
Amaravati, Feb 10: ఏపీలో తొలి దశ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. రెండో విడత పంచాయితీ ఎన్నికలు (AP Local Body Polls) ఈ నెల 13న జరగనున్నాయి.ఈ నేపథ్యంలో రెండో దశ ఎన్నికల్లో ఎస్‌ఈసీ ఏకగ్రీవాలను ప్రకటించింది. మొత్తం 13 జిల్లాల్లో 539 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయని ఏపీ ఎస్ఈసీ స్పష్టం చేసింది.
గుంటూరు జిల్లాలో 70, ప్రకాశం జిల్లాలో 69, విజయనగరం జిల్లాలో 60, కర్నూలు జిల్లాలో 57, నెల్లూరు జిల్లాలో 35, చిత్తూరు జిల్లాలో 62, శ్రీకాకుళం జిల్లాలో 41, కడప జిల్లాలో 40, కృష్ణా జిల్లాలో 36, విశాఖ జిల్లాలో 22, తూర్పుగోదావరి జిల్లాలో 17, పశ్చిమగోదావరి జిల్లాలో 15, అనంతపురం జిల్లాలో 15 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయని స్పష్టం చేసింది. రెండో దశలో 3,323 పంచాయితీలకు ఎన్నికలు (Andhra Pradesh Panchayat Elections 2021) జరగనున్నాయి.
నామినేషన్ల ఉపసంహరణ తర్వాత 17,664 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 32,481 వార్డు సభ్యుల స్థానాలకు 77,447 మంది పోటీ పడుతున్నారు. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ అనంతరం రెండో దశ ఎన్నికల్లో నిలిచే అభ్యర్థుల వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం రాత్రి అధికారికంగా ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్ వాప్తంగా తొలిదశ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ముగిసింది. మొత్తం 2,723 పంచాయతీల్లో తొలిదశ పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిసింది. ఫలితాలు వచ్చిన వెంటనే ఉపసర్పంచ్‌లను ఎన్నుకున్నారు. ఉపసర్పంచ్ ఎన్నిక పూర్తి కాని చోట మరుసటి రోజున ఆ ప్రక్రియ ఉటుంది. కాగా తొలి దశలో ఇప్పటివరకు 525 పంచాయతీలు ఏకగ్రీవం కాగా .. ఇందులో వైఎస్సార్‌సీపీ నుంచి 518, ఇతరులు ఏడుగురు ఉన్నారు. కాగా 12 జిల్లాల్లోని 18 రెవెన్యూ డివిజన్లలో తొలిదశ పోలింగ్ జరిగింది.
నాలుగో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ఘట్టం కాస్సేపట్లో ఆరంభం కాబోతోంది. ఇవి చివరి విడత ఎన్నికలు, ఈ నెల 21వ తేదీన పోలింగ్. ఉదయం 10 గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. అన్ని జిల్లాల్లో 3299 పంచాయతీలకు చివరి విడత ఎన్నికలను నిర్వహించనున్నారు. తొలి రెండు విడతల్లోనూ వెయ్యికి పైగా ఏకగ్రీవాలు నమోదైన పరిస్థితుల్లో.. మిగిలిన చివరి రెండు దశల్లో వాటి ప్రభావం ఎలా ఉండబోతోందనేది ఆసక్తి రేపుతోంది. రెండు రోజుల పాటు సాగే నామినేషన్ల దాఖలు ప్రక్రియ, స్క్రూటినీ.. అనంతరం ఉపసంహరణ తరువాతే- ఏకగ్రీవాల వివరాలు వెల్లడవుతాయి.