Amaravati, Jan 26: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదితో పాటు ఆ శాఖ కమిషనర్ గిరిజా శంకర్‌పై రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. ఇద్దరు అధికారులనూ బదిలీ చేయాలని ఏపీ ఉత్తర్వులు జారీ చేయగా ఎన్నికల కమిషన్ మాత్రం వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. నిబంధనల ఉల్లంఘనలను సర్వీసు రికార్డుల్లో నమోదు చేయాలని ఆదేశించింది. అధికారుల నిర్లక్ష్యం వల్లే 2021 ఓటర్ల జాబితా సిద్ధం కాలేదని పేర్కొంది. ఈ కారణంగా యువ ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయారని తెలిపింది. ఇద్దరు అధికారులూ తమ విధుల నిర్వహణలో విఫలమయ్యారని వ్యాఖ్యానించింది. టెక్నికల్, న్యాయపర చిక్కుల వల్లే 2019 ఓటర్ల జాబితాతోనే ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు కమిషన్ (SEC) పేర్కొంది.
ఎన్నికల కమిషన్ వెబ్ సైట్‌లో ఆ ప్రొసీడింగ్స్ ఉంచారు. అంతకుముందు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్‌ను బదిలీ చేయాలని ప్రభుత్వం (Andhra Pradesh government) తీసుకున్న నిర్ణయాన్ని మంగళవారం ఉదయం ఎస్ఈసీ తిరస్కరించింది. పంచాయతీ ఎన్నికలు (AP Panchayat Polls 2021) జరుగుతున్న దశలో బదిలీ చేయడంపట్ల ఎన్నికల కమిషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ అంశానికి సంబంధించి అటు ప్రభుత్వానికి.. ఇటు ఎన్నికల కమిషన్‌కు మధ్య వివాదం కొనసాగుతోంది. అయితే తాజాగా వారిద్దరిపై ఎన్నికల కమిషన్ అభిశంసన తెలిపింది.
ఇదిలా ఉంటే 9 మంది అధికారులను బదిలీ చేయాలని ప్రభుత్వాన్ని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ (Nimmagadda Rameh kumar) కోరారు. మరోసారి సీఎస్ ఆదిత్యనాథ్, జీఏడీ పొలిటికల్ సెక్రటరీకి నిమ్మగడ్డ లేఖ పంపారు. గుంటూరు, చిత్తూరు కలెక్టర్లు, తిరుపతి అర్బన్ ఎస్పీ, శ్రీకాళహస్తి, పలమనేరు డీఎస్పీలు, నలుగురు సీఐలను వెంటనే బదిలీ చేయాలని ఆయన సూచించారు. గతంలో రాసిన లేఖ విషయాన్ని లేఖలో ఎస్‌ఈసీ ప్రస్తావించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు ఎన్నికలు నిర్వహిస్తున్నామని నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ప్రకటించారు.
నిరుడు మార్చిలో ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ సందర్భంగా కొంత మంది అధికారులను బదిలీ చేయాలని తామిచ్చిన ఆదేశాలపై రాష్ట్రప్రభుత్వం స్పందించపోవడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నెల 22న స్వయంగా చర్యలు చేపట్టింది. తనకున్న విచక్షణాధికారాలతో కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ వారిని తొలగించారు. గుంటూరు, చిత్తూరు కలెక్టర్లు, తిరుపతి అర్బన్ ఎస్పీ, పలమనేరు డీఎస్పీ (అదనపు ఎస్పీగా పదోన్నతి పొందారు), శ్రీకాళహస్తి డీఎస్పీ, మాచర్ల, పుంగనూరు, రాయదుర్గం, తాడిపత్రి సీఐలను బదిలీ చేస్తూ ఆదేశాలిచ్చారు. చిత్తూరు, గుంటూరు కలెక్టర్ల నుంచి ఆయా జాయింట్ కలెక్టర్లు-1 బాధ్యతలు తీసుకోవాలని.. తిరుపతి అర్బన్ ఎస్పీ చిత్తూరు ఎస్పీకు చార్జ్ అప్పగించాలని సూచించారు.
దీంతో పాటు కేంద్ర కాబినెట్ కార్యదర్సికి ఏపీ ఎన్నికల కమీషనర్ లేఖ రాశారు. ఎన్నికల కమిషనుకు ఆర్టికల్ 324 ప్రకారం జిల్లా కలెక్టర్లకు ఎన్నికల నిర్వహణ అప్పజెప్పామని కలెక్టర్ల ఆధ్వర్యంలోనే ఎన్నికల విధులు నిర్వహించాలని భావిస్తున్నామని కేంద్రానికి లేఖలో ఎస్ఈసీ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సేవలను వినియోగించుకోవాలని అనుకుంటున్నామన్న ఆయన కొంత మంది ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొనమని చెబుతున్నారని కూడా లేఖలో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన ఉద్యోగుల సేవలకు అనుమతివ్వండి అని ఆయన లేఖలో కోరారు. చివరి ప్రయత్నంగా మాత్రమే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను వినియోగించుకుంటామని ఆయన పేర్కొన్నారు.
పంచాయతీ ఎన్నికలను 2021 ఓటర్ల జాబితాతో కాకుండా 2019 ఓటర్ల జాబితాతో నిర్వహించడం వల్ల 3.6 లక్షల మంది ఓటుహక్కును కోల్పోతారని, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని అభ్యర్థిస్తూ గుంటూరుకు చెందిన విద్యార్థిని ధూళిపాళ్ల అఖిల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఎన్నికల నోటిఫికేషన్ అమలును నిలిపేయాలని కోరారు. ఈ వ్యాజ్యంపై అత్యవసరంగా విచారణ చేపట్టాలని అఖిల న్యాయవాది శివప్రసాద్‌రెడ్డి సోమవారం హైకోర్టును అభ్యర్థించారు. ఈ అభ్యర్థనను న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులు తోసిపుచ్చారు.
ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైందని గుర్తుచేసిన న్యాయమూర్తి ఎన్నికల వ్యవహారం సుప్రీంకోర్టు ముందు ఉందని చెప్పారు. సుప్రీంకోర్టు ఏం చెబుతుందో చూద్దామని, ఆ తరువాత అత్యవసర విచారణ గురించి ప్రస్తావించవచ్చని తెలిపారు. ఓటర్ల జాబితా నుంచి పేర్లను తొలగించారని, దీనిపై అత్యవసర విచారణ జరపాలన్న మరో న్యాయవాది అభ్యర్థనను కూడా న్యాయమూర్తి తోసిపుచ్చారు.
ఇదిలా ఉంటే బుధవారం ఉదయం 11 గంటలకు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎస్ ఆదిత్యనాథ్, డీజీపీలు కూడా పాల్గొననున్నారు. కాన్ఫరెన్స్‌లో పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో చర్చించనున్నారు. పంచాయతీల్లో నామినేషన్లకు ఏర్పాట్లు, ఓటర్ల జాబితా రూపకల్పన తదితర అంశాలపై నిమ్మగడ్డ చర్చించనున్నారు. పంచాయతీల్లో భద్రతా పరమైన అంశాలపై సమావేశంలో ఎస్‌ఈసీ చర్చించనున్నారు. అయితే ఎన్నికలు సజావుగా జరిగేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు ఇవ్వనున్నారు. ఎన్నికలకు సంబంధించి పలు అంశాలపై కలెక్టర్లు, ఎస్పీలకు దిశానిర్దేశం చేయనున్నారు.