Rainfall -Representational Image | (Photo-ANI)

Hyderabad, July 12: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో నిన్న జోరుగా వానలు (Heavy Rains Lashes Telugu States) కురిశాయి. రాష్ట్రంలో పలు జిల్లాల్లో కుండపోత వానలు పడ్డాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. గాలి వానకు పలుచోట్ల చెట్లు విరిగిపడగా, మరికొన్ని చోట్ల కరెంటు స్తంభాలు నేలకొరిగాయి. పలుచోట్ల రోడ్లు తెగిపోవడంతో రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 42 ప్రాంతాల్లో అతి భారీ వర్షం కురవగా 241 ప్రాంతాల్లో సాధారణ వర్షం కురిసింది. 541 ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

అల్పపీడన ప్రభావం నేడు, రేపు కూడా ఉంటుందని పేర్కొంది. తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం (Heavy rain in next three days) ఉందని తెలిపింది. ముఖ్యంగా ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. వరంగల్ జిల్లా చెన్నారావుపేటలో అత్యధికంగా 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం సంతాయిపేటలో భీమేశ్వర వాగు పొంగి పొర్లుతుండడంతో భీమేశ్వరస్వామి దర్శనానికి వెళ్లిన 23 మంది భక్తులు వాగు అవతల చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఎక్స్‌కవేటర్ సాయంతో వారిని ఇవతలి ఒడ్డుకు చేర్చారు.

ఏపీలో తాజాగా 2,665 కేసులు నమోదు, ప్రస్తుతం రాష్ట్రంలో 28,680 యాక్టివ్‌ కేసులు, 16 మంది మృతితో 13వేలు దాటిన కరోనా మృరణాల సంఖ్య

ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని కోర్టికల్‌ జలపాతంలో పడి గుర్తుతెలియని వ్యక్తి(40) మరణించగా, బోథ్‌ మండలం కుచలాపూర్‌‌కు చెందిన గుండెన స్వామి(34) కుమారి వాగులో కొట్టుకుపోయి మృతిచెందాడు. వరంగల్‌ రూరల్‌ జిల్లా నర్సంపేట మండలం గురిజాలకు చెందిన గడ్డం అనిల్‌(37) బైక్‌పై ఊరికి వస్తూ మార్గమధ్యలో పెద్దంచెరువు వాగును దాటే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు వాగులో పడి గల్లంతయ్యాడు. సంగారెడ్డి జిల్లా కల్హేర్‌ మండలం మార్డిలో పిడుగుపడి ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది.

ఇదిలా ఉంటే ప‌శ్చిమ మ‌ధ్య‌, వాయ‌వ్య బంగాళాఖాతంలో (Bay of Bengal), ఉత్త‌రాంధ్ర‌, ద‌క్షిణ ఒడిశా తీరాల్లో అల్పపీడ‌నం (Low Pressure) ఏర్ప‌డింది. తూర్పు, ప‌శ్చిమ భార‌త ప్రాంతాల మ‌ధ్య గాలుల‌తో ఉప‌రిత‌ల ద్రోణి ఏర్ప‌డింది. దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, ద్రోణి కొనసాగుతున్నాయి. ఈ క్ర‌మంలో రాగ‌ల రెండ్రోజులు తేలిక‌పాటి నుంచి మోస్త‌రు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంది. అల్ప‌పీడ‌న ప్ర‌భావంతో రాష్ర్టంలో ఇవాళ‌, రేపు విస్తారంగా వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం అధికారులు వెల్ల‌డించారు. ప‌లు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంది. భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉన్నందున ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హెచ్చ‌రించారు.

తెలంగాణలో కొత్తగా 465 కోవిడ్ కేసులు నమోదు, తాజాగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 70 కేసులు, రాష్ట్రంలో ఇప్పటివరకు 6,31,683 పాజిటివ్ కేసులు నమోదు

పశ్చిమ మధ్య, దాన్ని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఆదివారం అల్పపీడనం ప్రభావంతో సోమ, మంగళవారాల్లో కోస్తాలో కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ స్టెల్లా తెలిపారు. చాలాచోట్ల ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు పడొచ్చని పేర్కొన్నారు. రాయలసీమలోనూ రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. అల్పపీడన ప్రభావంతో సముద్ర తీరం వెంబడి గంటకు 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్‌ కన్నబాబు తెలిపారు. సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు.

విశాఖ జిల్లాలో పెను విషాదం, పెద్దేరు నది దాటుతూ ముగ్గురు మృతి, పొలం పనులకు దగ్గర దారిలో వెళ్లే క్రమంలో నది దాటుతూ ప్రమాదం

తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో ఆదివారం విస్తారంగా వానలు కురిశాయి. ఉదయం 8.30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సామర్లకోటలో 83 మి.మీ, వర్షపాతం నమోదైంది. పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో అధికశాతం మండలాల్లో భారీ వర్షాలు కురిశాయి. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో 92.5 మి.మీ, విశాఖపట్నంలో 83.5 మి.మీ, శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో 74.75 మి.మీ చొప్పున వర్షపాతం నమోదైంది. విజయనగరం, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోనూ పలుచోట్ల ఒక మోస్తరు వానలు కురిశాయి. తూర్పుగోదావరి రాజమహేంద్రవరం, కాకినాడ, తుని తదితర పట్టణాల్లో జోరువాన కురిసింది. మన్యంలో కుండపోత వర్షం కురవడంతో వాగులు, వంకలు పొంగిపొర్లాయి.