School | Representational Image | (Photo Credits: PTI)

VJY, June 12: రాష్ట్రంలో వేసవి సెలవులు అనంతరం సోమవారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం అయ్యాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న దృష్ట్యా ఈ నెల 17వ తేదీ వరకూ ఒంటిపూట బడులు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉదయం 7.30 నుంచి 11.30 గంటల వరకూ తరగతులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌.సురేష్‌కుమార్‌ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. రాబోయే నాలుగైదు రోజుల్లో 40 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్న ఐఎండీ, రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థల ముందస్తు సూచనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

అన్ని యాజమాన్యాలు, అన్ని బోర్డుల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్‌ పాఠశాలలు ఆ ఆదేశాలు పాటించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం 8.30 నుంచి 9 గంటల మధ్య రాగి జావ, ఉదయం 11.30 నుంచి 12 గంటల మధ్య మధ్యాహ్న భోజనం పెట్టాలని ఆ ఉత్తర్వుల్లో వివరించారు. 19వ తేదీ నుంచి 2023-24 విద్యా ప్రణాళికలోని షెడ్యూల్‌ ప్రకారం పాఠశాలలు పనిచేస్తాయని తెలిపారు.

స్కూళ్లు ప్రారంభమైన తొలిరోజే విద్యాకానుక, నాలుగో ఏడాది జగనన్న విద్యాకానుకను అందించిన సీఎం జగన్

రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను గ్లోబల్‌ సిటిజన్స్‌గా తీరిదిద్దేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరిన్ని చర్యలు ప్రారంభించారు. ప్రపంచస్థాయిలో పోటీని తట్టుకునేలా, మారుతున్న టెక్నాలజీ రంగంలో విద్యార్థులను సుశిక్షితులుగా తీర్చిదిద్దేలా మరో అడుగు ముందుకేశారు. ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు, గ్లోబల్‌ టెక్‌ కంపెనీల ప్రతినిధులతో ఉన్నత స్థాయి వర్కింగ్‌ గ్రూపును ఏర్పాటు చేశారు. పాఠ్యప్రణాళిక, ఉండాల్సిన మానవవనరులు, సదుపాయాలపై వచ్చేనెల జులై 15 కల్లా వర్కింగ్‌ గ్రూపు నివేదిక ఇవ్వనుంది.

వీడియో ఇదిగో, నాలుగేళ్ల పాలనపై వైఎస్ జగన్‌ సిగ్గుపడాలంటున్న అమిత్ షా, అవినీతి, కుంభకోణాలు తప్ప ఏమీ లేవని వెల్లడి

ప్రపంచస్థాయిలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పోటీపడాలంటే ఇంగ్లిషులో ప్రావీణ్యం చాలా కీలకం. ప్రపంచస్థాయి కంపెనీల్లో ఉద్యోగాలకు ఇంగ్లిషులో పరిజ్ఞానం అన్నది చాలా ముఖ్యం. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. దీంతోపాటు భవిష్యత్తు టెక్నాలజీలపై పిల్లలను సుశిక్షతులగా తయారు చేసేందుకు ప్రత్యేక శ్రద్ధపెట్టింది. ఆర్టిఫియల్‌ ఇంటెలిజెన్స్‌, లార్జ్‌ లాంగ్వేజ్‌ మోడల్స్‌ (ఎల్‌ఎల్‌ఎం), ఎల్‌ఎల్‌ఎం ఫ్లాట్‌ఫాం మీదకు వచ్చే డేటా అనలిటిక్స్‌ ఛాట్‌ జీపీటీ, వెబ్‌ 3.O, అగ్‌మెంటెడ్‌ రియాల్టీ, వర్చువల్‌ రియాల్టీ, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, సెంట్ర్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ, అటానమస్‌ వెహికల్స్‌, త్రీడీ ప్రింటింగ్‌, గేమింగ్‌ తదితర అంశాలపై విద్యార్థులకు నైపుణ్యం ఇచ్చే అంశాలపై తీసుకోవాల్సిన చర్యలను, మార్పులను సూచించేందుకు వర్కింగ్‌ గ్రూప్‌ ఏర్పాటుకు సీఎం ఆదేశాలిచ్చారు.

విద్యాభ్యాసం తొలినాళ్లనుంచే ఈ తరహా టెక్నాలజీపై బోధన, సంబంధిత నైపుణ్యాలను అభివృద్ధిచేయడానికి ప్రత్యేక పాఠ్యాంశాలు, పాఠ్యప్రణాళిక, ఇవ్వాల్సిన శిక్షణ తదితర అంశాలపై ఈ వర్కింగ్‌ గ్రూపు ద్వారా ప్రభుత్వం దృష్టిపెట్టనుంది. పాఠ్యప్రణాళిక, మౌలిక సదుపాయాలు, మానవవనరులు, లెర్నింగ్‌ కంటెంట్, ల్యాబులు తదితర అంశాలు పాఠశాలల్లో ఎలా ఉండాలన్న దానిపై ఈ వర్కింగ్‌ గ్రూపు ఖరారు చేయనుంది.

పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దీనికి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. రాష్ట్ర ప్రభుత్వ ఐటీ సెక్రటరీ మెంబర్‌గా ఉంటారు. పాఠశాలల మౌలిక సదుపాయాల కమిషనర్‌ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. స్కూలు ఎడ్యుకేషన్‌ కమిషనర్‌, సమగ్ర శిక్ష ప్రాజెక్టు డైరెక్టర్‌, ఎస్‌ఈఆర్‌టీ డైరెక్టర్‌, మైక్రో సాఫ్ట్ ఇండియాకు చెందిన అశుతోష్‌ చద్దా, అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ ఇండియాకు చెందిన షాలినీ కపూర్‌, గూగుల్‌కు చెందిన ప్రతినిధి, ఇంటెల్‌ ఏసియాకు చెందిన షాలినీ కపూర్‌, నాస్కాం ప్రతినిధి సెంటర్‌ ఫర్‌ డిజిటల్‌ ఎకానమీ పాలసీ రీసెర్చ్‌ అధ్యక్షుడు జైజిత్‌ భట్టాచార్య, నీతి ఆయోగ్‌ డిజిటల్‌ కమ్యూనికేషన్స్‌ మాజీ సలహాదారు అర్చనా. జి.గులాటి వర్కింగ్‌ కమిటీలో సభ్యులుగా ఉంటారు. జులై 15, 2023 నాటికల్లా ఈవర్కింగ్‌ గ్రూపు ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది.

కొత్త విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియను పాఠశాల విద్యాశాఖ ముందే చెప్పినట్లుగా సమర్ధంగా చేపట్టింది. గతంలో మాదిరిగా ఎక్కడా గందరగోళం, గొడవలు లేకుండా, అక్షరాల 50 వేల మంది పైచిలుకు టీచర్ల బది­లీల ప్రక్రియను ప్రారంభించింది. రకరకాల కారణాలతో అయిదారేళ్లుగా ఆగిపోయిన ఈ బదిలీల కౌన్సెలింగ్‌ 15 రోజుల్లో పూర్తిచేసి, కొత్త స్కూళ్లలో కొత్త టీచర్లను బదిలీ చేసింది.