Hyderabad Rave Party: ఫుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌ కేసులో విస్తు గొలిపే విషయాలు, 148 మందిలో అందరూ వీఐపీల బిడ్డలే, ఎఫ్‌ఐఆర్‌లో నలుగురు నిందితుల పేర్లు, రాడిసన్‌ బ్లూ హోటల్‌‌లో అసలేం జరిగింది
Hyderabad Rave Party (Photo Credits: ANI)

Hyd, April 4: భాగ్య నగరంలో పబ్‌ సంస్కృతి మితిమీరిపోతోంది. తాజాగా రాడిసన్‌ బ్లూ హోటల్‌ ఉదంతం (Hyderabad Drugs Bust) వెలుగులోకి రావడంతో ఈ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్‌లోని బంజా రాహిల్స్‌ రోడ్‌ నం.6లో ఉన్న ర్యాడిసన్‌ బ్లూప్లాజా హోటల్‌కు చెందిన ఫుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌లో ఆదివారం తెల్లవారుజామున నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడి చేశారు. పెద్ద మొత్తంలో డ్రగ్స్‌ను (Hyderabad Police seize five sachets of ‘cocaine’) స్వాధీనం చేసుకుని.. పబ్‌ సిబ్బంది సహా 148 మందిని (148 persons detained) బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఇందులో 90 మంది యువకులు, 38 మంది యువతులు, 18 మంది స్టాఫ్, ఇద్దరు నిర్వాహకులు ఉన్నారు.

వీరిలో తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్‌ కుమారుడు గల్లా సిద్ధార్థ్, సినీనటుడు నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల, బిగ్‌బాస్‌ విజేత, గాయకుడు రాహుల్‌ సిప్లిగంజ్‌ తదితరులు ఉన్నారు. పబ్బులో డ్రగ్స్‌ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌.. బంజారాహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ పూసపాటి శివచంద్రను సస్పెండ్‌ చేశారు, ఆ ఏరియా ఏసీపీ మంత్రి సుదర్శన్‌కు చార్జ్‌మెమో జారీ చేశారు.

నా బిడ్డ బంగారం, ఆమె ఏ తప్పు చేయలేదనే పోలీసులు వదిలేశారు, నిహారికపై వస్తున్న వదంతులపై నాగబాబు క్లారిటీ, వీడియో రిలీజ్ చేసిన మెగా బ్రదర్

ర్యాడిసన్‌ బ్లూప్లాజా స్టార్‌ హోటల్‌ కావడంతో దానిలోని బార్‌ అండ్‌ రెస్టారెంట్‌కు 24 గంటలూ మద్యం సరఫరా చేసే అనుమతి ఉంది. ఈ మేరకు జిల్లా ఎక్సైజ్‌ అధికారులు గత నెల 16న కాసిబట్ట అశోక్‌ పేరుతో రెన్యువల్‌ అనుమతి పత్రం జారీ చేశారు. ఇక్కడ ఏ సమయంలోనైనా మద్యం లభిస్తుంటుంది. ఈ క్రమంలోనే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌తోపాటు ఇతర ప్రాంతాలకు చెందిన వీఐపీలు, ప్రముఖులు, వారి సంతానం ఈ హోటల్‌కు క్యూ కడుతుంటారు. ఈ అనుమతిని అడ్డం పెట్టుకున్న హోటల్‌ నిర్వాహకులు.. అందులోని పబ్‌ను సైతం ఇష్టానుసారం నడిపిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.

పోలీసు, ఎక్సైజ్‌ అధికారులెవరైనా తనిఖీలకు వస్తే.. తమకు 24 గంటలు లిక్కర్‌ సరఫరా చేసే అనుమతి ఉందంటూ చూపిస్తున్నారు. దాదాపు నాలుగేళ్లుగా ఈ పబ్‌లో ఈ దందా నడుస్తోంది. మెంబర్‌షిప్‌ ద్వారా వచ్చే యాక్సెస్‌ కార్డుతో మాత్రమే పబ్‌లోకి ప్రవేశించేందుకు అనుమతి ఇస్తుంటారు. దీనిని తమకు అనువుగా మార్చుకున్న కొందరు పెద్దలు, వారి పిల్లలు ఫుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌ను వారాంతాల్లో రేవ్‌ పార్టీలకు అడ్డాగా వాడుకుంటున్నారు.

Hyderabad: మాజీ ఎంపీ రేణుకా చౌదరికి చెందిన పబ్‌లో రేవ్ పార్టీ, పట్టుబడ్డ బిగ్‌బాస్ విజేత రాహుల్ సిప్లిగంజ్, ప్రముఖ నటుడి కుమార్తె, పలువురు సెలబ్రెటీలు, భారీగా కొకైన్, గంజాయి, డ్రగ్స్ స్వాధీనం

ఈ పబ్‌లో శనివారం అర్ధరాత్రి రేవ్‌ పార్టీ నిర్వహిస్తున్నట్టు రెండు, మూడు రోజుల ముందే ‘వీఐపీ సర్కిల్‌’కు సమాచారం వెళ్లింది. పబ్‌కు సంబంధించిన ప్రత్యేక యాప్‌ ద్వారా, ఎంపిక చేసుకున్న వాట్సాప్‌ గ్రూపుల ద్వారా.. ఓ బర్త్‌డే పార్టీ పేరిట ‘డ్రగ్‌ ఈవెంట్‌’ నిర్వాహకులు ‘కస్టమర్ల’కు ఆహ్వానం పంపారు, వారికి ప్రత్యేకంగా కోడ్‌వర్డ్స్‌ ఇచ్చారు. ఆ కోడ్‌ చెప్పినవారిని మాదకద్రవ్యాలతో వచ్చినా తనిఖీలు లేకుండా లోనికి పంపేలా ఏర్పాటు చేసుకున్నారు. ఇలా ఎల్‌ఎస్‌డీ, కొకైన్, గంజాయి పెద్ద ఎత్తున పబ్‌లోకి చేరింది. రాత్రి 9 గంటలకు మొదలైన హడావుడి అర్ధరాత్రి 12 గంటలకు జోరందుకుంది.

అప్పటికే హోటల్‌లో బసచేసిన కొందరు బడాబాబులు పబ్‌లోకి చేరుకున్నారు. ఈ వ్యవహారంపై సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు.. శనివారం సాయంత్రం నుంచే నిఘా పెట్టారు. రేవ్‌ పార్టీ సమాచారాన్ని ధ్రువీకరించుకున్నారు. నార్త్, సెంట్రల్, వెస్ట్‌జోన్‌లకు చెందిన టాస్క్‌ఫోర్స్‌ బృందాలు.. దాదాపు 40 మంది సివిల్‌ పోలీసులతో కలిసి ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో పబ్‌పై దాడి చేశాయి.

పబ్‌లో పోలీసులు ప్రవేశించగానే.. నిర్వాహకులు, డ్రగ్స్‌ వాడుతున్నవారు అవాక్కయ్యారు. తమ వద్ద ఉన్న డ్రగ్స్‌ను పూలకుండీల్లో, స్ట్రాలు ఉంచే డబ్బాల్లో దాచేశారు. కొందరు బాత్రూమ్‌ల్లో పడేశారు. కిటికీల్లోంచి కొకైన్‌ షాట్స్, ఎల్‌ఎస్‌డీ బోల్ట్స్‌ను బయటికి విసిరేశారు. పోలీసులు ఆ మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. గల్లా సిద్ధార్థ్, రాహుల్‌ సిప్లిగంజ్, నిహారిక కొణిదెల సహా మొత్తం 148 మందిని బంజారాహిల్స్‌ పోలీసుస్టేషన్‌కు తరలించారు. పబ్‌ లీజుకు తీసుకొని నడిపిస్తున్న అభిషేక్‌ ఉప్పాల (39)తోపాటు మేనేజర్‌ మాదారం అనిల్‌కుమార్‌ (35)ను అరెస్టు చేశారు.

య్యూట్యూబ్‌లో చూస్తూ డ్రగ్స్ తయారీ, తెలివిమీరిన నేరస్తుడు, ఆటకట్టించిన గుజరాత్ పోలీసులు

ఈ పార్టీ నిర్వాహకుడిగా అనుమానిస్తున్న అర్జున్‌ వీరమాచినేని కోసం గాలిస్తున్నారు. ఈవెంట్‌ మేనేజర్‌గా ఉన్న కునాల్, డీజే శశిధర్‌రావులు రేవ్‌పార్టీ వ్యవహారంలో కీలకపాత్ర పోషించినట్టు ఆరోపణలు ఉన్నాయి. పార్టీలో పాల్గొన్నవారి నుంచి వివరాలు సేకరించిన పోలీసులు.. సొంత పూచీకత్తు ఆదివారం ఉదయం విడుదల చేశారు. కాగా.. దాడి సందర్భంగా క్లూస్‌టీమ్‌లు పబ్‌లోపల, చుట్టుపక్కల ప్రాంతాల్లో శాంపిల్స్‌ సేకరించాయి. వాటిని ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌కు పంపి విశ్లేషించనున్నారు.

ఫుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌ బంజారాహిల్స్‌ పోలీసుస్టేషన్‌కు కూతవేటు దూరంలోనే ఉంది. ఇంత జరుగుతున్నా స్థానిక పోలీసులు కనిపెట్టలేకపోయారా? లేక సహకరించారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఉన్నతాధికారులు పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు. మరోవైపు తక్షణ చర్య కింద బంజారాహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ పూసపాటి శివచంద్రను సస్పెండ్‌ చేస్తూ పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ఆదేశాలు జారీ చేశారు. ఆ బాధ్యతలను నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.నాగేశ్వర్‌రావుకు అప్పగించారు. పర్యవేక్షణ విధుల్లో నిర్లక్ష్యం వహించారంటూ బంజారాహిల్స్‌ డివిజన్‌ ఏసీపీ మంత్రి సుదర్శన్‌కు చార్జ్‌మెమో జారీ చేశారు.

డ్రగ్స్ కొనుగోలు చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన ప్రముఖ టీవీ నటి, ప్రీతికా చౌహాన్,‌ ఫైజల్‌ని అరెస్ట్ చేసిన ఎన్‌సీబీ అధికారులు

పబ్‌లో నిర్వాహకులు సహా మొత్తం 148 మంది పోలీసులకు చిక్కారు. పబ్‌ లోపల, బయట ప్రాంగణంలో తప్ప ఎవరి వద్దా నేరుగా డ్రగ్స్‌ లభించలేదు. సాధారణంగా మాదకద్రవ్యాల కేసులను ఎన్డీపీఎస్‌ యాక్ట్‌ కింద నమోదు చేస్తారు. దాని ప్రకారం డ్రగ్స్‌ కలిగి ఉన్న వారిని మాత్రమే అప్పటికప్పుడు అరెస్టు చేయవచ్చు. పబ్‌లో డ్రగ్స్‌ దొరికినా వాటిని ఎవరు వాడారన్నది ఇప్పుడే తేల్చలేని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పబ్‌లో పట్టుబడినవారి నుంచి రక్తం, వెంట్రుకలు, ఇతర నమూనాలు సేకరించి ఫోరెన్సిక్‌ పరీక్షలు చేయించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి కోర్టు అనుమతి అవసరంకావడంతో న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేయనున్నారు. డ్రగ్స్‌ వినియోగించినవారి తల వెంట్రుకల్లో దాదాపు ఆరు నెలల పాటు ఆనవాళ్లు ఉంటాయని పోలీసులు చెప్తున్నారు.

ఢిల్లీ బీజేపీ- సిల్లీ బీజేపీ రైతుల్ని ఆగం చేస్తున్నాయ్, ధాన్యం కొనేవరకు కేంద్రాన్ని వదిలేది లేదని మంత్రి కేటీఆర్ ప్రకటన, వరుస నిరసనలపై కార్యాచరణ ప్రకటించిన కేటీఆర్

ఫుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌లో డ్రగ్స్, రేవ్‌ పార్టీలు చాలాకాలంగా సాగుతున్నట్టు హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు సమాచారం అందింది. దీనితో నిఘా పెట్టారు. ఈ పబ్‌ సభ్యత్వం కోసం ఏడాదికి రూ.5 లక్షల వరకు వసూలు చేస్తున్నట్టు సమాచారం. ప్రత్యేకంగా పామ్‌ (ఫుడింగ్‌ అండ్‌ మింక్‌) పేరుతో ఓ యాప్‌ నిర్వహిస్తున్నారు. పార్టీలకు రావాలని భావించే వారంతా దాన్ని డౌన్‌లోడ్‌ చేసుకుని, రిజిస్టర్‌ చేసుకోవాలి. పబ్‌లోకి ప్రవేశించే సమయంలో దానికి సంబంధించిన ఓటీపీని చెప్పాల్సి ఉంటుంది. పబ్‌ వ్యవహారం ఇంత పకడ్బందీగా సాగుతుండటంపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు అనుమానం వచ్చింది.

దీనిని ఛేదించడానికి పది రోజుల కింద పక్కాగా డెకాయ్‌ ఆపరేషన్‌ చేపట్టారు. కొందరు పోలీసులు కస్టమర్లుగా రిజిస్టర్‌ చేసుకున్నారు. శనివారం రాత్రి యాప్, ఓటీపీల తతంగం పూర్తి చేసుకుని పబ్‌లోకి వెళ్లారు. అర్థరాత్రి సమయంలో డ్రగ్స్‌ వినియోగం మొదలవడాన్ని గమనించి అధికారులకు సమాచారమిచ్చారు. అప్పటికే కాపుకాసిన ప్రత్యేక బృందాలు పబ్‌పై దాడి చేసి.. రేవ్‌ పార్టీ గుట్టురట్టుచేశారు.

తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన పుడింగ్ ఇన్ మింగ్ పబ్ కేసు ఎఫ్‌ఐఆర్‌లో నలుగురు నిందితుల పేర్లను బంజారాహిల్స్ పోలీసులు చేర్చారు. ఈ కేసులో నిందితులుగా అనిల్, అభిషేక్, కిరణ్ రాజ్, అర్జున్ పేర్లు నమోదయ్యాయి. అయితే ప్రస్తుతం అర్జున్ విరమచినేని, కిరణ్ రాజ్ పరారీలో ఉన్నారు. వీరిద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో అనిల్, అభిషేక్ అరెస్ట్ అయ్యారు.

పబ్‌లో అదుపులోకి తీసుకున్న వారందరూ డ్రగ్స్‌ వినియోగించలేదని, వారిలో కొందరు మాత్రమే డ్రగ్స్‌ తీసుకున్నారని డీసీపీ జోయల్‌ డేవిస్‌ అన్నారు. వారిని గుర్తించి అరెస్ట్‌ చేస్తామన్నారు. దర్యాప్తులో అనుమానం ఉన్నవారి నమూనాలు సేకరిస్తామని, వారు డ్రగ్స్‌ వినియోగించినట్లు తేలితే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలించి నిజాలను వెలుగులోకి తెస్తామన్నారు. పబ్‌ యజమానులు అర్జున్‌ వీరమాచినేని, అభిషేక్‌ ఉప్పల, జనరల్‌ మేనేజర్‌ అనిల్‌లపై కేసులు నమోదు చేశామని డీసీసీ తెలిపారు. పలు చేతులు మారిన పబ్‌ నిర్వహణను గత ఏడాది ఆగస్టు నుంచి అర్జున్‌, అభిషేక్‌లు చూసుకుంటున్నారని పేర్కొన్నారు

రాడిసన్‌ బ్లూప్లాజా హోటల్‌లోని పుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌ యాజమాన్యం మత్తు పదార్థాలను సరఫరా చేస్తున్నట్టు ఆధారాలు లభిస్తే పబ్‌ లైసెన్స్‌ రద్దు అవుతుందని ఎక్సైజ్‌శాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు పూర్తయిన అనంతరం వివరాలు సేకరిస్తామని తెలిపారు.