Siricilla, Nov 17: సిరిసిల్ల పట్టణంలో మానేరు వాగు కథ విషాదంగా ముగిసింది. ఆ వాగు ఒకరిద్దరు కాదు... ఏకంగా ఆరుగురిని జలసమాధి (Manair River Tragedy) చేసింది. ఒకే కాలనీకి చెందిన ఆరు కుటుంబాల్లో మానేరు వాగు తీవ్ర విషాదాన్ని(Telangana Tragedy) నింపింది. సోమవారం నీట మునిగిన విద్యార్థులను వెలికితీసేందుకు ( Six Teenagers Drown in Manair River) సాయంత్రం ప్రారంభమైన గాలింపు చర్యలు మంగళవారం రాత్రి వరకు కొనసాగాయి. రెస్క్యూ బృందం, స్థానిక పోలీసులు అయిదు మృతదేహాలను వెలికితీశారు. ఘటన జరిగిన రోజే కొలిపక గణేశ్ మృతదేహం లభించింది.
మనోజ్ ఆచూకీ కోసం హైదరాబాద్ నుంచి వచ్చిన ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందంతో రాత్రి వరకు వెతికినా ఫలితం లేదు. సెప్టెంబరులో కురిసిన భారీ వర్షాలకు నెహ్రూనగర్ వద్ద ఉన్న చెక్‌డ్యాంకు గండిపడింది. ఇసుక కోతతో అక్కడ గొయ్యి ఏర్పడింది. పైనుంచి నీటి ప్రవాహం కొనసాగుతోంది. చెక్‌డ్యాం తెగిపోవడంతో నీరంతా వెళ్లిపోయిందని చిన్నారులు భావించారు. దీనికి తోడు వారికి ఈత రాదు. లోతును అంచనా వేయలేక ఆరుగురు ఒకేసారి నీటిలో దిగి మునిగిపోయారు.
ఈ ప్రమాదంలో విద్యార్థులు గణేష్, సాయి, రాకేశ్, క్రాంతి, అజయ్, మనోజ్‌లు మృతి చెందారు. వీరంతా పట్టణంలోని రాజీవ్‌నగర్‌కు చెందిన వారు. వీరిలో మనోజ్ ఇంటర్ మొదటి సంవత్సరం కాగా మిగతా వారు స్థానిక బాలుర ఉన్నత పాఠశాలలో ఆరు, ఎనిమిదో తరగతి విద్యార్థులు. సోమవారం వెంకటసాయి పుట్టిన రోజు. రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు చేసుకోవాల్సి ఉంది. క్రాంతి కుమార్‌ది మంగళవారం పుట్టిన రోజు. వారు విగతజీవులుగా మారడంతో ఆ తల్లిదండ్రుల దుఃఖానికి అంతులేకుండా పోయింది. చిన్నారుల మృతిపై మంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. గాలింపు చర్యల కోసం హైదరాబాద్ నుంచి ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను పంపించారు.
సిరిసిల్ల టౌన్‌కు చెందిన 8 మంది స్టూడెంట్లు.. వెంకంపేట ప్రభుత్వ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నారు. సోమవారం మానేరువాగులోని చెక్ డ్యాంలో ఈత కొట్టేందుకు వెళ్లారు. నీటి లోతు తెలియక అందులోకి దిగిన ఆరుగురు మునిగిపోయారు. దీంతో మిగిలిన స్టూడెంట్లు భయంతో అక్కడి నుంచి పారిపోయారు. వాగుకు దగ్గర్లో ఉన్న ఉన్న రైతులు.. పిల్లలు నీటిలో గల్లంతైన విషయాన్ని గ్రహించి పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వీరి మృతదేహాల్ని పోస్టు మార్టం నిమిత్తం సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు.
మృతి చెందిన రాకేశ్ తండ్రి వీరేశం నేత కార్మికుడు. అమ్మ బీడీ కార్మికురాలు. అయితే వీరికి వివాహైన 13 ఏళ్లకు రాకేశ్ పుట్టాడు. లేక లేక పుట్టిన బిడ్డ మరణించడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.