Hyderabad, June 7: తెలంగాణ రాజకీయాల్లోకి మరో పార్టీ రాబోతోంది. వైయస్ జగన్ సోదరి వైయస్ షర్మిలారెడ్డి తెలంగాణలో కొత్త పార్టీని (YS Sharmila New party) ఏర్పాటు చేయబోతున్నారు. పార్టీ పేరుతో పాటు పార్టీ పెట్టబోయే తేదీని సైతం నేడు ఒక ప్రకటన ద్వారా షర్మిల ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్ రాజగోపాల్ వెల్లడించారు. వైఎస్ షర్మిల పార్టీని (YS Sharmila New Political Party) వైఎస్సార్ జయంతి (జూలై 8)నాడు ఏర్పాటు చేయబోతున్నామని, పార్టీ ఆవిర్భావానికి కావాల్సిన అన్నిరకాల ఏర్పాట్లు, కార్యక్రమాలను ఇప్పటికే ప్రారంభించామని చెప్పారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
వైఎస్సార్ తెలంగాణ పార్టీ(వైఎస్సార్‌టీపీ)కి (YSR Telangana Party) సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ పనులన్నీ ఎన్నికల సంఘం వద్ద పూర్తయినట్లు తెలిపారు. పార్టీ పేరుపై వైకాపా గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మకి ఎటువంటి అభ్యంతరం లేదని.. ఆమె ఇచ్చిన లేఖను కూడా పార్టీ పేరుకు మద్దతుగా ఎన్నికల సంఘానికి అందజేశామన్నారు.కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అధికారికంగా అనుమతి పత్రాలు రాగానే పార్టీకి సంబంధించిన మరిన్ని వివరాలు ప్రకటిస్తామని రాజగోపాల్ పేర్కొన్నారు.
ఎలక్షన్ కమిషన్ అఫ్ ఇండియా.. ‘వైఎస్సార్ తెలంగాణ’ పార్టీకి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా వారి అఫిషియల్ వెబ్‌సైట్‌లో పార్టీ పేరు పైన ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలని ఏప్రిల్ 30వ తేదీనే ఎలెక్షన్ కమిషన్ తెలిపింది. ఇప్పటి వరకూ ఎటువంటి అభ్యంతరాలు రాలేదంటే అనుమతుల ప్రాసెస్ పూర్తయినది అనుకుంటున్నాం. ఎలక్షన్ కమిషన్ అఫ్ ఇండియా నుంచి అఫిషియల్‌గా అనుమతి పత్రాలు రాగానే పార్టీకి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు మీకు ప్రకటిస్తామని తెలిపారు.
వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరు వైఎస్ విజయమ్మ గారి సమ్మతితోటి .. వారి ఆశీస్సుల తోటే జరిగింది కాబట్టి ఇతరులకు అభ్యంతరం ఉంటుందని మేము అనుకోవడం లేదు. రాజశేఖర్ రెడ్డి గారి పుట్టినరోజు జులై 8వ తేదీన పార్టీని (YSR Birthday) ఏర్పాటు చేయబోతున్నాం. ఆవిర్భావానికి కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లను.. కార్యక్రమాలను మేము ఇప్పటికే ప్రారంభించాం’’ అని రాజగోపాల్ ప్రకటనలో పేర్కొన్నారు.
కాగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పాలనను తెలంగాణలో మళ్ళీ తీసుకురావడం కోసం, ఆయన ఆశయాలు, ఆలోచనలు ప్రతిబింబించేలా, వైఎస్సార్ గారు అందించిన సంక్షేమం.. ప్రతి ఇంటికి మళ్ళీ చేరేలా ‘వైఎస్సార్ తెలంగాణ’ పార్టీ పెట్టాలనుకుందని వైయస్ షర్మిల గతంలో ప్రకటించిన విషయం విదితమే.