High Court of Telangana | (Photo-ANI)

Hyderabad, July 15: తెలంగాణలో కరోనా రోగులకు అందిస్తున్న కరోనా చికిత్సకు సంబంధించి హైకోర్టు (Telangana High Court) నేడు విచారణ జరిపింది. ఈ సంధర్భంగా కరోనా వచ్చిన వారికి ప్రభుత్వం ఎలాంటి చికిత్స అందిస్తోందో తెలపాలని తెలంగాణ ప్రభుత్వాన్ని (Telangana Governmnet) హైకోర్టు బుధవారం ఆదేశించింది. రాష్ట్రంలో అసలు ఎక్కడెక్కడ కరోనా పరీక్షలు (Coronavirus Tests) నిర్వహిస్తున్నారో ప్రజలకు అర్థం కావడం లేదని హైకోర్టు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనాకు ఉచితంగా చికిత్స, కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం, పూర్తి వివరాలను త్వరలో ప్రకటిస్తామని తెలిపిన సర్కారు

కింగ్ కోఠి, గాంధీ, చెస్ట్ ఆస్పత్రుల్లో అత్యవసర పేషెంట్లకు చికిత్స అందిస్తున్నామని తెలంగాణ ప్రభుత్వం (TS Govt) ఈ సంధర్భంగా కోర్టుకు తెలిపింది. వైరస్ లక్షణాలు తక్కువగా ఉన్న పేషెంట్లకు సరోజిని దేవి, ఆయుర్వేదిక్, నేచర్ క్యూర్‌ ఆస్పత్రులలో చికిత్స అందిస్తున్నామని చెప్పింది. ఈ నేపథ్యంలోనే ప్రసార మాధ్యమాల్లో ఎక్కడెక్కడ కరోనా పరీక్షలు చేస్తున్నారో తెలపాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది.

సాధారణ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం ఏమాత్రం శ్రద్ధ లేకుండా వ్యవహరిస్తోందని హైకోర్టు పేర్కొంది. చీఫ్ జస్టిస్‌ చెప్పిన సూచనలు కూడా ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజలు ఇబ్బందులు పడకుండా ప్రతి ఒక్కరికి పరీక్షలు నిర్వహించి, చికిత్స అందించాలని మరోసారి ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

ఇదిలా ఉంటే కోవిడ్-19 నేపథ్యంలో ఇకపై విచారణలు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా చేపట్టాలని తెలంగాణ హైకోర్టు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టుకు, ట్రిబ్యునల్స్‌కు ఆగస్టు 17 తేదీ వరకు హైకోర్టు లాక్‌డౌన్‌ను పొడిగించింది. దీంతో అత్యవసర కేసులను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ జరపాలని హైకోర్టు ఆదేశించింది. అంతేగాక పిటిషన్‌లు కూడా ఆన్‌లైన్‌లోనే స్వీకరించాలని హైకోర్టు ఉత్తర్వులలో పేర్కొంది.

స‌చివాల‌య భ‌వ‌నాల కూల్చివేత‌పై కొనసాగుతున్న స్టే

తెలంగాణ స‌చివాల‌య భ‌వ‌నాల కూల్చివేత‌ అంశంలో అడిషనల్‌ రిపోర్టు సమర్పించాలని తెలంగాణ హైకోర్టు పిటిషనర్‌ను కోరింది. సచివాలయ భవనాల కూల్చివేత పిటిషన్‌పై బుధవారం హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా భవనాల కూల్చివేతకు రెగ్యులెటర్ యాక్ట్ క్లియరెన్స్‌ అనుమతి అవసరం లేదని పలు తీర్పులు ఉన్నాయని, వాటిని కోర్టుకు సమర్పిస్తామని ప్రభుత్వ తరపు అడ్వొకేట్‌ జనరల్‌ కోర్టుకు తెలిపారు.

ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌కు పిటిషనర్‌ చిక్కుడు ప్రభాకర్‌ రిప్లై దాఖలు చేశారు. పర్యావరణ పరిరక్షణ సవరణ చట్టం-2018కి విరుద్ధంగా కూల్చివేత పనులు చేపడుతున్నారని పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఒక ప్రాజెక్టు పనులు ప్రారంభించడానికి లీగల్‌ రిజర్వ్‌మెంట్స్‌ తీసుకోవాలని పిటిషనర్‌ తెలుపగా, లీగల్‌ రిజర్వ్‌మెంట్స్‌పై వివరణ ఇవ్వాలని కోర్టు పిటిషనర్‌ను కోరింది. పర్యావరణ పరిరక్షణ సవరణ చట్టం ఏం చెపుతుందో తెలపాలని పిటిషనర్‌కు హైకోర్టు సూచించింది.

భవనాల కూల్చివేతకు కేంద్ర మంత్రిత్వశాఖ అనుమతి తీసుకోలేదని పిటిషనర్‌ పేర్కొనగా, ఒక ప్రాజెక్టు నిర్మించడానికి మాత్రమే కేంద్ర మంత్రిత్వశాఖ అనుమతి అవసరమని అడ్వొకేట్‌ జనరల్‌ కోర్టుకు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ చట్టం ప్రకారం భవనాల కూల్చివేయాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెగ్యులేటరీ అనుమతి తీసుకోవాలని హైకోర్టు తెలిపింది. భవనాల కూల్చివేతకు అనుమతి అవసరం లేదని కేవలం భవనాల నిర్మాణాలకు మాత్రమే అనుమతి అవసరమని ఈ సందర్భంగా ఏజీ పేర్కొన్నారు.

ఇప్పుడు తాము ఎలాంటి నిర్మాణం చేపట్టడం లేదని, నూతన నిర్మాణాలు చేపట్టేటప్పుడు అన్ని అనుమతులు తీసుకుంటాని హైకోర్టుకు తెలిపారు. జీహెచ్ఎంసీ, స్థానిక అధికారులు, పర్యావరణ నియంత్రణ మండలి అనుమతులు తీసుకున్నామని ఏజీ కోర్టుకు తెలిపారు. కాగా సోలిసిటర్ జనరల్ రేపు విచారణకు హాజరు కావాలని తెలిపిన హైకోర్టు తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.