
Hyderabad, May 27: లాక్‌డౌన్ కారణంగా తెలంగాణలో కోవిడ్ -19 పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయని, మరో వారం పది రోజులలో రాష్ట్రంలో కరోనా దాదాపు అదుపులోకి వస్తుందని టీఎస్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ జి. శ్రీనివాస రావు అన్నారు. దిల్లీ, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలతో పాటు జూన్ చివరి నాటికి తెలంగాణ రాష్ట్రం కూడా సెకండ్ వేవ్ నుంచి బయటపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న పకడ్బందీ చర్యల వల్ల కోవిడ్ మరణాలు మరియు పాజిటివ్ రేటు తగ్గిపోయి, రికవరీ రేటు 92.69 శాతానికి మెరుగుపడినట్లు శ్రీనివాస రావు వెల్లడించారు. మొత్తంగా తెలంగాణలో పరిస్థితులు ఆశాజనకంగా ఉన్నాయని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో గల కోవిడ్ కేసులను పరిశీలిస్తే.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 90,226 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 3,614 మందికి పాజిటివ్ అని తేలింది. ఇంకా 2,088 మంది శాంపుల్స్‌కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.
తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 5,67,517కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 504 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, మేడ్చల్ నుంచి 204 కేసులు, రంగారెడ్డి నుంచి 192, నల్గొండ నుంచి 229 మరియు ఖమ్మం నుంచి 228 కేసుల చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.
Telangana's COVID19 Bulletin:

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

గడిచిన 24 గంటల్లో మరో 18 కోవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 3,207కు పెరిగింది.
అలాగే నిన్న సాయంత్రం వరకు మరో 3,961 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 5,26,043 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 38,267 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.
మరోవైపు రాష్ట్రంలో వ్యాక్సినేషన్ కొనసాగుతుంది. కోవిడ్ వ్యాప్తికి ఎక్కువగా అవకాశం ఉండే హైరిస్క్ గ్రూపుల వారికి మే 28 మరియు మే 30 మధ్య రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇందులో భాగంగా కిరాణా దుకాణదారులు, పండ్ల మరియు కూరగాయల వ్యాపారులు, ఎల్‌పిజి సిలిండర్ మరియు డెలివరీ సిబ్బంది, పెట్రోల్ పంపుల వద్ద పనిచేసే కార్మికులు, జిహెచ్‌ఎంసి పరిధిలోని ప్రాంతాల్లోని ప్రైవేట్ ఆటో మరియు క్యాబ్ డ్రైవర్లు, వైన్ షాపుల్లో పనిచేసే కార్మికులు, జర్నలిస్టులు తదితరులకు టీకాల పంపిణీ చేపట్టనున్నారు.