Patna, Febuary 27: ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జనతాదళ్ పార్టీ(జేడీయూ) మాజీ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్‌పై (Prashant Kishor) చీటింగ్ కేసు నమోదైంది. ప్రశాంత్ కిషోర్ పై పాట్నా పోలీసులు ఛీటింగ్ కేసు (Cheating Case) నమోదు చేసిన ఘటన ఇప్పుడు బీహార్ రాష్ట్రంలో సంచలనం రేపుతోంది. ప్రశాంత్ కిషోర్ తన కంటెంట్‌ను దొంగిలించి ‘బీహార్ కి బాత్’ ప్రచారానికి వాడుకున్నారని శశ్వత్ గౌతమ్ పట్నా నగరంలోని పాటలీపుత్ర పోలీసుస్టేషనులో (Patna Police Station) ఫిర్యాదు చేశారు.
ప్రశాంత్ కిషోర్‌పై బీహార్ సీఎం సంచలన వ్యాఖ్యలు
వాస్తవానికి ‘బాత్ బిహార్ కీ’ కార్యక్రమం తన ఆలోచనల్లో రూపుదిద్దుకుందని, కానీ, తన మాజీ సహోద్యోగి అయిన ఒసామా అనే వ్యక్తి ఆ ఐడియాను ప్రశాంత్ కిషోర్‌కు చెప్పాడని గౌతమ్ ఆరోపించాడు. తాను ‘బిహార్ కీ బాత్ ’ (Baat Bihar Ki campaign) అనే కార్యక్రమాన్ని జనవరి నెలలో ప్రారంభిస్తే.. ఆయన తన కార్యక్రమాన్ని ఫిబ్రవరి నెలలో ప్రారంభించాడని పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన ఆధారాలను పోలీసులకు అందజేశాడు.
శశ్వత్ గౌతమ్ ఇచ్చిన ఫిర్యాదు మేర పాటలీపుత్ర పోలీసులు ప్రశాంత్ కిషోర్ పై ఐపీసీ సెక్షన్ 420, 406 ల కింద కేసు నమోదు చేశారు. తాను అభివృద్ధి చేసిన కంటెంట్ ను ఒసామా అనే వ్యక్తి పేరిట ప్రశాంత్ కిషోర్ వాడుకున్నారనే ఫిర్యాదుపై తాము దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు.
ప్రశాంత్ కిషోర్‌ను పార్టీ నుంచి బహిష్కరించిన జేడీయూ
ప్రశాంత్ కిషోర్ బీహార్ తోపాటు పలు రాష్ట్రాల్లో పలు రాజకీయ పార్టీలకు వ్యూహకర్తగా పనిచేశారు. జేడీ(యూ)లో చేరిన ప్రశాంత్ కిషోర్ క్రమశిక్షణ చర్యగా అతన్ని పార్టీ నుంచి తొలగించారు. గత వారం ప్రశాంత్ కిషోర్ బీహార్ సీఎం నితీష్ కుమార్ పై విమర్శలు గుప్పించిన నేపథ్యంలో ఆయనపై కేసు నమోదు కావడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఈ మధ్య నితీష్ కుమార్ పాలన విఫలమైందని పీకే ఆరోపించారు.
కోటి మంది యువత అభిప్రాయాలను సేకరించడమే లక్ష్యంగా ఫిబ్రవరి 20న ప్రశాంత్ కిషోర్ ‘బాత్ బిహార్ కీ’ అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు 100 రోజుల పాటు రాష్ట్రమంతా పర్యటిస్తానని ఆయన అన్నారు. బిహార్‌ను దేశంలోని 10 గొప్ప రాష్ట్రాల్లో ఒకటిగా చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు.