Passport Scam in Telangana: ఒకే అడ్రస్ మీద 32 పాస్‌పోర్టులు, సహకరించిన ఎస్సై, ఏఎస్సైపై వేటు, ఇద్దరు పోలీసులు సహా మొత్తం 8 మందిని అరెస్టు చేశామని తెలిపిన సీపీ సజ్జనార్
Cyberabad CP VC Sajjanar | Photo: ANI

Hyderabad, Feb 24: నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ నుంచి రోహింగ్యాలకు పాస్‌పోర్టుల జారీ వ్యవహారంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ వ్యవహారంలో (Bodhan Passport Case) ఇప్పటికే 8 మందిని అరెస్టు చేశారు. వీరికి సహకరించిన ఓ ఎస్సై, మరో ఏఎస్సైపై వేటు వేశారు. వారిని కూడా అరెస్టు చేసి, విచారణ కొనసాగిస్తున్నారు.

శంషాబాద్‌ విమానాశ్రయంలో పట్టుబడిన ముగ్గురు బంగ్లాదేశీయుల నుంచి స్వాధీనం చేసుకున్నవి నకిలీ పాస్‌పోర్టులు కావని, అసలైన పాస్‌పోర్టులని..అయితే వారు అక్రమ మార్గాల్లో (Passport Scam in Telangana) పొందారని సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ (CP Sajjanar) మంగళవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ కేసులో మరిన్ని వివరాల కోసం ఇమ్మిగ్రేషన్‌, ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయానికి లేఖలు రాశామన్నారు.

బోధన్‌ కేంద్రంగా మూడేళ్లపాటు సాగిన ఈ కుంభకోణంలో (Hyderabad Fake passport scam) మొత్తం 72 మంది బంగ్లాదేశీయులు అడ్డదారిలో కేవలం 7 చిరునామాలతోనే పాస్‌పోర్టులు పొందినట్లు తేలిందన్నారు. వారిలో 19 మంది ఇప్పటికే విదేశాలకు పారిపోయారని వివరించారు. ఈ కేసులో ఇప్పటివరకు ఇద్దరు పోలీసులు సహా మొత్తం 8 మందిని అరెస్టు చేశామని, ముగ్గురు పరారీలో ఉన్నారని సజ్జనార్‌ వివరించారు.

ఘట్‌కేసర్ కిడ్నాప్ డ్రామా ఆడిన విద్యార్థిని ఆత్మహత్య, తీవ్ర విమర్శల పాలు కావడంతో మనస్తాపానికి గురై షుగర్‌ ట్యాబ్లెట్స్‌ మింగి ఆత్మహత్యా యత్నం, చికిత్స పొందుతూ మృతి

సీపీ సజ్జనార్‌ తెలిపిన వివరాల ప్రకారం... బంగ్లాదేశ్‌కు చెందిన పరిమళ్‌ బెయిన్‌ 2013లో సముద్ర మార్గం ద్వారా భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించాడు. పశ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లాలో ఉంటున్న జోబా అనే వ్యక్తి దగ్గర ఆశ్రయం పొందాడు. అక్కడే అక్రమంగా గుర్తింపు పత్రాలు, పాన్‌ కార్డు పొందాడు. బోధన్‌లో ఆయుర్వేద వైద్యశాల నిర్వహిస్తున్న బెంగాల్‌వాసి సమీర్‌ రాయ్‌ వద్దకు 2015లో వచ్చిన పరిమళ్‌.. వైద్యం నేర్చుకొని 2016లో సొంతంగా క్లినిక్‌ ఏర్పాటు చేశాడు.

బోధన్‌లో ఉంటూనే నకిలీ గుర్తింపు కార్డులు పొందిన అతను పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అప్పట్లో స్పెషల్‌ బ్రాంచ్‌ ఏఎస్సైగా ఉన్న పెరుక మల్లేశ్‌రావు నిర్లక్ష్యంగా వెరిఫికేషన్‌ చేయడంతో పరిమళ్‌కు పాస్‌పోర్టు జారీ అయింది. ఈ అనుభవంతోనే అక్రమంగా పాస్‌పోర్టులు పొందే దందాకు అతను శ్రీకారం చుట్టాడు. బతుకుదెరువు కోసం అడ్డదారుల్లో విదేశాలకు వెళ్లాలనుకొనే బంగ్లాదేశీయులకు తప్పుడు మార్గాల్లో పాస్‌పోర్టులు ఇప్పించే స్కాంకు పరిమళ్‌ తెరలేపాడు.

రెండు స్థానాలకు వందల సంఖ్యలో అభ్యర్థుల పోటీ, తెలంగాణలో ముగిసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల గడువు, మార్చి14న పోలింగ్, మార్చి17న ఓట్ల లెక్కింపు ప్రక్రియ

తొలుత పుణేలోని ఓ కంపెనీలో పని చేసే తన సోదరుడు గోపాల్‌ బెయిన్‌కు ఏఎస్సై మల్లేశ్‌ సహకారంతో అక్రమంగా పాస్‌పోర్టు ఇప్పించాడు. ఆ తర్వాత 2019లో సమీర్, ఢిల్లీవాసి షానాజ్‌లతో జట్టుగా ఏర్పడ్డాడు. సమీర్‌ బంగ్లా జాతీయుల్ని అడ్డదారిలో సరిహద్దులు దాటించి భారత్‌కు తీసుకుకొచ్చే వ్యూహం అమలు చేయగా వారికి తప్పుడు చిరునామాలతో పాస్‌పోర్టులు ఇప్పించి విదేశాలకు వెళ్లడానికి టికెట్లను షానాజ్, సద్దాం హుస్సేన్‌ సమకూర్చేవారు. ఇరాక్‌లో పనిచేస్తున్న సమీర్‌ కుమారుడు మనోజ్‌ వీసాల ప్రాసెసింగ్‌కు పాల్పడేవాడు. ఈ దందాకు ప్రస్తుతం స్పెషల్‌ బ్రాంచ్‌ ఎస్సైగా ఉన్న మల్లేశ్‌రావు, ఏఎస్సై బి.అనిల్‌ కుమార్‌ సహకారం అందించారు.

2014 నుంచి ఇప్పటి వరకు.. గత ఆరేళ్లలో జారీ అయిన పాస్‌పోర్టులను పరిశీలిస్తున్నారు. ఒకే ఇంటి నుంచి 32 పాస్‌పోర్టులు జారీ అయినట్లు గుర్తించారు. ఆ ఇల్లు.. అప్పట్లో ఏఎస్సైగా పనిచేసిన మల్లేశ్‌కు సంబంధించిందని నిర్ధారించారు. ఆయనను సస్పెండ్‌ చేశారు. ఈ కేసులో నిందితుడిగా చేర్చి, అరెస్టు చేశారు. ఆయన తర్వాత వచ్చిన ఏఎస్సై అనిల్‌ కూడా.. ఈ వ్యవహారంలో సహకారం అందించినట్లు గుర్తించి, అరెస్టు చేశారు. ఇద్దరు మీ-సేవ నిర్వాహకులు, నలుగురు బంగ్లాదేశీయులను అరెస్టు చేసి, విచారిస్తున్నారు.

తెలంగాణలో మరో హత్య, వికారాబాద్‌లో మాజీ ఎంపీపీ భర్త వీరప్పను దారుణంగా నరికి చంపిన గుర్తు తెలియని వ్యక్తులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

ఈ గ్యాంగ్‌ సమకూర్చిన తప్పుడు చిరునామాలతో పాస్‌పోర్టులు పొంది దుబాయ్‌ వెళ్లేందుకు ప్రయత్నించిన బంగ్లాదేశీయులు నితాయ్‌ దాస్, మహ్మద్‌ రానా మయ్, మహ్మద్‌ హసిబుర్‌ రెహ్మాన్‌ గత నెలాఖరులో శంషాబాద్‌ విమానాశ్రయంలో పట్టుబడ్డారు. వారి విచారణలో వెలుగులోకి వచ్చిన వివరాలతో లోతుగా దర్యాప్తు చేసిన సైబరాబాద్‌ పోలీసులు కీలక విషయాలు సేకరించారు. బోధన్‌ కేంద్రంగా జరిగిన ఈ పాస్‌పోర్టుల కుంభకోణంలో నిందితులు కేవలం 5 ఫోన్‌ నంబర్లు, 7 చిరునామాలు వినియోగించారని గుర్తించారు. ఇలా జారీ అయిన 72 పాస్‌పోర్టుల్లో 42 వెరిఫికేషన్లను ఎస్సై మల్లేశ్, 30 వెరిఫికేషన్లను ఏఎస్సై అనిల్‌ చేశారు.

అక్రమంగా పాస్‌పోర్టులు పొందిన 72 మంది బంగ్లాదేశీయుల్లో 12 మందికి బోధన్‌కు చెందిన మీ–సేవ కేంద్రం నిర్వాహకుడు మతీన్‌ అహ్మద్‌ మీర్జా అక్రమంగా ఆధార్‌ కార్డులు జారీ చేయించగా... మిగిలిన 60 మంది పశ్చిమ బెంగాల్‌లో వాటిని పొంది, ఇతడి ద్వారా చిరునామా మార్పు చేయించుకున్నారు. ఇలా పొందిన పాస్‌పోర్టులతో 19 మంది విదేశాలకు వెళ్లిపోగా... ముగ్గురు శంషాబాద్‌ విమానాశ్రయంలో పట్టుబడ్డారు. మిగిలిన 50 మంది ఆచూకీ కోసం ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ కేసులో ఇప్పటివరకు 11 మందిని నిందితులుగా గుర్తించిన పోలీసులు... సమీర్, మనోజ్, సద్దాం హుస్సేన్‌ మినహా మిలిగిన వారిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న వారి కోసం లుక్‌ ఔట్‌ సర్క్యులర్స్‌ జారీ చేస్తున్నారు.

మెదక్ జిల్లాలో విషాదం, సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్న యువకుడు, కుల పెద్దలు గ్రామం నుంచి బహిష్కరించడంతో మనస్తాపంతో ఉరి వేసుకుని ఆత్మహత్య

నిజానికి పాస్‌పోర్టు పోలీసు వెరిఫికేషన్‌ చాలా క్లిష్టంగా ఉంటుంది. స్పెషల్‌ బ్రాంచ్‌(ఎస్బీ) అధికారులు ఇందుకోసం ప్రత్యేకంగా పనిచేస్తారు. పాస్‌పోర్టు దరఖాస్తుదారుడు పేర్కొన్న చిరునామాకు వెళ్లి వివరాలను సరిచూసుకుంటారు. నిజంగా దరఖాస్తు దారుడు ఏడాది కాలంగా అక్కడ ఉంటున్నాడా? అనే ఆధారాలను సేకరిస్తారు. ఇరుగుపొరుగును కూడా వాకబు చేస్తారు. పాస్‌పోర్టు దరఖాస్తులో పేర్కొన్న ఇద్దరు ‘రిఫరెన్స్‌’ వ్యక్తులనూ ప్రశ్నిస్తారు. వారి సంతకాలు, ఆధార్‌ నంబరు సేకరిస్తారు.

అన్నీ సవ్యంగా ఉన్నా.. సమీప పోలీస్‌స్టేషన్‌లో దరఖాస్తుదారుడిపై ఏమైనా కేసులున్నాయా? అనే విషయాన్ని పరిశీలిస్తారు. ఆ తర్వాత తమ నివేదికను సంబంధిత అధికారి కార్యాలయానికి(జిల్లాల్లో అడ్మిన్‌ ఎస్పీలు/అదనపు ఎస్పీలు, కమిషనరేట్లలో జాయింట్‌ కమిషనర్లు) పంపిస్తారు. అక్కడ కూడా వివరాలను సరిచూసుకున్నాక.. పాస్‌పోర్టు ఇవ్వొచ్చా? లేదా? అనే విషయాన్ని ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయానికి ఆన్‌లైన్‌ పోర్టల్‌ ద్వారా తెలియజేస్తారు.

ఈ స్కాం నేపథ్యంలో పాస్‌పోర్ట్ స్కాంపై ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేయాలని సైబరాబాద్ సీపీ నిర్ణయించారు. ఆధార్ కార్డు పొందడంలో ఉన్న లూపోల్స్‌పై అధికారులకు సీపీ లేఖ రాయనున్నారు. ఓకే అడ్రస్‌పై 32 పాస్ పోర్టులు జారీ అయితే ఎవ్వరూ గుర్తించకపోవడం నిఘా సంస్థల వైఫల్యం‌గా తెలుస్తోంది. దేశ భద్రతకు సంబంధించిన అంశం కావడంతో ఈ వ్యహారాన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు.