New Delhi, Febuary 5: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం విదితమే. ఈ బడ్జెట్లో అనేక మార్పులు చేర్పులు ఉన్నాయి. వీటిల్లో పాన్ కార్డుకు సంబంధించి మార్పులు కూడా ఉన్నాయి.
బడ్జెట్లో చెప్పిన వివరాల ప్రకారం.. ఇకపై పాన్ కార్డు (PAN Card) లేని వారు తమ ఆధార్ కార్డు(Aadhaar card) చూపిస్తే చాలు. వెంటనే పాన్ కార్డు మంజూరు చేస్తారు. ఇందుకోసం ఆదాయపు పన్ను శాఖ(Income Tax Department) కొత్త వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ వ్యవస్థ ద్వారా పన్ను చెల్లింపుదారులు ఎలాంటి అప్లికేషన్ ఫిల్ చేయకుండానే ఆధార్ కార్డు చూపిస్తే పాన్ కార్డు మంజూరు చేస్తారు. కాగా ఆధార్ కార్డు ఉన్నవారికి మాత్రమే ఈ వెసులుబాటు ఇచ్చారు.
ట్యాక్స్ చెల్లింపులు జరిపే వారి కోసం ఆధార్ ఆధారిత వెరిఫికేషన్ తీసుకురానున్నట్టు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీని ద్వారా ఎలాంటి అప్లికేషన్ నింపాల్సిన పని ఉండదు. ఆధార్ కార్డు ఉంటే పాన్ కార్డు మంజూరు చేస్తారు. పన్ను చెల్లింపుదారులు ట్యాక్స్ కట్టే సమయంలో పాన్ కార్డు లేదా ఆధార్ కార్డు ఏదైనా సమర్పించవచ్చు.
2019లో ఈ విధానం తీసుకొచ్చారు. ఆధార్ తో పాన్ అనుసంధానం తప్పనిసరి అని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. 2020 మార్చి 31 లోపు ఈ ప్రాసెస్ పూర్తి చేసుకోవాలని తెలిపింది. పాన్ కార్డును ఆదాయపు పన్ను శాఖ జారీ చేస్తుంది. ఐటీఆర్(ITR) ఫైల్ చేయడానికి, బ్యాంక్ ఖాతా కోసం, ఆర్థిక లావాదేవీల కోసం పాన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి.