Sharmila New Party: కొత్త మలుపులతో తెలంగాణ రాజకీయాలు, జూలై 8న షర్మిలారెడ్డి కొత్త పార్టీ, అదే రోజున పార్టీ పేరు, జెండా, అజెండా ప్రకటిస్తామని తెలిపిన వైయస్ఆర్ తనయ, షర్మిల ఇక నా బిడ్డ కాదు.. మీ బిడ్డ అంటున్న వైయస్ విజయమ్మ
YS Sharmila andh Her mother YS vijayamma (Photo-Video grab)

Khammam, April 10: తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ (New Party in Telangana) రాబోతోంది. త్వరలో తెలంగాణలో రాజకీయ పార్టీని పెట్టబోతున్నా అని వైఎస్‌ షర్మిల ఖమ్మం సంకల్ప సభ వేదికగా ప్రకటించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతి (Late Chief Minister YS Rajasekhara Reddy Birthday) రోజైన జూలై 8న కొత్త పార్టీని ఆవిష్కరిస్తున్నట్లు వైఎస్‌ షర్మిల ప్రకటించారు. అదే రోజున పార్టీ పేరు, జెండా, అజెండా ప్రకటిస్తామని తెలిపారు. రాష్ట్రంలో కొత్త పార్టీ (Sharmila New Party) పెట్టే ఏర్పాట్లలో ఉన్న షర్మిల శుక్రవారం ఖమ్మం పెవిలియన్‌ గ్రౌండ్‌లో సంకల్ప సభను నిర్వహించారు.

ప్రజా సమస్యలపై అధికార పక్షాన్ని నిలదీయడంలో ప్రతిపక్ష పార్టీలన్నీ విఫలమయ్యాయని ఖమ్మంలో జరిగిన విమర్శించారు. ఖమ్మం పట్టణంలోని పెవిలియన్‌ మైదానంలో శుక్రవారం రాత్రి జరిగిన ‘రాజన్న సంక్షేమ పాలన కోసం సంకల్ప సభ’కు తల్లి వైఎస్‌ విజయమ్మతో కలిసి వచ్చిన వైఎస్‌ షర్మిల తొలుత సభా ప్రాంగణంలో వైఎస్‌ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. తాను తెలంగాణ బిడ్డనని, ఈ గడ్డమీదే పుట్టానని, ఈ గడ్డమీదే చదివానని, ఇక్కడే తాను పిల్లలను కన్నానని, ఈ గడ్డ రుణం తీర్చుకుంటానంటూ ఉద్వేగంగా ప్రసంగించారు. ఎన్నో ఆశలు, ఆశయాలతో తెచ్చుకున్న తెలంగాణలో సీఎం కేసీఆర్‌ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని, బాంచన్‌ దొర అంటూ ప్రజలు బతుకుతున్నారన్నారు.

రావాలి షర్మిల కావాలి షర్మిల, లోటస్ పాండ్‌లో ఫ్లెక్సీల జోరు, తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకురావడమే లక్ష్యం, అన్ని విషయాలు చెబుతానంటున్న వైయస్ షర్మిలా రెడ్డి

అధికారపక్షాన్ని నిలదీసేందుకు, ప్రశ్నించేందుకే కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. రాజన్న తరహా సంక్షేమ పాలన కోసం, తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టే దిశగా తమ పార్టీ ముందుకుసాగుతుందని స్పష్టం చేశారు. తెలంగాణ రాజకీయాల్లో వైఎస్‌ను తిరిగి ప్రతిష్టించేందుకు పార్టీ పెడుతున్నానని షర్మిల తెలిపారు. ఎన్నో ఆశలతో సాధించుకున్న తెలంగాణలో ప్రజల ఆకాంక్షలేవీ నెరవేరడం లేదన్నారు. వైఎస్సార్‌ మొదలుపెట్టిన పాదయాత్ర రోజున కొత్త సంకల్పం తీసుకుంటున్నట్లు తెలిపారు. తెలంగాణ నేలతో ఉన్న అనుబంధంతో వచ్చానని చెప్పారు. రాజశేఖర్‌ రెడ్డి పాలన స్వర్ణయుగం అని తెలిపారు. ప్రశ్నించడానికి.. నిలదీయడానికి పార్టీ పెడుతున్నా అని తెలిపారు. రాజన్న రాజ్యం అందించడానికే కొత్త పార్టీ అని పేర్కొన్నారు. ఉద్యమాల గుమ్మం ఖమ్మం అని ప్రసంగం మొదలుపెట్టారు.

Here's Khammam Metting Updates 

పల్లె పల్లె నుంచి వచ్చిన ప్రతి వైఎస్‌ఆర్‌ అభిమానికి నమస్కరిస్తున్నా అని తెలిపారు. రాజన్న బాటలో నడిచేందుకు నేను తొలి అడుగు రాజకీయాల్లో వేస్తున్నట్లు చెప్పారు. రాజన్న సంక్షేమ పాలన తిరిగి రావాలని సంకల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. 18 ఏళ్ల కిందట ఏప్రిల్‌ 9వ తేదీన చేవెళ్ల నుంచి వైఎస్సార్‌ ప్రజాప్రస్థానం పేరిట పాదయాత్ర ప్రారంభించిన రోజునే పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు. ప్రశ్నించడానికే పార్టీ అవసరమని వివరించారు. పాలకవర్గాన్ని నిలదీయడానికి పార్టీ అని పార్టీ ఏర్పాటుకు కారణాలను షర్మిల వివరించారు.

ప్రతి రైతు రాజు కావాలని కోరుకున్న నాయకుడు వైఎస్‌ఆర్‌ అని షర్మిల తెలిపారు. ఉచిత విద్యుత్‌ ఇవ్వాలన్న ఆలోచన చేసింది వైఎస్‌ఆరేనని గుర్తుచేశారు. కోటి ఎకరాలకు నీరు ఇవ్వాలని జలయజ్ఞానికి వైఎస్‌ఆర్‌ శ్రీకారం చుట్టారని, వ్యవసాయాన్ని పండగ చేయాలని వైఎస్‌ఆర్‌ కోరుకున్నారని గుర్తుచేశారు. మహిళలు లక్షాధికారులు కావాలని వైఎస్‌ఆర్ కలలు కన్నారు అని షర్మిల తెలిపారు.

బరాబర్‌ నిలబడతా. పోరాడి సాధించుకున్న తెలంగాణలో దగా పడుతున్న ప్రజల కోసం పోరాడతా. తెలంగాణలో వైఎ్‌సఆర్‌ సంక్షేమ రాజ్యాన్ని తిరిగి స్థాపిస్తా. నేను ఎవరో వదిలిన బాణాన్ని కాదు. ప్రజల బాణాన్ని. ప్రజలకు అండగా నిలబడతా. వారి కోసం పోరాడతా’ అని మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి కుమార్తె వైఎస్‌ షర్మిల సంకల్పం బూనారు.

అన్నని కాదని కొత్త పార్టీ పెడుతోందా? లోటస్ పాండ్‌లో వైయస్ షర్మిలారెడ్డి ఆత్మీయ సమావేశం, దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి పెళ్లి రోజు నేడు, జగనన్న వదిలిన బాణం ఏం చేయబోతోంది?

విద్యార్థులకు కేజీ టూ పీజీ ఉచిత విద్య ఏమైందని ప్రశ్నించారు. నిరుద్యోగులకు నోటిఫికేషన్లు లేవని, డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు ఇవ్వడం లేదని, కొత్త రేషన్‌ కార్డులు, పింఛన్లు లేవని విమర్శించారు. నీళ్లు, నిధులు, ని యామకాలు లక్ష్యంగా సాధించుకున్న తెలంగాణ లో అభివృధ్ధి ఫలాలన్నీ ఒక్క కేసీఆర్‌ కుటుంబానికే పరిమితం అయ్యాయని, వారి కుటుంబమే లబ్ధి పొందుతోందని ఆరోపించారు. పదవులన్నీ బంధు వర్గానికి, భజన బ్యాచుకే కట్టబెడుతున్నారన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెబుతున్న బంగారు తెలంగాణ ఎక్కడుందని షర్మిల ప్రశ్నించారు. తెలంగాణ ఆత్మగౌరవం అంతా కేసీఆర్‌ దొరగారి ఎడమ కాలిచెప్పు కింద పడి నలిగిపోతోందని విమర్శించారు. దేశంలో సచివాలయానికి రాని ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుకు తల, తోక తీసేసి రీ డిజైన్‌ పేరుతో అంచనాలు పెంచేసి అవినీతికి పాల్పడ్డారని, దీన్ని ప్రశ్నించేందుకు ఒక పార్టీ అవసరం లేదా? అని ప్రశ్నించారు. ‘నువ్వు కొట్టినట్లు చెయ్‌..నేను ఏడ్చినట్లు చేస్తా’అన్న చందంగా విపక్షాలు వ్యవహరిస్తున్నాయని ఎద్దేవా చేశారు. ‘టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు గురిపెట్టిన ప్రజా బాణమై కొత్త పార్టీతో వస్తున్నా..’అని అన్నారు.

కాంగ్రెస్‌ ప్రశ్నించే పరిస్థితిలో లేదని, పార్టీ ఎమ్మెల్యేలను కేసీఆర్‌ పార్టీకి అందించే కంపెనీగా మారిపోయిందని విమర్శించారు. బీజేపీ మాటలు చెప్పడం తప్ప చేతల్లో ఏదీ చూపడం లేదన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ ఇవ్వలేదని, తెలంగాణకు ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదంటూ ధ్వజమెత్తారు. సింహం సింగిల్‌గానే వస్తుందని, తాను టీఆర్‌ఎస్‌ చెబితేనో, బీజేపీ అడిగితేనే, కాంగ్రెస్‌ పంపిస్తేనో రాలేదని స్పష్టం చేశారు. తాను రాజన్న బిడ్డనని, ఎవరి కింద పనిచేయనని, ఎవరితోనూ పొత్తు పెట్టుకోనన్నారు. తమ పార్టీలో నేటి కార్యకర్తలే రేపటి నాయకులని ఆమె చెప్పారు.

వైయస్ పేరు లేకుండా షర్మిల లేదు, తెలంగాణ కన్నా తమిళనాడు లేదా కర్నాటకలో పెడితే ఎక్కువ ఓట్లు వస్తాయి, షర్మిలా రెడ్డి కొత్త పార్టీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు

ఈ నెల 15 నుంచి హైదరాబాద్‌లో నిరాహార దీక్ష

రాష్ట్రంలో 1.91 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉన్నా ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వడం లేదని, దీంతో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని, ప్రతి ఉద్యోగాన్నీ భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో ఈ నెల 15 నుంచి హైదరాబాద్‌లో మూడు రోజుల పాటు నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించారు. నాలుగో రోజు నుంచి తమ పార్టీ నేతలు, కార్యకర్తలు జిల్లాల్లో రిలేదీక్షలు చేస్తారని తెలిపారు. ఏ ఒక్క నిరుద్యోగి ఆత్మహత్య చేసుకోవద్దు. నేను భరోసాగా ఉన్నాను. ఈ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకపోతే రాబోయే మన ప్రభుత్వంలో నిరుద్యోగ సమస్యకు పరిష్కారం తప్పక ఉంటుంది. అప్పటి వరకు ఓపిక పట్టాలి. రాజన్న రాజ్యం వస్తే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి.

నా బిడ్డను ఆశీర్వదించండి: వైఎస్‌ విజయమ్మ

వైఎస్సార్‌ ప్రజా ప్రస్థానం మొదలు పెట్టిన రోజునే షర్మిల తన రాజకీయ అడుగులు మొదలు పెడుతున్నారని సభలో వైఎస్‌ విజయమ్మ తెలిపారు. దీనికి తెలంగాణ ప్రజల ఆశీస్సులు కావాలంటూ, ఆమెను ఆశీర్వదించాల్సిందిగా కోరారు. షర్మిల స్వభావం పూర్తిగా వైఎస్‌ రక్తం నుంచే వచ్చిందని, వైఎస్‌ మాదిరే షర్మిల సైతం మంచి పాలన అందిస్తుందని భరోసా ఇచ్చారు. షర్మిల గతంలో తెలంగాణలో చేసిన ప్రతి యాత్రలో ప్రజలు ఆదరించి అక్కున చేర్చుకున్నారని గుర్తు చేశారు. తన బొందిలో ప్రాణం ఉన్నంత వరకు వైఎస్‌ కుటుంబం తెలంగాణ ప్రజలకు రుణ పడి ఉంటుందని అన్నారు. వైఎస్‌ను గతంలో తెలంగాణ ప్రజలు ఆదరించారని, ఆ రుణం ఇప్పుడు తీర్చుకుంటామని తెలిపారు. వైఎస్‌ భార్యగా, షర్మిలకు అమ్మగా ఆమెను ఆశీర్వదించడానికి ఇక్కడకు వచ్చానని విజయమ్మ పేర్కొన్నారు.

తెలంగాణలో వైసీపీ ఏర్పాటు సీఎం జగన్‌కు ఇష్టం లేదు, పార్టీ ఏర్పాటు నిర్ణయం అనేది షర్మిల వ్యక్తిగతం, అన్నా చెల్లెళ్ల మధ్య ఎలాంటి విభేదాలు లేవు, మీడియాతో ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

వైఎస్సార్‌ మనిషిని మనిషిగానే ప్రేమించారు. కుల, మత, పార్టీ, ప్రాంతాలకు అతీతంగా అందరినీ సమానంగా చూశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ వైఎస్సార్‌‌ సంక్షేమ ఫలాలు అందించారు. కోటి ఎకరాలకు నీరందించేందుకు జలయజ్ఞం ప్రారంభించిన దమ్మున్న నాయకుడు వైఎస్సార్‌. వైఎస్సార్‌‌ పాలన ఒక స్వర్ణయుగం. కరెంటు బిల్లు అయినా, ఆర్టీసీ ఛార్జీలైనా ఏవీ పెంచలేదు. సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ద్వారా లక్షల మంది ఆరోగ్యానికి మేలు చేశారు. ఎయిర్‌పోర్టు, పీవీ ఎక్స్‌ప్రెస్‌ వే అయినా వైఎస్‌ఆర్‌ చలవే.

తెలంగాణ ప్రజలకు తమ కుటుంబం ఎంతో రుణపడి ఉందని, వారి అభిమానం, ఆత్మీయత మరువలేనిదని విజయమ్మ అన్నారు. ఇక షర్మిల వేసే ప్రతి అడుగు తెలంగాణ ప్రజల కోసం, ప్రగతి కోసమేనని, జనంతో పాటు దేవుడి ఆశీస్సులు కూడా ఆమెకు ఉంటాయని ఆకాంక్షించారు. పార్టీ పెడుతున్నట్లు, తెలంగాణ బిడ్డగా, రాజన్న బిడ్డగా మీముందుకు వస్తానన్నప్పుడు ఎంతో సంతోషించానని పేర్కొన్నారు. ‘‘తెలంగాణ ప్రజలతో రాజశేఖరరెడ్డికి గొప్ప అనుబంధం ఉంది. 18 ఏళ్ల కిందట ఏప్రిల్‌ 9న చేవెళ్ల నుంచి పాదయాత్ర ప్రారంభించి.. సమస్యలను తెలుసుకున్నారు. అదే స్ఫూర్తితో ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందిస్తూ, న్యాయం జరగాలన్నదే మా లక్ష్యం’’ అని విజయమ్మ అన్నారు.

షర్మిల ఇక నా బిడ్డ కాదు.. మీ బిడ్డ. ఇక్కడి చరిత్ర, సంప్రదాయాలు, సంస్కృతి, సమస్యలు, ప్రజల ఇబ్బందులన్నీ ఆమెకు తెలుసు. మీరు అన్నివిధాలా అండగా నిలుస్తూ ఆశీర్వదించండి’’ అని దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ సతీమణి విజయమ్మ ప్రజలను కోరారు.