Andhra pradesh AP Capital Expert Committee Press Meet on capital (Photo-Twitter)

Amaravathi, December 22: అసెంబ్లీలో సీఎం వైయస్ జగన్ (CM YS Jagan) మూడు రాజధానులు (3 Capitals) అంశం తెరపైకి తెచ్చినప్పటి నుంచి ఏపీలో రాజకీయ సమీకరణాలు( AP POlitics) పూర్తిగా మారిపోయాయి. ప్రతిపక్ష పార్టీలోని కొందరు నేతలు దీన్ని సమర్ధిస్తున్నారు. అలాగే కొన్ని జిల్లాలు ప్రజలు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. అమరావతి పరిసర ప్రాంతాల ప్రజలు ఈ నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు.

రాజధానిపై జీఎన్ రావు కమిటీ (GN Rao Committee)తన రిపోర్టును ఏపీ సీఏం వైయస్ జగన్ కి ఇప్పటికే అందించింది. కమిటీ నివేదిక తర్వాత అమరావతితో పాటు విశాఖ, కర్నూలు వంటి ప్రాంతాలు రాజధాని రేసులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో  డిసెంబర్ 27న ఏపీ కేబినెట్ భేటీ ( AP Cabinet Meeting)కానుంది. ఈ సమావేశంలో రాజధానిపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే దాని కంటే ముందుగా నేతలు ఎవరికి వారు తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. రాజధానిపై ఎవరెవరు ఏం మాట్లాడారో ఓ సారి పరిశీలిస్తే..

ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉండబోతోంది ?, ఏపీ క్యాబినెట్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతోంది ?,ఇప్పటి వరకు నాయకులు ఏమన్నారో వారి మాటల్లో...

హోమంత్రి సుచరిత

ఏపీకి మూడు రాజధానులు నిర్ణయాన్ని ప్రజలు అంగీకరించాల్సిందేనని హోమంత్రి సుచరిత అన్నారు. కీలక మార్పులు జరిగినప్పుడు కొంతమంది కష్టపడాల్సి వస్తుందనీ..కొన్ని నష్టాలు జరిగినా తప్పదనీ..మూడు రాజధానుల విషయంలో ప్రజలు ఇప్పుడు ఇబ్బందులు పడినా..నష్టపోయినా ఒప్పుకోక తప్పదని అన్నారు.

రాష్ట్రం విడిపోయినప్పుడు హైదరాబాద్ నుంచి కాళీ చేతులతో వచ్చామనీ..కానీ భవిష్యత్తులో ఇటువంటి ఇబ్బందులు..కష్టాలు రాకుండా ఉండాలంటే అభివృద్ది వికేంద్రీకరణ తప్పదని మంత్రి సుచరిత అన్నారు.

అమరావతిలోనే అసెంబ్లీ..రాజభవన్, విశాఖలో సచివాలయం,సీఎంఓ,వేసవి అసెంబ్లీ,హైకోర్టు బెంచ్, కర్నూలులో హైకోర్టు, సంచలన విషయాలను బయటపెట్టిన జీఎన్ రావు కమిటీ

స్పీకర్ తమ్మినేని సీతారాం

ఏపీ రాజధాని అమరావతిపై తీవ్ర అనిశ్చితి నెలకొన్న తరుణంలో స్పీకర్ తమ్మినేని సీతారాం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజధానికి వెళ్లడం అంటే రాజస్థాన్ ఎడారిలోకి వెళుతున్న ఫీలింగ్ కలుగుతుందని అన్నారు. ఈ విషయాన్ని మిగిలిన వాళ్లు బహిరంగంగా చెప్పలేకపోయారని, తాను చెప్పగలిగానని తెలిపారు. రాజధాని నాది అని రాష్ట్ర ప్రజలంతా భావించాలి, అమరావతిలో నాకు ఇది కనిపించలేదు అని తమ్మినేని అభిప్రాయపడ్డారు. మూడు రాజధానుల ప్రతిపాదనను రాష్ట్ర ప్రజలంతా స్వాగతిస్తున్నారని తెలిపారు. దీనిపై విమర్శలు చేసేవారు ముందుగా వాస్తవాలను తెలుసుకోవాలని హితవు పలికారు.

ఏపీ రాజధాని ఇక్కడే, సిఫార్సులు చేసిన జీఎన్ రావు కమిటీ, సీఎం జగన్‌కు నివేదిక అందజేసిన తరువాత ప్రెస్ మీట్, రాష్ట్రాన్ని 4 రీజియన్‌లుగా విభజించాలని సూచన

వైసీపీ నేత సి.రామచంద్రయ్య

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కల్యాణ్ పై వైసీపీ నేత సి.రామచంద్రయ్య ఆరోపణలు, విమర్శలు గుప్పించారు. రాజధాని పేరుతో చంద్రబాబు నాడు ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారని ఆరోపించారు. జీఎన్ రావు నిపుణుల కమిటీ నివేదిక రాష్ట్ర సమగ్రాభివృద్ధికి తోడ్పడుతుందని, ఈ నివేదికపై లేనిపోని రాద్ధాంతాం చేయడం తగదని సూచించారు.

పదమూడు జిల్లాలు ఉన్న చిన్న రాష్ట్రానికి మూడు రాజధానులు అవసరమా అని ప్రశ్నిస్తున్న మేధావులకు ఓ ప్రశ్న వేస్తున్నా.. ప్రపంచంలోని గొప్ప రాజధానుల్లా అమరావతిని నిర్మిస్తానని నాడు చంద్రబాబు చెప్పారని, మరి, ఈ చిన్న రాష్ట్రానికి అలాంటి రాజధాని అవసరమా అని ప్రశ్నించారు. అమరావతి ప్రాంత రైతులను చంద్రబాబు రెచ్చగొడుతున్నారని, ఈ ఆందోళనలను రాష్ట్ర వ్యాప్తంగా చేసేలా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. రాజధానికి భూములిచ్చిన రైతులెవ్వరూ భయపడాల్సిన అవసరం లేదని, సీఎం జగన్ కచ్చితంగా న్యాయం చేస్తారని చెప్పారు.

రాజధాని వికేంద్రీకరణను సమర్ధిస్తూ రావులపాలెంలో భారీ ర్యాలీ

ఏపీ రాజధాని వికేంద్రీకరణను సమర్ధిస్తూ తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో భారీ ర్యాలీ నిర్వహించారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ, రాజధాని వికేంద్రీకరణ జరిగితే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని, ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా తిప్పికొడతామని హెచ్చరించారు.

టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు

రాజధాని మార్పును వ్యతిరేకిస్తూ అమరావతితో రైతులు నిర్వహిస్తున్న నిరసన ప్రదర్శనల్లో టీడీపీ నేతలు ప్రత్తిపాటి పుల్లారావు, కొల్లు రవీంద్ర కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ, రైతులకు మద్దతుగా టీడీపీ ఉందని, రైతుల కోసం తాము ఆమరణ నిరాహార దీక్షలు చేపడతామని, రైతులతోపాటే జైలుకు వెళతామని అన్నారు. త్యాగాలు చేసిన వాళ్లు ఎప్పుడూ మోసపోరని, రాజధాని రైతులను ఎవ్వరూ మోసం చేయలేరని వ్యాఖ్యానించారు. అమరావతిని తరలించడం ఎవరికీ సాధ్యంకాదని స్పష్టం చేశారు.

టీడీపీ నేత కొల్లు రవీంద్ర

33 వేల ఎకరాలు ఇచ్చి త్యాగం చేసిన మనసు రైతులదని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఏపీ రాజధాని విషయాన్ని రాష్ట్ర మంత్రులు అవహేళన చేశారని ఆయన విమర్శించారు. ఏదో ఒక వంకతో అమరావతి నుంచి రాజధానిని తరలించాలన్నదే జగన్ ఉద్దేశమని కొల్లు రవీంద్ర ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ కి మూడు రాజధానుల వల్ల పరిపాలన చాలా కష్టమవుతోందని అన్నారు. ఒకవేళ రాయలసీమ ప్రజలు సచివాలయానికి వెళ్లాలంటే వందల కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. జీఎన్ రావు కమిటీ అంటే జగన్ కమిటీయేనని ఆరోపించారు.

బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు

నాడు చంద్రబాబు సర్కారు, నేడు జగన్ సర్కారూ రెండూ ఒక్కలాంటివేనని, ఇద్దరి పాలనా 'దొందూ దొందే' అన్నట్లు సాగుతోందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మండి పడ్డారు. రాజధాని విషయంలో చంద్రబాబు తెలివైన రాజకీయం ప్రదర్శిస్తుంటే, ఆయన ట్రాప్ లో జగన్ పడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు పదేపదే హైదరాబాద్ లాంటి అభివృద్ధి అని ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. నవ్యాంధ్రకు జరిగిన నష్టం హైదరాబాద్ వల్లే కదా అని ఆయన అన్నారు. దాదాపు 900 కిలోమీటర్ల పొడవైన తీరప్రాంతం ఉన్న నవ్యాంధ్రలో చంద్రబాబు తన పాలనలో ఒక్క పోర్టు అయినా నిర్మించారా? అని సోము వీర్రాజు ప్రశ్నించారు. ఈ మాట అంటున్నానంటే నేనేదో వైఎస్సార్‌ను పొగుడుతున్నానని కాదని గుర్తుంచుకోవాలని కోరారు.

నేత కార్మికులకు ఏడాదికి రూ. 24 వేలు, పథకాన్ని ధర్మవరంలో ప్రారంభించిన ఏపీ సీఎం జగన్

వైసీపీ నేత విజయసాయి రెడ్డి

అమరావతిలో రాజధాని నిర్మాణాన్ని ఎంత సాగదీస్తే భూముల విలువలు అంత పెరుగుతాయనేది చంద్రబాబు నాయుడి స్కెచ్ అని విజయసాయి రెడ్డి ఆరోపించారు. అందుకే ఐదేళ్లలో నాలుగు తాత్కాలిక భవనాలు మినహా గ్రాఫిక్స్ తోనే కాలం వెళ్లబుచ్చాడని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ప్రపంచస్థాయి రాజధానిని తరలిస్తే ఎలా? అని పెడబొబ్బలు పెడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు.ఆంధ్రప్రదేశ్ లో 25 జిల్లాలు ఏర్పాటు చేయాలనే ఆలోచనలో సీఎం జగన్ ఉన్నారని, రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంటోందని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కేశినేని నాని

జగన్ గారూ మీరు కోరుకుంటున్నట్లు రాష్ట్రమంతా అభివృద్ధి జరగాలంటే కొత్తగా ఏర్పడే 25 జిల్లాల్లో జిల్లాకి ఒక్కటి చొప్పున 25 రాజధానులు పెడితే బాగుంటుందేమో ఆలోచించండి' అంటూ ఎద్దేవా చేస్తూ కేశినేని నాని ట్వీట్ చేశారు.

రాజధానిలో కొనసాగుతున్న నిరసనలు-144 సెక్షన్ అమలు

ఏపీకి మూడు రాజధానులు అంటూ జరుగుతున్న ప్రచారంతో అమరావతి రైతులు భగ్గుమంటున్నారు. గత రెండ్రోజులుగా అమరావతిలో రైతులు నిరసన ప్రదర్శనలు చేపడుతుండడంతో ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో రాజధాని ప్రాంతంలో 144 సెక్షన్ విధించడంతోపాటు 30 పోలీస్ యాక్ట్ కూడా అమలు చేస్తున్నారు. అంతేకాదు, ఆందోళన చేస్తున్న రైతులపై కేసులు నమోదు చేశారు. ఇవాళ రాజధాని ప్రాంతంలోని పంచాయతీ కార్యాలయానికి నల్లరంగు వేసిన వ్యక్తులపైనా కేసులు నమోదు చేశారు.

ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ

రాజధానిపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం మూడు రాజధానులు చేపడితే కేంద్రం నిధులు ఇవ్వదని కుండబద్ధలు కొట్టారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానిపై నిర్ణయాలు మార్చుకుంటే..కేంద్రం నిధులివ్వాలా అంటూ ప్రశ్నించారు.సీఎం జగన్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే.కేంద్రం ఎలా సపోర్టు చేస్తుందన్నారు. గత ప్రభుత్వానికి ఇచ్చిన రూ. 2 వేల 500 కోట్లకు లెక్కలు చెప్పలేదని గుర్తు చేశారు.