AP Assembly Session 2nd Day Highlights: నేను 25 ఏళ్ళ యువకుడ్ని,మీరు నన్నేమి చేయలేరన్న చంద్రబాబు, రాజీనామాకు సిద్ధమంటూ సవాల్, ఎన్నికల మేనిఫెస్టో మాకు భగవద్గీత, ఖురాన్, బైబిల్, అన్నీ అమలు చేసి తీరుతామన్న ఏపీ సీఎం జగన్ 
AP Assembly Winter Session 2019 Second day Highlights (Photo-Facebook)

Amaravathi, December 10: ఆంధ్రప్రదేశ్(Andhra pradesh) అసెంబ్లీ శాసన సభ సమావేశాలు రెండో రోజూ(AP Assembly Session 2nd Day) యుద్ధాన్నే తలపించాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలాయి. ప్రధానంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు (Chandra babu)గతంలో సీఎంగా ఉన్న సమయంలో రైతులను నిలువునా ముంచారంటూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు విరుచుకుపడ్డారు. అలాగే చంద్రబాబు తనయుడు లోకేష్ (Nara lokesh)ని టార్గెట్ చేస్తూ అధికార పార్టీ ఎమ్మెల్యే సెటైర్లు వేశారు.

ఒకానొక దశలో ప్రతిపక్ష నేత చంద్రబాబు సీరియస్ అయ్యారు. మీరు 150 మంది ఉన్నా నన్నేమి చేయలేరంటూ మండిపడ్డారు. నా వయస్సు గురించి ఇక్కడ రాజకీయలా తగదని వయస్సు ఎంత ఉన్నా నేను ఇంకా 25 ఏళ్ల కుర్రవాడిలానే పనిచేస్తానని తెలిపారు. రెండవ రోజు అసెంబ్లీ సమావేశాల హైలెట్స్ ఓ సారి చూద్దాం.

టీడీపీ సభ్యులు ఆందోళన

సమావేశాలు(AP Assembly,AP Assembly Winter Session 2019) ప్రారంభం కాగానే టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించాలని పట్టుబట్టారు. టీడీపీ తీరుపై స్పీకర్ తమ్మినేని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ పార్టీ కార్యాలయం కాదని మండిపడ్డారు. స్పీకర్ వ్యాఖ్యలకు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా అంతే దీటుగా స్పందించారు. అసెంబ్లీలో ఇష్టానుసారం ప్రవర్తిస్తామంటే కుదరదన్నారు.

ఇది పార్టీ ఆఫీసు కాదన్న విషయం తమకు చెప్పాల్సిన పనిలేదన్నారు. మళ్లీ కల్పించుకున్న స్పీకర్ గతంలో మీరు ఏం చేశారో తమకు అన్నీ తెలుసని అన్నారు. చంద్రబాబు కల్పించుకోవడంతో స్పీకర్, చంద్రబాబు మధ్య కాసేపు వాగ్వివాదం జరిగింది. చంద్రబాబుపైనా స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో టీడీపీ సభ్యులు మండిపడ్డారు. స్పీకర్ తీరుకు నిరసనగా సభ నుంచి వాకౌట్ చేశారు.

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ

తన నియోజకవర్గ అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రి జగన్ ను తాను కలిశానని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) తెలిపారు. ముఖ్యమంత్రిని తాను కలవడం ఇదే తొలిసారి కాదని చెప్పారు. వంశీ మాట్లాడుతున్నప్పుడు టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. జగన్ (AP CM YS Jagan) ను కలిసిన తర్వాత టీడీపీ తనపై దుష్ప్రచారం చేసిందని విమర్శించారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు మీడియాలో తాను చూశానని చెప్పారు.

40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబునాయుడు గారికి అంత భయం ఎందుకు సార్? అని వంశీ ప్రశ్నించారు. తన మాటలను వినలేక ఆయన బయటకెందుకు వెళ్లిపోయారు సార్? అని అడిగారు. ఆయన ఒక్కరికే హక్కులు ఉంటాయా? మాకు హక్కులు ఉండవా? అని ప్రశ్నించారు. గన్నవరం నియోజకవర్గ ప్రజలు తనను ఎన్నుకున్నారని... వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత తనపై ఉందని తెలిపారు. ఇకపై తనను టీడీపీ సభ్యుడిగా చూడవద్దని... ప్రత్యేక సభ్యుడిగా తనను గుర్తించాలని స్పీకర్ తమ్మినేని సీతారాంను కోరారు. ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేగా తన హక్కులను కాపాడాలని విన్నవించారు.

అసెంబ్లీ ఎవరి జాగీరు కాదు: స్పీకర్

ఎన్టీఆర్ కు జరిగిన అన్యాయం పట్ల తాను చాలా విచారిస్తున్నానని, ఆ పాపంలో తాను కూడా ఉన్నానని, దానికి పశ్చాత్తాపపడుతున్నానని తెలిపారు. ఆ పనిలో భాగస్వామినైనందుకు 15 ఏళ్లు అధికారానికి దూరంగా ఉన్నానని స్పీకర్ అన్నారు. స్పీకర్ గా తనకున్న విచక్షణాధికారంతోనే ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడేందుకు వల్లభనేని వంశీకి అవకాశమిచ్చానని తమ్మినేని చెప్పారు. అసెంబ్లీని వైసీపీ కార్యాలయంగా మార్చారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సరికాదని చెప్పారు. అసెంబ్లీ ఎవరి జాగీరు కాదు... ప్రజల జాగీర్ అని తెలిపారు.

మేనిఫెస్టోలో చెప్పని అంశాలను కూడా అమలు చేస్తున్నాం : ఏపీ సీఎం జగన్

అప్పట్లో టీడీపీ తమ ఎన్నికల మేనిఫెస్టోను ఆన్ లైన్ లో నుంచి తీసేసింది. మేమలా చేయట్లేదు. మా మేనిఫెస్టో అందరికీ అందుబాటులోనే ఉంది. ఈ మేనిఫెస్టోనే మాకు బైబిల్, ఖురాన్, భగవద్గీత.. ఈ విషయాన్ని చెబుతూ మా మేనెఫెస్టోను ఎన్నికల ముందు విడుదల చేశాం' అని అన్నారు.

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచి నాణ్యమైన బియ్యం పంపిణీ

ఇందులో ఉన్న ప్రతి అంశం మేము అమలు చేస్తామని ఓట్లు అడిగాం. చాలా ప్రధాన విషయం ఏంటంటే దీంట్లో ఎక్కడా మేము బియ్యం గురించి పేర్కొనలేదు. మేనిఫెస్టోలో చెప్పని అంశాలను కూడా అమలు చేస్తున్నాం. కావాలంటే కళ్లద్దాలు సరి చేసుకొని చదువుకోండి.. ఎవరైనా చదువుకోవచ్చు' అని అన్నారు.

నాణ్యమైన బియ్యం ఇస్తామనే తాము చెప్పాము : జగన్

తమ మేనిఫెస్టోలో సన్న బియ్యం ప్రస్తావనే లేదని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. నాణ్యమైన బియ్యం ఇస్తామనే తాము చెప్పామని అన్నారు. ఈ అంశంపై సాక్షి పత్రికలో తప్పుగా రాశారని... నాణ్యమైన బియ్యం, సన్న బియ్యానికి తేడా తెలియకుండా రాశారని చెప్పారు. అదే రోజు ఇతర పేపర్లలో వచ్చిన వార్తను కూడా చూడాలని అన్నారు.

తొలి రోజు అసెంబ్లీ సమావేశంలో హైలెట్స్

మీ మాదిరే వాళ్లు కూడా నాణ్యమైన బియ్యం, సన్న బియ్యానికి తేడా తెలియక కన్ఫ్యూజ్ అయ్యారని చెప్పారు. స్వర్ణ బియ్యాన్నే సన్న బియ్యం అంటారని తెలిపారు. ప్రజలకు నాణ్యమైన బియ్యం ఇస్తుంటే... ఓర్చకోలేక టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. తాము ఇస్తున్న బియ్యంతో ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు.

వ్యవసాయ ఉత్పత్తులను కనీస మద్దతు ధర కన్నా తక్కువకు విక్రయించాల్సిన అవసరం లేదని, ఈ మేరకు అన్ని పేపర్లలో ప్రకటనలు చేస్తామని ఏపీ సీఎం జగన్ అన్నారు. కనీస గిట్టుబాటు ధరకు రైతులు విక్రయించలేని పరిస్థితి కనుక ఉంటే, ఫలానా చోటుకు వెళ్లి అమ్ముకోండి, ప్రభుత్వమే దగ్గరుండి కొనుగోలు చేస్తుందని చెప్పారు. రైతులకు ఏదైనా సమస్య ఉంటే ఫలానా నెంబర్ కు ఫోన్ చేయాలని, వెంటనే ప్రభుత్వం స్పందిస్తుందని ఈ వివరాలన్నింటిని తెలియజేస్తూ ‘ఫుల్ పేజ్ అడ్వర్టైజ్ మెంట్ ఇస్తాం..మీ పాంప్లేట్ పేపర్ ‘ఈనాడు’లో కూడా థర్స్ డే నాడు కనిపిస్తుంది చూసుకోండి’ అంటూ చంద్రబాబును ఉద్దేశించి జగన్ వ్యాఖ్యలు చేశారు.

నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా: చంద్రబాబు

చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ లో కిలో ఉల్లి రూ. 200కు అమ్ముతున్నారంటూ ముఖ్యమంత్రి జగన్ మరోసారి వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు శవరాజకీయాలు చేయడం కొత్త కాదని విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై చంద్రబాబు అదే స్థాయిలో స్పందించారు. హెరిటేజ్ ఫ్రెష్ తమది కాదని పలు మార్లు చెప్పినా... అవే మాటలు మాట్లాడటం సరికాదని చంద్రబాబు అన్నారు.

దీని గురించి నిన్ననే తాను క్లియర్ గా చెప్పానని... అయినా, సభ్యత లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ కు సవాల్ విసురుతున్నానని... హెరిటేజ్ ఫ్రెష్ తమదని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. నిరూపించలేకపోతే సీఎం పదవికి జగన్ రాజీనామా చేస్తారా? అని సవాల్ విసిరారు. భారతి సిమెంట్స్, సోలార్ విండ్ పవర్ మాదిరి మీలా తాము మోసాలు చేయలేదని అన్నారు.

తనను విమర్శించడానికే ఎక్కువ సమయం కేటాయించారు : చంద్రబాబు

రైతు భరోసా పథకం గురించి మాట్లాడమంటే వైసీపీ సభ్యులు ఎక్కువ మంది తనను విమర్శించడానికే ఎక్కువ సమయం కేటాయించారని, అందుకు రిప్లై ఇచ్చి తన సమయం వృథా చేసుకోదలచుకోలేదని చంద్రబాబు అన్నారు.మాట తప్పం మడమ తిప్పం’ అని చెప్పుకునే వైసీపీ నేతలు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడాన్ని ఏమనాలో వారే చెప్పాలంటూ వైసీపీ సభ్యులను ప్రశ్నించారు. రైతులకు రూ.12,500 ఇస్తామని చెప్పి రూ.7,500 ఇచ్చిన వైసీపీ సభ్యులకు మాట్లాడే హక్కు లేదని అన్నారు.

టీడీపీ హయాంలో ప్రవేశపెట్టిన రైతు రుణమాఫీ పథకం కింద నాలుగు, ఐదు విడతలకు చెందిన డబ్బులు ఇవ్వాల్సిన బాధ్యత వైసీపీ ప్రభుత్వంపై వుందని, ఇవ్వనిపక్షంలో ఇప్పించే బాధ్యత తమపై వుంటుందని చెప్పారు. వడ్డీతో సహా ఆ సొమ్ము రైతులకు వచ్చేలా తాను పోరాడతానని, అవసరమైతే, కోర్టుకు వెళతామని హెచ్చరించారు. వ్యవసాయం దండగ అని తాను అన్నట్టుగా వైసీపీ సభ్యులు చేసిన ఆరోపణలను టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఖండించారు.150 మంది దాడి చేసినా భయపడేది లేదని.. 150 మందికి సమాధానం చెబుతానని స్పష్టం చేసారు. జగన్ మైండ్ గేమ్ లు తన వద్ద చెల్లవని.. మర్యాద ఇచ్చి పుచ్చుకుంటే మర్యాదగా ఉంటుందని హెచ్చరించారు.

నా వ్యాఖ్యలను వక్రీకరించారు: మంత్రి బొత్స సత్యనారాయణ

రాజధాని విషయంలో తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఏపీ మున్సిపల్ శాఖామంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. రాజధాని ప్రాంతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధి చేయలేదు అని మాత్రమే తాను అన్నానని, అయితే కావాలనే తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనలోనే ఉన్నామని, గత ప్రభుత్వం తెచ్చిన లక్ష కోట్ల రూపాయలకు పైగా అప్పులో నుంచి కనీసం 5 వేల కోట్లు కూడా రాజధాని ప్రాంత అభివృద్ధికి ఖర్చు చేయలేదని, ఈ విషయాన్ని వారు మర్చిపోతే ఎలా? అంటూ ఎద్దేవా చేశారు.

వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి

టీడీపీ హయాంలో రైతు చేయి జాపి అడుక్కునే పరిస్థితి ఉండేదని, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు సంతోషంగా వున్నారని వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ఈరోజున చంద్రబాబు ఏది మాట్లాడినా నీటి మీద రాతలే అని, జగన్మోహన్ రెడ్డి ఏది చెప్పినా సరే రాతి మీద చెక్కిన శాసనాలు అని ప్రజలు గుర్తించారని, అందుకే, జగన్ కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. వైఎస్సార్ రైతు భరోసా పథకంపై టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని, ఇంతవరకూ ఏ ముఖ్యమంత్రి తీసుకురానటువంటి పథకం ఇదని అన్నారు.

వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు

ఉదయం నుంచి చూస్తున్నా.. చంద్రబాబునాయుడుగారిలో ఏదో తేడా కనిపిస్తోంది. రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఉదయం కూడా ముఖ్యమంత్రిగారిని చూసి ‘లే..లే..లే’ అంటున్నారు. వారు చాలా స్పీడ్ గా మాట్లాడుతున్నారు. ఇరవై ఐదేళ్ల వయసులో ఉన్నట్టు వీరు ప్రవర్తిస్తున్నారు.. వీరి అబ్బాయి ఏమో డెబ్బై ఏళ్లలా ప్రవర్తిస్తున్నారు’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘నాకు ప్రధాన ప్రతిపక్ష నేత ఇవాళ చాలా బాగా నచ్చారు. ఎందుకంటే, అసత్యాలను చాలా సునాయాసంగా మాట్లాడేస్తున్నారు. ఇందులో వీరిని మించిన దిట్ట నాకు ఇంతవరకూ ఎవరూ కనిపించలేదు. ఇంతకుముందు చేసిన వాగ్దానాలు మీరు నెరవేర్చలేదంటే వారికి కోపమొచ్చేసింది’ అంటూ విమర్శలు చేశారు.

వైసీపీ ఎమ్మెల్యే రోజా

టీడీపీ అధినేత చంద్రబాబు, తనయుడు లోకేశ్ పై తీవ్ర విమర్శలు చేశారు. వర్ధంతికి, జయంతికి తేడా తెలియని స్థితిలో చంద్రబాబు తనయుడున్నాడని పేర్కొన్నారు. ఏపీ దేశమో, రాష్ట్రమో తెలియని స్థితిలో ఉన్నాడంటూ.. అమెరికా వెళ్లి చదువుకుంది ఇదేనా అని ప్రశ్నించారు. సభలో నిన్న మహిళా భద్రతపై చర్చసాగుతూంటే.. టీడీపీ నేతలు ఉల్లిపాయల దండలు మెడలో వేసుకొని వచ్చి ఆందోళన చేశారన్నారు. మహిళలకు మీరు ఇచ్చే విలువ ఇదేనా? అంటూ ప్రశ్నించారు. ‘టీడీపీ పాలనలో రైతులు 90 శాతం అప్పులపాలైంది నిజంకాదా? రైతులు ఆత్మహత్యలు చేసుకుంది నిజం కాదా? రైతులు తమ ఉత్పత్తులకు మద్దతు ధర రాక వారు నలిగిపోయిన పరిస్థితులు తెలియదా?’ అంటూ చంద్రబాబును సభాముఖంగా నిలదీశారు.

ఏపీ ఆర్థిక శాఖమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్

రైతులకు చెప్పిన దాని కంటే ఎక్కువే చేస్తున్నామని ఏపీ ఆర్థిక శాఖమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని ప్రతిపక్షం తప్పుబట్టేందుకు చూస్తోందని, లేనిది ఉన్నట్టు సృష్టించడం టీడీపీ నైజమని మండిపడ్డారు.టీడీపీ చేసిన పాపానికి రైతులకు ఇవ్వాల్సిన రుణం కన్నా ఒక్క పైసా కూడా ఎక్కువగా బ్యాంకులు ఇవ్వడం లేదని విమర్శించారు. చంద్రబాబు హయాంలో ‘అన్నదాత సుఖీభవ’ పథకానికి కూడా డిస్కమ్ ల డబ్బులు వాడారని ఆరోపించారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చంద్రబాబు మార్చారని ధ్వజమెత్తారు.