'Baat Bihar Ki': ప్రశాంత్ కిషోర్ కొత్త వ్యూహం, ఫిబ్రవరి 20 నుంచి బాత్ బీహార్ కీ కార్యక్రమం, సీఎం నితీష్ కుమార్‌కు చెక్ పెట్టే దిశగా అడుగులు, గాంధీ, గాడ్సేలు కలిసి వెళ్లలేరంటూ కీలక వ్యాఖ్యలు
Baat Bihar Ki: Nitish kumar vs prashant kishor (Photo-FB/ANI)

Patna, February 18: ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ (Political strategist Prashant Kishor) అంటే తెలియని వారు ఎవరూ ఉండరు. ఆయన రంగంలోకి దిగారంటే ఆ పార్టీ గెలుపు ఖాయం అనే భావన ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఉంది. పీకే వ్యూహాలు తట్టుకుని ప్రత్యర్థి పార్టీ నిలబడాలంటే చాలా కష్టమనే విషయం ఆయన పనిచేసిన పార్టీల విజయాలను చూస్తే  ఇట్టే తెలిసిపోతుంది.

వైఎస్ జగన్‌కు (YS Jagan) రాజకీయ వ్యూహ కర్తగా పని చేసిన ప్రశాంత్ కిషోర్, ఈ మధ్య ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అధినేత అరవింద్ కేజ్రీవాల్ (Arvind kejriwal) ఢిల్లీలో మూడోసారి అధికారంలోకి రావడానికి బాగా వ్యూహాలు రచించారు. ఇప్పుడు బీహార్(Bihar) రాజకీయాల్లో కీలక నేతగా ఉన్నారు.

అయితే బీహార్‌లో కొద్ది రోజులుగా అసమ్మతి స్వరం వినిపిస్తున్న కారణంతో నితీష్ కుమార్ (Chief Minister Nitish Kumar) పార్టీ జేడీయూ (JDU) ప్రశాంత్‌కిశోర్‌‌ను పార్టీ నుంచి బహిష్కరించింది. ఈ క్రమంలోనే ప్రశాంత్ కిషోర్ బీహార్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. బీజేపీతో (BJP) పాటు జేడీయూపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తనను పార్టీ నుంచి బహిష్కరించినందుకు జనతాదళ్‌ చీఫ్‌, బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ను ప్రశ్నించబోనని స్పష్టం చేశారు.

తనకు నితీశ్‌తో సత్సంబంధాలే ఉన్నాయని.. ఆయన మీద అపారమైన గౌరవం కూడా ఉందని పేర్కొన్నారు. అదే సమయంలో.. ‘‘పార్టీ సిద్ధాంతం గురించి నేను, నితీశ్‌ జీతో చాలా చర్చలు జరిపాను. గాంధీజీ ఆశయాలను పార్టీ ఎన్నటికీ వీడదని ఆయన చెప్పారు. కానీ గాంధీజీని హతమార్చిన నాథూరాం గాడ్సేకు అనుకూలంగా నేడు వారు మాట్లాడుతున్నారు. అయితే నాకు తెలిసినంత వరకు గాంధీ- గాడ్సే చేతులు పట్టుకుని ఉండరు కదా’’ అని చురకలు అంటించారు.

స్వార్థపరుల ఆటలు ఇక సాగవు, సీఏఏతో భారతీయులకు ఎలాంటి నష్టం జరగదు - మోదీ

ఈ నేపథ్యంలోనే బాత్‌ బిహార్‌ కీ (Baat Bihar Ki) అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. కోటి మంది యువత అభిప్రాయాలను సేకరించడమే లక్ష్యంగా ఫిబ్రవరి 20 నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. బిహార్‌ యువత బలమైన నాయకత్వాన్ని కోరుకుంటోందని, అందుకే వేలాది మంది యువతతో రాజకీయ శక్తిని తయారుచేస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు 100 రోజుల పాటు రాష్ట్రమంతా పర్యటిస్తానని చెప్పారు.

Here's ANI Tweet

కేంద్రంలోని ఎన్డీయే సర్కారు తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ జనాభా రిజిస్టర్‌(ఎన్‌పీఆర్‌)పై ప్రశాంత్‌కిషోర్‌ తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. గత పదిహేనేళ్లుగా నితీశ్‌ ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి చెందడం చూశామని, అయితే మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఇది తక్కువేనని విమర్శలు చేశారు. పైగా ఆయన కొత్త స్నేహాలు ఇప్పుడు రాష్ట్రానికి ఏమాత్రం ప్రయోజనం చేకూర్చడం లేదు. మహారాష్ట్ర, కర్ణాటకలతో పోలిస్తే బిహార్‌ ఇప్పుడు ఎక్కడ ఉందని నితీశ్‌ కుమార్‌, బీజేపీ దోస్తీపై విమర్శలు గుప్పించారు.

బీహార్ సీఎం కనిపించుట లేదు, పాట్నాలో కలకలం రేపుతున్న పోస్టర్లు

నేనెక్కడికీ వెళ్లడం లేదు. ఇక్కడే ఉండి బిహార్‌ కోసం పనిచేస్తాను. బిహార్‌ అభివృద్ధిని కోరుకునే వారు నాతో కలిసి రావచ్చు. రాష్ట్రాన్ని బలోపేతం చేయడానికి ‘బాత్‌ బిహార్‌ కీ’లో పాల్గొనండి’’ అని పిలుపునిచ్చారు. నితీష్ కుమార్ తనను కొడుకులా చూసుకున్నారని ఆయనంటే తనకు గౌరవమేనని, అయితే అభిప్రాయాలు వేరని ప్రశాంత్ కిషోర్ చెప్పారు.

నిరసనల పేరుతో ఆస్తుల విధ్వంసానికి పాల్పడేవారిని అక్కడే కాల్చేయండి

ఈ ఏడాది అక్టోబర్లో బిహార్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. పీకే చేసిన ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. కాంగ్రెస్, ఆర్జేడీ బలహీన పడగా.. జేడీయూ-బీజేపీ కూటమికి ప్రత్యామ్నాయంగా పీకే సొంతంగా పార్టీ ఏర్పాటు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. బీహార్ ఎన్నికలకు ముందు ప్రశాంత్ కిశోర్ చేపట్టబోతున్న 'బాత్ కీ బీహార్' ప్రకటన అక్కడి రాజకీయ సమీకరణాలను మార్చివేసే అవకాశం ఉంది. కొత్త నాయకత్వాన్ని తీసుకురావడానికే ఈ క్యాంపెయిన్ అని ప్రశాంత్ కిశోర్ చెప్పడం.. నితీశ్‌కు చెక్ పెట్టడానికేనని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు.

వచ్చే ఎన్నికల్లో బీహార్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా నితీష్ కుమార్

గతంలో 'యూత్ కీ పాలిటిక్స్' పేరుతోనూ ప్రశాంత్ కిశోర్ ఓ క్యాంపెయిన్‌ను మొదలుపెట్టారు. దాదాపు 2,38,054 మంది యువతను అందులో భాగం చేశారు. 18-35 ఏళ్ల వయసువారిని క్రియాశీలక రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు ఇలాంటి క్యాంపెయిన్ చేపట్టడం దేశంలో ఇదే మొట్టమొదటిసారి అని IPAC వెబ్‌సైట్‌లో పేర్కొనడం ఆసక్తికర అంశం.