COVID 19 in Telangana. | Photo Credits: IANS)

Hyderabad, May 24: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న వారిలో చాలా మందికి కరోనా పాజిటివ్ సోకినట్లు నిర్ధారణ అవుతోంది. ఇటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రతిరోజు నమోదవుతున్న కేసులను పరిశీలిస్తే నగరంలో కరోనా తీవ్రత ఇంకా అదుపులోకి రానట్లు స్పష్టమవుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 52 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం COVID-19 కేసుల సంఖ్య 1813 కు చేరింది. నిన్న నమోదైన మొత్తం కేసుల్లో అత్యధికంగా 33 కేసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోవే కాగా, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిలో మరో 19 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇప్పటివరకు వలస వచ్చిన వారిలో 137 మందికి కరోనా సోకినట్లు నిర్ధారింపబడింది.

మరోవైపు, రాష్ట్రంలో గత ఐదు రోజులుగా వరుసగా కోవిడ్ మరణాలు నమోదవడం కొంత ఆందోళన కలిగిస్తుంది. శనివారం మరొకరు కోవిడ్ కారణంగా చనిపోయారు. దీంతో రాష్ట్రంలో కోవిడ్ మరణాల సంఖ్య 49కి పెరిగింది.

గత 24 గంటల్లో మరో 25 మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 1068 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 696 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో పేర్కొంది.

Telangana's #COVID19  Report:

 

Status of positive cases of #COVID19 in Telangana

ఇక పరిస్థితులు ఇప్పుడు ఇలా ఉంటే, రానున్నది వర్షాకాలం కాబట్టి అప్పుడు కరోనాకు తోడుగా సీజనల్ వ్యాధులను ఎలా నియంత్రించాలనే దానిపై అధికారులు సన్నద్ధమవుతున్నారు. 'పల్లె ప్రగతి' మరియు 'పట్టణ ప్రగతి' లాంటి కార్యక్రమాలను ఇకపై కూడా కొనసాగిస్తూ ప్రభుత్వ అధికారులను అందులో భాగస్వామ్యం చేయాలని ఇప్పటికే సంబంధిత మంత్రిత్వ శాఖల నుండి ఆదేశాలు జారీ అవుతున్నాయి. పల్లెల్లో మరియు పట్టణాల్లో పారిశుధ్య పనులు ఎక్కడికక్కడ, ఎప్పటికప్పుడు జరిగేలా అధికారులు, స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులను అప్ర‌మ‌త్తం చేస్తున్నారు.

డ్రైనేజీల్లో, రోడ్ల పక్కన నీరు నిల్వ ఉండే చోట్ల‌ను గుర్తించి, తొల‌గించడం. వ‌ర్ష‌పునీరు లోత‌ట్టు ప్రాంతాల్లోకి వెళ్లేలా ఇప్పుడే ఏర్పాట్లు చేయాల‌న్నారు. ఇంటింటికీ ఇంకుడు గుంత‌లు పెట్టడం లాంటి చర్యలు తీసుకోవడంతో పాటుగా గ్రామాల్లో క్లోరిన్ అవ‌శేషాల‌ను చెక్ చేస్తూ, స్వ‌చ్ఛ‌మైన మంచినీటిని అందించడం, ప్ర‌తి శుక్ర‌వారాన్ని డ్రై డే గా పాటిస్తూ, ఆరోజు ప్ర‌తి ఇంటిలో పారిశుద్ధ్య కార్య‌క్ర‌మం నిర్వ‌హించడం . దోమ‌లు అధికంగా ఉండే ప్రాంతాల్లో శిబిరాలు పెట్ట‌డం, ఫాగింగ్ చేయ‌డం, మ‌లేరియా బాల్స్ స్ప్రే చేయ‌డం, కరోనా కట్టడి కోసం జ‌నసాంద్రత ఎక్కువగా ప్రాంతాల్లో సోడియం హైపో క్లోరైడ్ స్ప్రే వంటి చ‌ర్య‌లు తీసుకోవడం లాంటి కార్యక్రమాలను రూపొందిస్తున్నారు.