ విద్యుత్‌ ఉత్పత్తి చేస్తోందని రాష్ట్ర నీటిపారుదల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ సి.మురళీధర్‌ లేఖలో పేర్కొన్నారు. దీనిపై ఏపీ నిరాధారమైన, అవాస్తవ ఆరోపణలు చేస్తోందని తెలిపారు. ఏపీ ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని, వాస్తవాలను పరిగణనలోకి తీసుకుని బోర్డు ఓ అభిప్రాయానికి రావాలని ఆయన లేఖలో కోరారు.

జలవివాదం..తెలంగాణ వ్యవహార శైలిపై ప్రధాని మోదీకి, జలశక్తి మంత్రికి లేఖలు రాస్తామని తెలిపిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్, జులై 8న వైఎస్‌ఆర్‌ రైతు దినోత్సవం, ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

జల విద్యుత్‌ ఉత్పత్తి అవసరాలకు నిర్మించిన ప్రాజెక్టు నుంచి ఇతర అవసరాలకు నీటిని మళ్లించొద్దని ప్రణాళికా సంఘం సూచించిందని తెలిపారు. కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్‌-1 (కేడబ్ల్యూడీటీ-1) కూడా ఈ విషయం స్పష్టం చేసిందన్నారు. తెలంగాణ విద్యుత్‌ ఉత్పత్తితో ఏపీలో తాగునీటికి ఇబ్బంది ఏర్పడుతుందన్నది నిరాధారమైన అంశమని, అవసరాల మేరకే తమ వాటాను వినియోగించుకుంటున్నామని స్పష్టంచేశారు. లేఖతో పాటు పలు ఆధారాలను జత చేశారు.

లేఖలో మురళీధర్‌ పేర్కొన్న అంశాలు..

నాగార్జునసాగర్‌, కృష్ణా డెల్టా కాలువల అవసరాలకు అనుగుణంగా శ్రీశైలం నుంచి విద్యుత్‌ ఉత్పత్తి అనంతరం నీటి విడుదల ఉండేలా చూడాలని కేడబ్ల్యూడీటీ-1 సూచించింది. అలాగే విద్యుత్‌ అవసరాలకు అనుగుణంగా శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 265 టీఎంసీలను సాగర్‌కు విడుదల చేసుకోవడానికి 1963లో ప్రణాళిక సంఘం అనుమతి ఇచ్చింది. ఇచ్చంపల్లి లేదా అలబాక నుంచి గోదావరి జలాలను సాగర్‌కు మళ్లించినా కనిష్ఠంగా 180 టీఎంసీల వరకు శ్రీశైలం నుంచి విద్యుత్‌ ఉత్పత్తి ద్వారా సాగర్‌కు విడుదల చేయవచ్చు.

1990-91 నుంచి 2019-21 మధ్య ఏప్రిల్‌-మే నెలల్లో ఏపీ ప్రభుత్వం ఎప్పుడూ శ్రీశైలంలో 834 అడుగులకుపైన నీటిమట్టం కొనసాగించలేదు. ఇప్పుడు మాత్రం ఇతర బేసిన్లకు నీటిని మళ్లించేందుకు 854 అడుగులకు పైన నీటిమట్టం ఉండాలని కోరుతోంది. 2015 జూన్‌లో జరిగిన బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం.. 5, 7, 8, 12వ సమావేశాల్లో శ్రీశైలంలో 50 శాతం నిష్పత్తితో విద్యుత్‌ ఉత్పత్తికి జరిగిన నిర్ణయం పూర్తిగా ఆ సంవత్సరానికే వర్తిస్తుంది.

జలవివాదం..తెలంగాణ వైఖరిపై కేంద్రానికి లేఖ రాయాలని ఏపీ కేబినెట్ నిర్ణయం, రాష్ట్ర హక్కులకు సంబంధించి రాజీ పడేది లేదని స్పష్టం చేసిన జగన్ సర్కారు

ఇతర బేసిన్లలో ఉన్న తెలుగు గంగ ప్రాజెక్టు, గాలేరు నగరి, హంద్రీ నీవా సుజల స్రవంతి, వెలిగొండ ప్రాజెక్టులను కృష్ణా మిగులు జలాల ఆధారంగా ఏపీ చేపట్టింది. శ్రీశైలంలో 880 అడుగులపైన ఉన్నప్పుడే నీటిని తీసుకునేలా రూపొందించిన ఆ ప్రాజెక్టుల సవివర ప్రాజెక్టు నివేదికలు (డీపీఆర్‌లు) కేడబ్ల్యూడీటీ-2 పరిశీలనలో ఉన్నాయి. మిగులు జలాల కింద నిర్మించిన ప్రాజెక్టులకు డిపెండబుల్‌ ప్రవాహం ఆధారంగా శ్రీశైలం నుంచి నీటిని మళ్లించడానికి వీలులేదు.

ఏటా 15 టీఎంసీల నీటిని చెన్నైకి నీటి అవసరాలకు ఇవ్వాల్సి ఉండగా తమిళనాడు సరిహద్దు వరకు 10 టీఎంసీలు కూడా ఏపీ ఇవ్వడం లేదు. దీనికోసం 854 అడుగుల వద్ద నిర్మించిన కుడి కాలువ ద్వారా 2019-20లో 170 టీఎంసీలు, 2020-21లో 124 టీఎంసీలను మళ్లించింది. ఏపీలోని పెన్నా బేసిన్‌లో కండలేరు, సోమశిల, వెలుగోడు జలాశయాల్లో గత నెల 10వ తేదీ నాటికి 95 టీఎంసీల నిల్వ జలాలు ఉన్నాయి. పెన్నాతోపాటు ఇతర బేసిన్లలోని జలాశయాల్లో 360 టీఎంసీల నిల్వ ఉంది.

ముచ్చుమర్రి ఎత్తిపోతల నుంచి అయిదు వేల క్యూసెక్కుల నీటిని తరలించేందుకు ఏపీకి అవకాశం ఉంది. గత నీటి సంవత్సరంలో అయిదు టీఎంసీల నీటిని తరలించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ చేస్తున్న విద్యుత్‌ ఉత్పత్తితో తాగునీటి అవసరాలపై ప్రభావం పడుతుందని ఏపీ చేస్తున్న వాదన అర్థరహితం. 2020-21లో కేటాయింపులకు మించి 629.06 టీఎంసీలను ఏపీ వినియోగించుకుంది.

వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లో ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన

గాలేరు–నగరి సుజల స్రవంతి, ఏవీఆర్‌ హంద్రీ–నీవా సుజల స్రవంతి ప్రాజెక్టులను అనుసంధానిస్తూ వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లో నిర్మించే ఎత్తిపోతల పథకాల్లో భాగంగా చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గ పరిధిలోని ములకల చెరువు మండలం నాయనిచెరువు వద్ద చేపట్టే పనులకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదివారం శంకుస్థాపన చేసి ప్రత్యేక హోమం, పూజలు నిర్వహించారు.

మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ నీటి పారుదల రంగానికి సీఎం వైఎస్‌ జగన్‌ ప్రాధాన్యత ఇచ్చి నిధులు మంజూరు చేస్తున్నట్టు చెప్పారు. రూ.4,373 కోట్ల అంచనా వ్యయంతో మూడేళ్లలో ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేయించనున్నట్టు చెప్పారు. గండికోట రిజర్వాయర్‌ నుంచి తంబళ్లపల్లె నియోజకవర్గంలోని హంద్రీ–నీవా పుంగనూరు ఉప కాలువ ద్వారా తంబళ్లపల్లె, మదనపల్లె, పుంగనూరు, పలమనేరు, కుప్పం వరకు కృష్ణా జలాలను తరలిస్తామని చెప్పారు.

రైతుల కళ్లల్లో ఆనందం చూడాలన్న లక్ష్యంతో 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే బృహత్తర పథకానికి సీఎం వైఎస్‌ జగన్‌ శ్రీకారం చుట్టారని కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. ఆదివారం కాలేటివాగు వద్ద ఎత్తిపోతల ప్రాజెక్ట్‌ పథకం నిర్మాణానికి భూమి పూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

ఎంపీ అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ.. సీఎం వైఎస్‌ జగన్‌ ప్రత్యేక చొరవ చూపి కృష్ణా జలాలతో చక్రాయపేట మండలంలోని 45 చెరువులతోపాటు రాయచోటి నియోజకవర్గంలోని రామాపురం, లక్కిరెడ్డిపల్లె, రాజంపేట నియోజకవర్గంలోని సుండుపల్లె, వీరబల్లి మండలాల్లోని 90 చెరువులకు కాలేటివాగు నుంచి నీటిని నింపనున్నట్టు వివరించారు.