Amaravathi, December 29: ఏపీలో (AP) మూడు రాజధానుల అంశంపై ( 3 Capital Issue) ప్రభుత్వం మరో ముందడుగు వేసింది.మొత్తం 16 మంది సభ్యులతో రాజధానిపై హైపవర్ కమిటీని (High Power Committee) ఏర్పాటు చేసింది. పేర్నినాని, మోపిదేవి వెంకట రమణ, మేకపాటి సుచరిత, బొత్స, ఆదిమూలపు సురేష్, కన్నబాబు, డీజీజీ గౌతమ్ సవాంగ్,బుగ్గన, పేర్ని నాని, కొడాలినాని, అజయ్ కల్లం, గౌతమ్ రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్ ఉన్నారు.
మూడువారాల్లో నివేదిక ఇవ్వాలని ఈ కమిటీకి ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేసింది. ఆర్థిక మంత్రి బుగ్గన (Buggana) నేతృత్వంలో ఈ కమిటీ పనిచేయనుంది. ఈ నేపథ్యంలో జనవరి చివరి వరకు ఏపీకి రాజధాని ఏంటన్న దానిపై స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి.జీఎన్‌రావు కమిటీతో (G N Rao Committee) పాటు బోస్టన్ కమిటీ (BCG reports) అధ్యయనాలపై ఈ హైవపర్ కమిటీ విచారించనుంది. కమిటీ కన్వీనర్‌గా ఏపీ సీఎస్ నీలం సహానిని నియమించారు.
ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని రగడ హైకోర్టుకు చేరిన వ్యవహారం
ఇన్ సైడర్ ట్రేడింగ్
అమరావతి పేరుతో భారీ స్కామ్ జరిగిందని.. రాజధాని ప్రకటనకు ముందే వేల ఎకరాలు చేతులు మారాయని వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం (YSRCP Govt) ఆరోపిప్తోంది. ఇన్‌సైడర్ ట్రేడింగ్ ద్వారా రాజధానిలో 4,070 ఎకరాలు చేతులు మారినట్లు గుర్తించామని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. అమరావతిలో జరిగిన అవినీతిని హైపవర్ కమిటీ వెలికితీస్తుందని అంటున్నారు. ఏపీకి బహూశా 3 రాజధానులు వస్తాయోమో, ఏపీ సీఎం జగన్ మాటల్లో..
ఈ నేపథ్యంలో కమిటీ నివేదికకు ప్రాధాన్యత సంతరించుకుంది. అమరావతిలో 4,500 ఎకరాల్లో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని మంత్రి మోపిదేవి వెంకట రమణ ఆరోపించారు. అమరావతి పేరిట జరిగిన అక్రమాలు హైపవర్ కమిటీ నివేదిక ద్వారా బయటకు వస్తాయని మంత్రి మోపిదేవి చెప్పారు. ఇక్కడకు రావాల్సిన పెట్టుబడులు తెలంగాణకు (Telangana) వెళ్లాయన్నది అవాస్తవమని తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనేక సంస్థలు ముందుకొస్తున్నాయని చెప్పారు. అమరావతిలో అన్నీ అక్రమాలే జరిగాయన్న ఆర్థికమంత్రి బుగ్గన
మీడియా ముందుకు వచ్చిన మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే
రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులకు మాజీ సీఎం చంద్రబాబునాయుడు ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) విమర్శించారు. ఈరోజు మీడియాతో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు తన హయాంలో దోపిడీయే లక్ష్యంగా పని చేశారని, అన్నివిధాలుగా రాజధాని రైతులను చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు. అలాంటి చంద్రబాబు ఈరోజున రైతుల గురించి మాట్లాడటం దారుణమని విమర్శించారు.
జీఎన్ రావు కమిటీ నివేదిక, రాజధానిపై సీఎం ఆలోచన గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదని, కుటిల రాజకీయాలు చేసి రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. రాజధాని రైతులకు చంద్రబాబు చేయని పనులు సీఎం జగన్ చేస్తున్నారని, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా రాజధాని రైతులకు ప్రభుత్వం కౌలు డబ్బు ఇస్తోందని, రైతు కూలీలకు ప్రతినెలా పెన్షన్ ఇస్తున్నామని చెప్పారు.
బీజేపీ నేత సుజనా చౌదరి
అమరావతిలో తాను ఎక్కడా గజం స్థలం కూడా కొనలేదని బీజేపీ నేత సుజనా చౌదరి స్పష్టం చేశారు. తుళ్లూరులో దీక్ష చేస్తోన్న రాజధాని రైతులకు ఆయన ఈ రోజు సంఘీ భావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... విశాఖ ప్రజలు ఇప్పటికే భయభ్రాంతులు చెందుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఏడాదిలో 10 రోజుల పాటు విశాఖలో అసెంబ్లీ సమావేశాలు ఎందుకని ఆయన ప్రశ్నించారు. పోరాటం చేస్తున్న వారిని అరెస్టు చేయడం అనైతిక చర్య అని సుజనా చౌదరి విమర్శించారు. రాష్ట్ర ప్రజలందరి రాజధాని అమరావతి అని ఆయన అన్నారు.
రాళ్లు పడిన చోటే పూల వర్షం, విశాఖలో ఏపీ సీఎం వైయస్ జగన్‌కి ఘన స్వాగతం
ఇక నుంచి సేవ్ ఆంధ్రప్రదేశ్ అని నినాదాలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో పొరపాట్లు జరగడం సహజమని, ఏదో పొరపాటు వల్లే జగన్ ముఖ్యమంత్రి అయ్యారని ఆయన వ్యాఖ్యానించారు. సీఆర్డీఏలో అమరావతి ప్రజలు సంతకాలు పెట్టారని, పరిహారం పొందే హక్కు అమరావతి రైతులకు ఉందని చెప్పారు. సుమారు లక్ష కోట్ల రూపాయలు అడిగే హక్కు రైతులకు ఉందని ఆయన చెప్పారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే భావితరాలు నష్టపోతాయని సుజనా చౌదరి అన్నారు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పీవీ సిద్దారెడ్డి
ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానులు ఏర్పాటు అయితే, అన్ని ప్రాంతాలూ అభివృద్ధి పథంలో దూసుకెళతాయని అభిప్రాయపడ్డ కదిరి ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పీవీ సిద్దారెడ్డి, అనంతపురంలో అసెంబ్లీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఒక్క అమరావతిని లక్ష కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసే బదులు, మూడు రాజధానులతో అన్ని ప్రాంతాలనూ అభివృద్ధి చేయవచ్చని తెలిపారు. ఇక్కడ అసెంబ్లీని పెట్టి, శీతాకాల సమావేశాలు నిర్వహిస్తే బాగుంటుందని సిద్దారెడ్డి అభిప్రాయపడ్డారు. వివిధ శాఖల అధిపతుల కార్యాలయాలను కూడా జిల్లాల స్థాయిలో ఏర్పాటు చేయాలని సూచించారు. .
బీజేపీ మాజీ ఫ్లోర్ లీడర్, మాజీ ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్‌రాజు
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అలరారేందుకు అన్ని అర్హతలు ఉన్న నగరం విశాఖ అని బీజేపీ మాజీ ఫ్లోర్ లీడర్, మాజీ ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్‌రాజు అన్నారు. తమ పార్టీ వైఖరి ఏదైనా ఇది తన వ్యక్తిగత అభిప్రాయం అని అన్నారు. విశాఖపట్నం రాజధాని కావడం వల్ల నిర్మాణ వ్యయం చాలావరకు ఆదా అవుతుందన్నారు. రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రభుత్వానికి మిగిలిన వెయ్యి కోట్ల రూపాయలతో పనులు పూర్తి చేసుకోవచ్చని చెప్పారు.
జమ్మూలో పూజలు అందుకోనున్న వెంకటేశ్వరుడు, ముంబై, వారణాసిలో కొలువుతీరనున్న తిరుమల శ్రీనివాసుడు
మూడు రాజధానులపై ప్రకటన చేసిన అనంతరం ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి మౌనం వహిచండం వెనుక రాజకీయ కారణాలు ఉండవచ్చునన్నారు. ముఖ్యంగా మూడు ప్రాంతాల మధ్య ఎటువంటి విభేదాలు రాకుండా ఉండేందుకే ఆయన మౌనం వహించి ఉంటారని అభిప్రాయపడ్డారు. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదిక వచ్చే వరకు జగన్ మౌనాన్నే ఆశ్రయించే అవకాశం ఉందన్నారు. ఈ నివేదిక వచ్చేసరికి కొంత సమయం పట్టవచ్చని తెలిపారు.
రైతుల అరెస్టుపై నిరసనలు
రాజధాని అమరావతికి భూములిచ్చిన తుళ్లూరు మండలం వెంకటపాలెం, ఉద్దండరాయునిపాలెం, మందడం గ్రామాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. నలుగురు రైతుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన రాజధాని రైతుల్లో ఆందోళనకు కారణమైంది. అకారణంగా పోలీసులు తమను అరెస్టు చేస్తున్నారంటూ నిరసన వ్యక్తం చేశారు.
అర్ధరాత్రి దాటాక తమ ఇళ్లలోకి పోలీసులు ప్రవేశించి తనిఖీలు చేపట్టారని, అక్రమంగా పలువురిని అరెస్టు చేశారంటూ ఆరోపించారు. పోలీసుల చర్యతో రైతులు ఆందోళన చెందుతున్నారని, రైతుల్ని విడిచి పెట్టకుంటే పీఎస్ ఎదుట ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.
ఈ అరెస్టులను నిరసిస్తూ పోలీస్ స్టేషన్ ఎదుట టీడీపీ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజా ఆధ్వర్యంలో నిరసనకు దిగారు. రైతులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతులను ఎందుకు అరెస్ట్ చేశారో పోలీసులు స్పష్టంగా చెప్పకపోవడాన్ని ప్రశ్నించారు. అరెస్టు చేసిన రైతులను విడుదల చేసే వరకు ఇక్కడి నుంచి వెళ్లేది లేదని స్పష్టం చేశారు.